సింగరేణిపై రాజకీయాలెందుకు? | Mallu Bhatti Vikramarka Aggressive Comments On BRS | Sakshi
Sakshi News home page

సింగరేణిపై రాజకీయాలెందుకు?

Jun 15 2026 3:38 AM | Updated on Jun 15 2026 3:38 AM

Mallu Bhatti Vikramarka Aggressive Comments On BRS

ఓపెన్‌హౌస్‌లో మాట్లాడుతున్న భట్టి విక్రమార్క. చిత్రంలో మంత్రి శ్రీధర్‌ బాబు, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు

కార్మికుల శ్రమను కించపరిస్తే సహించం

ఓపెన్‌ హౌస్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

శ్రీరాంపూర్‌: సింగరేణిని రాజకీయాల కోసం వాడుకోవద్దని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంత్రి దుద్దిళ్ల« శ్రీధర్‌బాబు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావుతో కలిసి మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌ ఓపెన్‌ కాస్ట్‌ గనిని ఆదివారం ఆయన సందర్శించారు. సంస్థపై వస్తున్న ఆరోపణలు ఖండించేందుకు సంస్థ అధికారులతో అక్కడే మీడియా సమక్షంలో ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం నిర్వహించారు. సింగరేణిపై జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని అవాస్తవాలను ప్రచారం చేస్తూ బీఆర్‌ఎస్‌ నాయకులు రాజకీయ లబ్ధి పొందుతున్నారన్నారు. కార్మికుల శ్రమ, వారి ఆత్మగౌరవాన్ని చులకన చేసేలా బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపణలు చేస్తున్నారన్నారు. 

బొగ్గు పెళ్ల కూడా పోలేదు..... 
బొగ్గు పెళ్ల కూడా దొంగతనంగా బయటకు పోలేదని సింగరేణి అధికారులు తెలిపారు. ఓపెన్‌హౌస్‌లో భాగంగా సింగరేణి సీఎండీ, డైరెక్టర్లు, ఏరియా జీఎం శ్రీనివాస్‌ డిప్యూటీ సీఎం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. బొగ్గు లోడిండ్‌ మొదలు, రవాణా వరకు అన్నీ పారదర్శకంగా జరుగుతున్నాయని, దీని కోసం వీటీఎస్, జీపీఎస్‌ టెక్నాలజీని వాడుతున్నామని తెలిపారు. శాప్‌ సిస్టం ద్వారా ఈ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు. దీన్ని కాదని బొగ్గు పెళ్ల కూడా బయటకు పోదన్నారు.

ఇటీవల వచ్చిన ఆరోపణలను వారు మీడియా సమక్షంలో ఖండించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాశ్‌జ్యోతి, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్‌ బి.జనక్‌ప్రసాద్, డైరెక్టర్లు గౌతమ్‌ పొట్రు, ఎల్‌వీ సూర్యనారాయణ , కొప్పుల వెంకటేశ్వర్లు, తిరుమల్‌రావు, శ్రీరాంపూర్‌ జీఎం శ్రీనివాస్, బెల్లంపల్లి రీజియన్‌ క్వాలిటీ జీఎం వీరభద్రం, సేఫ్టీ జీఎం రవికుమార్, ఓపెన్‌ కాస్ట్‌ ప్రాజెక్ట్‌ అధికారి సీహెచ్‌ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా మంచిర్యాల మోడల్‌
మంచిర్యాలటౌన్‌: మంచిర్యాల పట్టణ ప్రగతి అద్భుతంగా ఉందని, 50 ఏళ్లకు సరిపడేలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఇదే మోడల్‌ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంచిర్యాలలోని ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు నివాసంలో మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సభ్యులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. మంచిర్యాల ఎమ్మెల్యే పట్టుబట్టి నిధులు తీసుకొచ్చి రోడ్ల విస్తరణ, అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ పనులతోపాటు, ఇండస్ట్రియల్‌ పార్కు, ఐటీ హబ్, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, పాఠశాలలు, కళాశాలల నిర్మాణం చేపడుతున్నారని వివరించారు. ఇవి అద్భుతంగా ఉన్నాయని, ఇక్కడ జరిగే అభివృద్ధిని ఒక మోడల్‌గా తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement