ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణంపై రైల్వేబోర్డుకు అందని రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు
బోర్డుతో అవగాహన ఒప్పందం కుదరాలన్న దక్షిణ మధ్య రైల్వే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణం దిశగా ఇప్పటివరకు అడుగు ముందుకు పడలేదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2 నుంచి గ్రేటర్‌లో ఎంఎంటీఎస్ రైళ్లలో అన్ని వర్గాల ప్రయాణికులకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రకటించారు. ప్రజారవాణా వ్యవస్థను బలోపేతం చేసేదిశగా ఉచిత సేవలను అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. ఇందుకోసం దక్షిణ మధ్య రైల్వేకు ఏటా రూ.10 కోట్లు అందజేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రతిపాదనపైన దక్షిణమధ్య రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించినప్పటికీ రైల్వేబోర్డు ఆమోదిస్తే తప్ప తాము ఈ సదుపాయాన్ని కల్పించలేమని, రాష్ట్ర ప్రభుత్వం, రైల్వేబోర్డు మధ్య అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదరాల్సి ఉంటుందని చెబుతున్నారు.
రైల్వే బోర్డుకు సమాచారం లేదు!
ప్రస్తుతం నగరంలోని వివిధ మార్గాల్లో ప్రతిరోజు సుమారు 75 ఎంఎంటీఎస్ సర్వీసులు నడుస్తున్నాయి. 35 వేల మందికి పైగా ప్రయాణిస్తున్నారు. ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో వ్యక్తిగత వాహనాల వినియోగం కొంత మేరకు తగ్గవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు ఆచరణాత్మకంగానే ఉన్నప్పటికీ రైల్వేబోర్డుకు ఇంకా సమాచారం అందజేయలేదు. ఇప్పటికిప్పుడు ప్రతిపాదనలు సిద్ధం చేసి అందజేసినా రైల్వేబోర్డు పరిశీలించి నిర్ణయం తీసుకొనేందుకు కొంత సమయం పట్టవచ్చు. పైగా ఎంవోయూ కూడా కుదుర్చుకోవలసి ఉంటుంది. జూన్ 2 లోపు ఇదంతా సాధ్యం కాకపోవచ్చుననిపిస్తోంది..’అని దక్షిణమధ్య రైల్వే అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. పైగా ఎంఎంటీఎస్ రెండో దశకు సంబంధించి రాష్ట్రం నుంచి రావలసిన రూ.460 కోట్లకు పైగా బకాయీలపైనా స్పష్టత రావలసి ఉందని ఆయన అన్నారు.
రెండోదశ నిధులే ఇవ్వలేదు..!
హైదరాబాద్‌లో లోకల్ ట్రైన్ సదుపాయాన్ని కల్పించే లక్ష్యంతో ఎంఎంటీఎస్ ప్రాజెక్టును 2003లో స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ)గా ఏర్పాటు చేశారు. దీని నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2/3 వంతు, రైల్వేశాఖ 1/3 వంతు చొప్పున భరించాలని అప్పట్లో నిర్ణయించారు. ఈ మేరకు మొదటి దశ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. 2013లో ఇదే ఒప్పందం ఆధారంగా రెండోదశను ప్రారంభించారు. కానీ ప్రభుత్వం తన వాటా నిధులను పూర్తిగా చెల్లించలేదు. దీంతో ఈ ప్రాజెక్టును దక్షిణ మధ్య రైల్వే సొంతంగా పూర్తి చేయవలసి వచ్చింది. ప్రస్తుతం ఘటకేసర్ నుంచి రాయగిరి వరకు చేపట్టిన యాదాద్రి ఎంఎంటీఎస్ పనులను కూడా దక్షిణ మధ్య రైల్వే సొంత నిధులతో చేపట్టింది. ఇదిలావుండగా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని తెరపైకి తేవడంతో..ఇప్పటివరకు రెండో దశ నిధులను చెల్లించకపోవడాన్ని రైల్వే అధికారులు ప్రధానంగా ఎత్తిచూపుతున్నారు.
సమయ పాలన మెరుగుపరచాలి
ఎంఎంటీఎస్ రైళ్లలో సమయ పాలన మెరుగుపడి, సర్వీసులు పెంచితేనే ప్రయాణికులకు ఉచిత సదుపాయం సద్వినియోగమవుతుందని హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ (హుమ్టా) అధికారులు భావిస్తున్నారు. ప్రతి 15 నిమిషాలకు ఒక సర్వీసు చొప్పున అందుబాటులో ఉండాలని, అన్ని ఎంఎంటీఎస్ స్టేషన్‌లకు సిటీబస్ కనెక్టివిటీ కల్పించాలని సూచిస్తున్నారు. ఎంఎంటీఎస్, మెట్రో, ఆర్టీసీ బస్ సేవలను సమన్వయం చేయడంపై సంస్థ ప్రణాళికలను రూపొందించింది.


