పుర్రె, ఎముకలు ఎత్తుకెళ్లిన దుండగులు
మెదక్ జిల్లా (తూప్రాన్): సగం కాలిన శవాన్ని గుర్తు తెలియని వ్యక్తులు చితి నుంచి బయటపడేశారు. ఈ ఘటన మెదక్ జిల్లా చేగుంటలో శనివారం వెలుగు చూసింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. చేగుంటకు చెందిన కర్రె నాగమణి (70) శుక్రవారం మృతి చెందగా అదే రోజు అంత్యక్రియలు నిర్వహించారు. రెండో రోజు కార్యక్రమం నిర్వహించేందుకు శనివారం కుటుంబీకులు శ్మశానానికి వెళ్లి చూడగా సగం కాలిన నాగమణి మృతదేహం చల్లార్చి చితి పక్కకు పడేసి కనిపించింది.
ఈ విషయం తెలుసుకున్న మురాడి నర్సమ్మ కుటుంబీకులు సైతం శ్మశానానికి చేరుకొని చూడగా నర్సమ్మ చితికి సంబంధించిన బూడిదను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఇటీవల మృతి చెందిన పోచమ్మ, మల్లయ్యకు సంబంధించిన పుర్రెతో పాటు ఎముకలను కూడా ఎత్తుకెళ్లినట్లు స్థానికులు చెప్పారు. అయితే ఎముకలు, పుర్రెలను మృతదేహం నోటిలో ఉంచే బంగారం కోసమా? అసలు ఎందుకు ఎత్తుకెళుతున్నారో తెలియడం లేదు. విచారణ జరుపుతామని ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి పేర్కొన్నారు.


