సమ్మక్క చరిత్ర తెలియాలంటే.. దీన్ని డీకోడ్‌ చేయాల్సిందే

Medaram sammakka saralamma jathara special Patam decode story - Sakshi

సమ్మక్క, సారలమ్మ జాతర గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. సమ్మక్క కారణజన్మురాలని.. పుట్టుకతోనే మహిమలు చూపేదని కోయపురాణం చెబుతుంది. కాకతీయులతో పోరాడి సమ్మక్క వీరమరణం పొందింది అని చరిత్రకారుల అభిప్రాయం.  సమ్మక్క దైవాంశ సంభూతురాలని భక్తుల విశ్వాసం. ఇంతకీ సమ్మక్క చరిత్రకు సంబంధించిన వివరాలు ఎ‍క్కడున్నాయి?

జాతర సందర్భంగా గోవిందరాజులు, పగిడిద్దరాజులను మేడారం తీసుకువచ్చే పూజారులు ప్రత్యేకంగా తయారు చేసిన జెండాలను మోసుకుంటూ వస్తారు. గోవిందరాజులు, పగిడిద్దరాజులకు వేర్వేరుగా ఈ జెండాలు ఉన్నాయి. ఇలాంటి జెండాలే సమ్మక్క, సారలమ్మలకు ఉన్నాయి. ఆ జెండాలు వందల ఏళ్ల నాటి విషయాలను తమలో దాచుకున్నాయి.

సమ్మక్క చరిత్ర పూర్తిగా లిఖితంగా ఎక్కడా లభించలేదు . అయితే సమ్మక్కతో పాటు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల చరిత్ర మరో రూపంలో నిక్షిప్తమై ఉంది. ఈ చరిత్రను పటం రూపంలో నిక్షిప్తమయ్యిందని ఆదివాసీలు చెబుతుంటారు. అనాదిగా కోయలు, ఆదివాసీలకు వేర్వేరు భాషలు ఉన్నాయి. అయితే చాలా కోయ భాషలకు లిపి లేదు. దీంతో పురాతన పద్దతి అనుసరించి బొమ్మల రూపంలో చరిత్రను నిక్షిప్తం చేశారు.

బొమ్మల రూపంలో చరిత్రను.. ఆనాటి పరిస్థితులను నిక్షిప్తం చేయడం ఎప్పటి నుంచో అమల్లో ఉన్న పద్దతి.  ప్రాచీన ఈజిప్టులు ఇదే పద్దతిని ఫాలో అయ్యారు. ఈజిప్టు చరిత్రకు సంబంధించిన అనేక అంశాలు ఈ బొమ్మల లిపిలోనే మనకు లభ్యమయ్యాయి. వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌గా పేరొందిన మధ్యప్రదేశ్‌లోని భీమ్‌బెట్కా దగ్గర ఈ తరహా బొమ్మల లిపి రూపంలో చరిత్ర అందుబాటులో ఉంది. ఇంచుమించు ఇదే పద్దతిలో ఆదివాసీ దేవతల చరిత్ర లిఖించబడింది.

ఎర​‍్రగా  త్రిభుజాకారంలో తయారు చేసిన ఈ జెండాలనే  వనదేవతల చరిత్ర ఉంది. సమక్క, సారలమ్మల పూర్వీకులు, ప్రకృతితో వారికి ఉన్న సంబంధం అంతా ఇక్కడ బొమ్మల రూపంలో వివరించి ఉంటుంది. ఒక్కో ఆదివాసీ దేవతకు ఒక్కో రూపంలో ఈ జెండాలు ఉన్నాయి. ఈ జెండాలో ఉన్న బొమ్మల ఆధారంగా డోలీలు సమ్మక్క కథను మౌఖికంగా చెబుతారు.

సమక్క, సారలమ్మలతో పాటు ఇతర ఆదివాసీ దేవతలకు సంబంధించి జెండాల గురించి చాలినంత పరిశోధన జరగలేదు. వందల ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న ఈ జెండాలోని బొమ్మల లిపిపై చరిత్రకారులు పరిశోధనలు చేయాల్సి ఉంది. ఈ జెండాలోని అంశాలు, వాటి ఆధారంగా చెబుతున్న మౌఖిక కథలను డీకోడ్‌ చేస్తే ఆదివాసీ దేవతలకు సంబంధించిన మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top