
పీఏసీ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్
సుదీర్ఘ చర్చ అనంతరం ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం
న్యాయ సలహాలు, సంప్రదింపులకు భట్టి, ఉత్తమ్, శ్రీధర్‌బాబు, పొన్నం, సీతక్కలతో ప్రత్యేక కమిటీ
బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై విస్తృత అభిప్రాయ సేకరణ చేయనున్న కమిటీ... ఈనెల 26 కల్లా నివేదిక
అధికారికంగా ఇవ్వగలమా? పార్టీ పరంగా ఇచ్చి వెళ్దామా అనే అంశాలను తేల్చనున్న కమిటీ
ఎన్నికలకు ఎలా వెళ్లాలన్న దానిపై పీఏసీ సభ్యుల భిన్నాభిప్రాయాలు
కోర్టు గడువులోపు ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉన్నామని చెప్పిన సీఎం రేవంత్?
న్యాయ నిపుణులతో చర్చిస్తామన్న డిప్యూటీ సీఎం భట్టి
బీసీలకు రిజర్వేషన్ల కల్పనపై మూడు ఆప్షన్లను చర్చించామన్న మంత్రి ఉత్తమ్
సుప్రీంకోర్టుకు ప్రత్యేకంగా వెళ్లేది లేదు.. పాత కేసులోనేవాదనలు వినిపిస్తాం: సీఎం
ప్రజాప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు: టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలను వీలున్నంత త్వరగా నిర్వహించడానికే కాంగ్రెస్ పార్టీ మొగ్గుచూపుతోంది. ఈ విషయంలో కోర్టులకు వెళ్లి కేసులు వేయడం వల్ల కాలయాపన తప్ప ప్రయోజనం లేదని ఆ పార్టీలోని కీలక నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు శనివారం సాయంత్రం గాందీభవన్‌లో జరిగిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ), సలహా కమిటీల సమావేశంలో ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరిగింది. సమావేశంలో భాగంగా పలువురు సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు కొందరు పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళదామని సూచించగా, మరికొందరు మాత్రం అధికారికంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తేనే మంచిదనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
ఇదే అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ హైకోర్టు ఇచి్చన గడువులోపు స్థానిక ఎన్నికలు పూర్తిచేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అధికారికంగా ఇవ్వగలమా లేదంటే పార్టీపరంగా ప్రకటించి ఎన్నికలకు వెళ్లాలా అనే అంశంపై న్యాయ నిపుణులతో సలహాలు, సంప్రదింపులు జరిపి పార్టీకి నివేదిక ఇచ్చేందుకుగాను ఐదుగురు మంత్రులతో ప్రత్యేక కమిటీని నియమించాలని పీఏసీ నిర్ణయించింది.
ఈ నిర్ణయం మేరకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్‌రెడ్డిలతో చర్చించిన అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఈ కమిటీని అధికారికంగా ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్కలు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని, దేశంలోని న్యాయ నిపుణులు, పార్టీ నాయకులతో కమిటీ విస్తృతంగా చర్చించి ఈ నెల 26వ తేదీలోపు నివేదికను ఇస్తుందని మహేశ్‌గౌడ్ వెల్లడించారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపిన బిల్లు ప్రకారం అధికారికంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించగలమా? లేదా పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించి ముందుకెళ్లాలా అనే అంశాలపై ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది.
ఆరు ప్రధాన అంశాలే ఎజెండాగా భేటీ
సమావేశంలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలు, హైకోర్టు కోర్టు తీర్పు నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు గల ఆప్షన్లు, ఏఐసీసీ పిలుపు మేరకు ఓట్ చోరీ, గద్దీ చోడ్ ఉద్యమాన్ని రాష్ట్రంలో విస్తృతంగా చేపట్టడం, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలు, రాష్ట్రంలో యూరియా కొరత, రాజకీయ పరిణామాల గురించి చర్చించారు.
సమావేశానికి ముందు ఏఐసీసీ చేపట్టిన ఓట్‌చోరీ ప్రచార లోగోను సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఇండియాకూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని ఎంపిక చేయడం పట్ల సమావేశం హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌గౌడ్, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, పార్టీ సీనియర్ నేతలు జానారెడ్డి, వీహెచ్, కేకే, జీవన్‌రెడ్డి, జగ్గారెడ్డి, మధుయాష్కీగౌడ్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్‌లతోపాటు పలువురు మంత్రులు, పీఏసీ సభ్యులు పాల్గొన్నారు.
లోతుగా చర్చించి నిర్ణయం తీసుకున్నాం: డిప్యూటీ సీఎం భట్టి
పీఏసీ భేటీ అనంతరం సీనియర్ మంత్రి ఉత్తమ్, మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్‌లతో కలిసి భట్టి విక్రమార్క విలేకరులతో మాట్లాడారు. బీసీలకు స్థానిక సంస్థలతోపాటు విద్య, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పన, 50 శాతం రిజర్వేషన్ల పరిమితి గురించి పీఏసీ లోతుగా చర్చించిందని చెప్పారు. సెప్టెంబర్ 31 వరకు స్థానిక ఎన్నికల నిర్వహణపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై సుదీర్ఘంగా పలువురు సభ్యుల అభిప్రాయాలను తీసుకున్నామన్నారు.
బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో అధికారికంగా వెళ్లాలా... పార్టీ పరంగా వెళ్లాలా అనే అంశాలపై చర్చించడంతోపాటు, న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలని, ఇందుకోసం కమిటీని నియమించాలని, ఈనెల 28వ తేదీలోపు కమిటీ నివేదిక ఇవ్వాలని పీఏసీ నిర్ణయించిందని చెప్పారు. కమిటీలో సభ్యులపై టీపీసీసీ అధ్యక్షుడు అధికారికంగా నిర్ణయం తీసుకుంటారన్నారు. న్యాయ నిపుణులతో కమిటీ చర్చించి పార్టీకి నివేదిక ఇచ్చిన అనంతరం కేబినెట్‌లో నిర్ణయం తీసుకొని స్థానిక ఎన్నికల విషయంలో ముందుకు వెళతామని స్పష్టం చేశారు.
తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అన్ని రాజకీయ పార్టీలు జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి మద్దతు తెలపాలని కోరుతూ పీఏసీలో తీర్మానించినట్టు వెల్లడించారు. దేశంలోని పౌరుల ఓటు హక్కును కాపాడడం, ఓట్ల చోరీని అరికట్టేందుకు బిహార్‌లో రాహుల్‌గాంధీ చేపట్టిన పాదయాత్రపై పీఏసీలో చర్చ జరిగిందని, ఆ పోరాటానికి పీఏసీ సంపూర్ణంగా మద్దతు తెలిపిందన్నారు. ఈనెల 26న పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు వెళ్లనున్నట్టు చెప్పారు.
విస్తృతంగా చర్చిస్తాం: మంత్రి ఉత్తమ్
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు, అటు విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల గురించి ఎలా ముందుకెళ్లాలన్న దానిపై మూడు ఆప్షన్లను పీఏసీ భేటీలో చర్చించామని చెప్పారు. ఈ విషయంలో విస్తృత స్థాయిలో పార్టీ నేతలతోపాటు న్యాయ నిపుణులతో మాట్లాడుతామని వెల్లడించారు. అభిషేక్ మనుసింఘ్వి, జస్టిస్ సుదర్శన్‌రెడ్డిలతోపాటు రాష్ట్ర అడ్వొకేట్ జనరల్‌లను అధికారికంగా అభిప్రాయం అడుగుతామని తెలిపారు.
ఘన విజయానికి అవకాశం: పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్
టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాపాలన అద్భుతమైన ఫలితాలనిస్తోందని, జనహిత పాదయాత్రలో భాగంగా వెళ్లినప్పుడు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించే అవకాశం ఇప్పుడు పార్టీకి ఉందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, పార్టీ గెలుపు కోసం ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని చెప్పారు.
బీసీలకు మేలు జరగాల్సిందే: సీఎం రేవంత్
పీఏసీ సమావేశంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో కేసీఆర్ తెచి్చన చట్టం ప్రకారం ఒక్కశాతం కూడా అదనంగా బీసీలకు రిజర్వేషన్ రాదని, కానీ బీసీలకు మేలు జరగాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. అందు కోసమే చట్టాన్ని సవరించి ఆర్డినెన్సు తెచ్చామని, ఆ ఆర్డినెన్సును గవర్నర్‌కు పంపితే ఆయన రాష్ట్రపతికి పంపారని చెప్పారు. రాష్ట్రపతికి పంపిన బిల్లులను 90 రోజుల్లో ఆమోదించాలన్న అంశంపై సుప్రీంకోర్టులో మన వాదనలను వినిపించేందుకు ఇద్దరు న్యాయవాదులను నియమించామని చెప్పారు.
ఆ కేసులోనే రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న బీసీ బిల్లు అంశం కూడా వస్తుందని, ప్రత్యేకంగా సుప్రీంకోర్టుకు వెళ్లే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని చెప్పారు. ఒకవేళ అలా వెళ్లే కేసు లిస్టు కావడానికే చాలా సమయం పడుతుందన్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని ఎంపిక చేసినందుకుగాను మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్‌గాం«దీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈనెల 26న బిహార్‌లో రాహుల్‌గాంధీ నిర్వహిస్తున్న ఓట్‌చోరీ పాదయాత్రకు హాజరవుతానని, రాష్ట్రంలో కూడా ఓట్‌చోరీ ఉద్యమాన్ని విస్తృతంగా చేపట్టాలని సూచించారు.
రాష్ట్రంలో యూరియా కొరతపై బీఆర్‌ఎస్, బీజేపీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయని, యూరియా ఇచ్చే పార్టీకే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిస్తానని కేటీఆర్ చెప్పడంలోనే వారి తీరు అర్థమవుతోందన్నారు. యూరియా కోసం తాను నాలుగుసార్లు కేంద్ర మంత్రులు నడ్డా, అనుప్రియా పటేల్‌లను కలిశానని వెల్లడించారు.