
ఆ స్థలాన్ని తనఖా పెట్టి రూ.400 కోట్ల రుణం తీసుకున్న ఆర్టీసీ
ఆర్థిక పరమైన పెండింగ్ సమస్యలు పరిష్కరించే యోచన
రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిల చెల్లింపు, వేతన సవరణ ప్రయోజనాన్ని కల్పించటం,ఆర్జిత సెలవుల మొత్తం చెల్లింపు తదితరాలకు వినియోగించనున్న సంస్థ!
సాక్షి, హైదరాబాద్: గౌలిగూడ బస్టాండ్‌గా పేరొందిన సెంట్రల్ బస్ స్టేషన్ ఒకప్పటి హైదరాబాద్ తొలి ప్రధాన బస్టాండ్. ఎంజీబీఎస్‌కు ముందు దశాబ్దాల పాటు ఇక్కడి నుంచే ఉమ్మడి ఏపీలోని అనేక నగరాలు, పట్టణాలకు సర్విసులు నడిచేవి. భాగ్యనగర చారిత్రక కట్టడాల్లో ఇదీ ఒకటి. తదనంతర కాలంలో మిసిసిపీ హ్యాంగర్‌గా పిలిచే ఈ భారీ ఐరన్ ఫ్రాబ్రికేటెడ్ నిర్మాణం శిథిలమై, కుప్పకూలి కనుమరుగైంది. కానీ ఆ బస్టాండ్ స్థలం ఆర్టీసీకి ఇప్పటికీ సేవలందిస్తూనే ఉంది. ప్రస్తుతం సిటీ సర్విసులు నిలిపే స్థలంగా వినియోగంలో ఉంది. దీని పక్కనే హైదరాబాద్–1 డిపో ఉంటుంది.
ఆర్టీసీకి సంబంధించిన కొన్ని ఇతర నిర్మాణాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిపి దాదాపు 5.8 ఎకరాల విస్తీర్ణంలో ఉంటాయి. అయితే తాజా గా ఈ స్థలాన్ని కొలెటరల్ సెక్యూరిటీగా ఉంచిన ఆర్టీసీ హడ్కో నుంచి రూ.400 కోట్ల రుణాన్ని సమకూర్చుకున్నట్టు తెలిసింది. సంస్థలో పెండింగులో ఉన్న ముఖ్యమైన పనులు పూర్తి చేసేందుకు ఈ నిధులు సేకరించినట్టు సమాచారం. ముఖ్యంగా.. ఆర్టీసీలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన వారికి ఆర్థిక పరమైన సెటిల్‌మెంట్లు పూర్తి చేయడం, 2017 వేతన సవరణ ప్రయోజనాన్ని కల్పించటం, ఆర్జిత సెలవుల మొత్తాన్ని అందించటం, ఆర్టీసీ సహకార పరపతి సంఘం (సీసీఎస్)కు చెందిన వాడేసుకున్న నిధులను తిరిగి జమ చేయటం, పీఎఫ్ బకాయిలు చెల్లించటం లాంటి వాటి కోసం ఈ రుణాన్ని తీసుకున్నట్టు తెలిసింది.
సర్కారు ఆదేశంతో.. : రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపులో జాప్యం జరుగుతుండటంతో వారు రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేసేందుకు సిద్ధమయ్యారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించాలని ఆర్టీసీని ఆదేశించింది. ఇక సీసీఎస్, పీఎఫ్‌లకు సంబంధించి హైకోర్టులో కేసులు నడుస్తున్నాయి. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సరిగా అమలు చేయకపోవటంతో కోర్టు ధిక్కార కేసులు నమోదు కావటం, పీఎఫ్ నుంచి షోకాజ్ నోటీసులు రావటం లాంటి వాటి నేపథ్యంలో.. వీటన్నింటినీ చెల్లించటం ఆర్టీసీకి అత్యవసరమైంది.
గతంలో ఆర్టీసీకి బడ్జెట్ కేటాయింపుల్లో కొన్ని గ్రాంట్లు కూడా ఉండేవి. అలాగే మరికొన్ని పూచీకత్తు రుణాలుండేవి. కానీ, ఇప్పుడు ఆ తీరు పూర్తిగా మారిపోయింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పించటం ద్వారా సంస్థకు ఏర్పడే లోటును ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ ద్వారా భర్తీ చేయాల్సి వస్తోంది. దీంతో బడ్జెట్ కేటాయింపులను పూర్తిగా దానికే పరిమితం చేసి గ్రాంట్లు, లోన్లను అనధికారికంగా రద్దు చేసింది.
దీంతో సంస్థ అవసరాలకు నిధులు లేకుండా పోయాయి. గతంలో ఏవైనా అవసరాలకు ప్రభుత్వ పూచీకత్తుతో రుణాలు పొందే విధానం ఉండగా, కొంతకాలంగా ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని దృష్టిలో ఉంచుకుని పూచీకత్తు ఇవ్వటానికి వెనకాడుతోంది. దీంతో ఆర్టీసీనే సొంతంగా రుణాలు సమకూర్చుకోవాల్సి వస్తోంది. ఇందుకోసం ఆస్తులను తాకట్టు పెడుతోంది. ఈ క్రమంలోనే గౌలిగూడ పాత బస్టాండు స్థలం ఆర్టీసీకి కీలక మేలు చేసి పెట్టింది.