హైదరాబాద్‌లో పెట్రో బంకుల వద్ద నో స్టాక్‌ బోర్డులు.. భారీ క్యూలు | Long Queues Formed At Petrol Bunks Across Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో పెట్రో బంకుల వద్ద నో స్టాక్‌ బోర్డులు.. భారీ క్యూలు

Apr 28 2026 7:06 AM | Updated on Apr 28 2026 7:46 AM

Long Queues Formed At Petrol Bunks Across Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: పెట్రోల్‌ దొరకదంట.. అర్జంట్‌గా పోయి ట్యాంకు ఫుల్‌ చేయించుకోవాలి అంటూ బంకు దగ్గరికి వెళ్లిన రామారావుకి జనం కాస్త ఎక్కువగా కనబడ్డారు. కాస్త ముందుకు వెళ్తే మరో బంక్‌ ఉంది కదా అనుకుని వెళ్తే.. మైండ్‌ బ్లాక్‌ అయ్యే దృశ్యం కనిపించింది. చూస్తే కిలోమీటర్‌పైగా బండ్లు క్యూ కట్టాయి. పోనీలే ఇంకో బంక్‌ అనుకుంటూ మరో రెండు కిలోమీటర్లు వెళ్లి చూస్తే అక్కడ ‘‘నో స్టాక్‌ బోర్డు’’.

హైదరాబాద్‌లో సోమవారం నుంచి పెట్రో బంకుల వద్ద పరిస్థితి ఇది. మంగళవారం ఉదయం నాటికి అది తీవ్రతరంగా మారింది. పెట్రోల్‌ బంకుల ముందు ద్విచక్ర వాహనాలు, కార్లు భారీగా వరుస కట్టాయి. కొన్ని బంకుల వద్ద నో స్టాక్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మధ్యాహ్నం తర్వాతే పెట్రోల్‌, డీజిల్‌ అంటూ చెబుతున్నారు బంకు నిర్వాహకులు. 

కేవలం హైదరాబాద్‌ మాత్రమే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో బంకుల వద్ద దృశ్యాలు ఇవే. తొలుత ఏపీలో కేవలం డీజిల్‌ కొరత మాత్రమే ఉందని చర్చ జరగ్గా.. ఆ వెంటనే అది పెట్రోల్‌కు కూడా పాకింది. ఆ వెంటనే తెలుగు రాష్ట్రాల సరిహద్దుల గుండా నెమ్మదిగా అంతటా ‘పెట్రో కొరత వైరస్‌’ వ్యాపించేసింది. 

కంపెనీల నిర్వాకమా?
యుద్ధ ప్రభావంతో చమురు ధరలు పెరిగాయి. అయితే దేశీయంగా ఇంధన ధరలు పెరగకపోవడం వల్ల ఆయిల్ కంపెనీలు నష్టాలను భరించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని ప్రైవేట్ కంపెనీలు తమ రిటైల్ అవుట్‌లెట్లకు సరఫరాను తగ్గించగా.. మరికొన్ని ‘రేషన్’ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వ రంగ సంస్థల బంకులపై అదనపు భారం పడుతోంది. 

ఒకేసారి డిమాండ్ పెరగడంతో గంటల తరబడి వాహనాలు క్యూ కడుతుండగా.. సాధారణంగా రెండు మూడు రోజులకు సరిపడే స్టాక్ కొన్ని గంటల్లోనే ఖాళీ అవుతోంది. ఈ పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తున్నది సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న పుకార్లు. 

‘‘పెట్రోల్, డీజిల్‌ అయిపోతోంది’’, ‘‘ఇరాన్‌ యుద్ధం జరుగుతోంది కదా ఇక కష్టమే’’, ‘‘ధరలు పెరుగుతాయి” ఇలాంటి వదంతులతో ప్రజలు అవసరం లేకపోయినా ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం, బాటిళ్లు, క్యాన్లలో నిల్వ చేసుకోవడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడుతోందని అధికారులు అంటున్నారు. ఫలితంగా.. అవసరం ఉన్న వాహనదారులు మాత్రమే కాదు వ్యవసాయ, వ్యాపార, పరిశ్రమ.. ఇతర రంగాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోంది. 

ప్రభుత్వ వ్యవస్థలు ఫెయిల్‌!
తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్‌ కొరత నెలకొందనే ప్రచారం సోషల్‌ మీడియాకే పరిమితమైందని ప్రభుత్వం అంటోంది. అలాగే తగినంత నిల్వలు.. సరఫరా సాఫీగానే ఉందని సివిల్‌ సప్లై అధికారులు చెబుతున్నారు. కానీ, పరిస్థితి అందుకు విరుద్ధంగా కనిపిస్తూ వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది.  ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులను రంగంలోకి దించినట్లు ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ, అది పూర్తి స్థాయిలో జరగడం లేదన్నది జనం మాట. ఈ విషయంలో ఇరు ప్రభుత్వాలు ఘోరంగా విఫలం అవుతున్నాయని తిట్టిపోస్తున్నారు. ఆయిల్ కంపెనీలు సరైన సమాచారం అందించి పంపిణీ వ్యవస్థను మెరుగుపరిస్తేనే ఈ భయాందోళనలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement