మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం | Massive Car Accident On Miryalaguda Road | Sakshi
Sakshi News home page

మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం

Apr 30 2026 1:46 PM | Updated on Apr 30 2026 2:57 PM

Massive Car Accident On Miryalaguda Road

మిర్యాలగూడ అర్బన్‌ : కారు అదుపుతప్పి ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అద్దంకి–నార్కట్‌పల్లి రహదారిపై మిర్యాలగూడ పట్టణంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం మైసమ్మకుంట తండాకు చెందిన మెగావత్‌ మంగ్తా (45) మిర్యాలగూడ పట్టణంలోని ఐసీసీఐ బ్యాంకు సెక్యురిటీ గార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం అతడు ద్విచక్ర వాహనంపై మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు వద్ద అద్దంకి–నార్కట్‌పల్లి రహదారి దాటుతుండగా.. గుంటూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు అదుపుతప్పి ఢీకొట్టింది. అంతేకాకుండా కారు రోడ్డు పక్కన ఆపి ఉన్న మరో రెండు బైక్‌లను, ట్రాక్టర్‌ను ఢీకొని ఆగిపోయింది. 

ఈ ప్రమాదంలో మంగ్తా అక్కడికక్కడే మృతిచెందగా.. కురియా తండాకు చెందిన ధనావత్‌ భాస్కర్, కారు సర్వీసింగ్‌ సెంటర్‌లో పనిచేసే సన్నీకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తర్వాత కారులో ప్రయాణిస్తున్న వారు కారును అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. క్షతగాత్రులను స్థానికులు మిర్యాలగూడ పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. టూటౌన్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంగ్తా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్‌ సీఐ సోమనర్సయ్య పేర్కొన్నారు. మృతుడికి భార్య మంగమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 

వాహనాలపైకి దూసుకెళ్లిన కారు.. ఒళ్ళు గగుర్పొడిచే విజువల్స్ ..

 



న్యాయం చేయాలని రాస్తారోకో..
మంగ్తా కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, బంధువులు, మైసమ్మకుంట తండా గ్రామస్తులు ఘటనా స్థలంలో అద్దంకి–నార్కట్‌పల్లి రహదారిపై బైఠాయించారు. మూడున్నర గంటల పాటు రాస్తారోకో చేయడంతో భారీగా ట్రాఫిక్‌ జాం అయ్యింది. పోలీసులు బైపాస్‌ రోడ్డు నుంచి వచ్చే వాహనాలను మిర్యాలగూడ పట్టణం గుండా దారి మళ్లించి కొంతవరకు ట్రాఫిక్‌ను నియంత్రించారు. 

ఆర్డీఓ హామీతో ఆందోళన విరమణ.. 
మిర్యాలగూడ ఆర్డీఓ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకుని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement