సాక్షి, మెదక్: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో మెదక్ జిల్లాకు చెందిన తల్లి కూతుళ్లు మృతి చెందారు. మెదక్ మండలం శివాయిపల్లికి చెందిన తల్లి సంధ్యారాణి కూతురు చందన మృతి చెందారు. సంధ్యారాణి తన కూతురు చందనను బెంగుళూరులో డ్రాప్ చేయడానికి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. సంధ్యారాణి భర్త ఆనంద్ గౌడ్ దుబాయ్‌లో ఓ ప్రైవేటు కంపనీలో ఉద్యోగం చేస్తుండగా.. సంధారాణి భర్తతో కలిసి దుబాయ్‌లో ఉంటున్నారు.
కూతురు చందన బెంగళూర్ లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. దీపావళీ పండగకు ముందు తల్లి సంధ్యారాణి దుబాయ్ నుండి రావడంతో కూతురు చందన కూడా తల్లి వద్దకు వచ్చి పండగకు పెద్దమ్మ ఇంటి వద్ద ఉన్నారు. నిన్న కూతురు చందన తిరిగి బెంగళూరు వెళ్తుండగా తల్లి సంధ్యారాణి కూడా వెళ్లారు. నిన్న సాయంత్రం 6 గంటలకు కావేరీ ట్రావెల్స్ బస్సులో సీట్ నెంబర్ L-14 , l-15 సీట్లు బుక్ చేసుకున్నారు. మూసాపేట్ బోర్డింగ్ పాయింట్‌లో తల్లి కూతుళ్లు బస్ ఎక్కినట్టుగా బంధువులు చెబుతున్నారు.


