మలక్‌పేట హిట్‌&రన్‌ విషాదం.. శ్రావణి కన్నుమూత, నెలలో రెండో విషాదం!

Malakpet Hit And Run Case: Dentist Sravani Dies At NIMS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మలక్‌పేట్‌ హిట్‌ అండ్‌ రన్‌ కేసు విషాదంగా ముగిసింది. కారు ఢీ కొన్న ప్రమాదంలో గాయపడ్డ డాక్టర్‌ శ్రావణి కన్నుమూసింది. చావు బతుకుల నడుమ కొట్టుమిట్టాడుతూ.. మూడు రోజులుగా ఆమె నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే.. 

ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతోనే ఆమె కన్నుమూసిందని వైద్యులు ప్రకటించారు. ఇక నిందితుడిని ఓల్డ్‌ మలక్‌పేటకు చెందిన ఇబ్రహీంగా గుర్తించారు. అంతేకాదు.. నిందితుడికి లైసెన్స్‌, కారుకు పేపర్లు సైతం లేవని వెల్లడించారు పోలీసులు. 

శ్రావణి హస్తినాపురంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో డెంటల్‌ డాక్టర్‌గా విధులు నిర్వహించేవారు. ఇదిలా ఉంటే.. నెల వ్యవధిలో ఆ కుటుంబంలో ఇది రెండో విషాదం. సుమారు 25 రోజుల కిందటే శ్రావణి తల్లి గుండెపోటుతో కన్నుమూయడం గమనార్హం. దీంతో ఆ కుటుంబం శోకంలో మునిగిపోయింది.

సెప్టెంబర్‌ 21వ తేదీన ఓలా బైక్‌ బుక్‌ చేస్కొని శ్రావణి వెళ్తుండగా.. గుర్తు తెలియని కారు ఒకటి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓలా బైక్‌ డ్రైవర్‌ వెంకటయ్య, శ్రావణి గాయపడగా.. పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ శ్రావణి పరిస్థితి విషమంగా మారింది. చివరకు ఆమె తుది శ్వాస విడిచింది. ఇక  సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు ఇబ్రహీంను గుర్తించారు పోలీసులు.

ఇదీ చదవండి: న్యూడ్‌ కాల్స్‌తో ఆమె నన్ను వేధిస్తోంది సార్‌..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top