
కురవి (మహబూబాబాద్): మండల కేంద్రానికి చెందిన తొడుసు నేహ(15) శనివారం సాయంత్రం మండల కేంద్రం శివారు లింగ్యా తండా వద్ద 365 జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం విధితమే. అదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తల్లి సరిత అపస్మారక స్థితిలోకి చేరుకోవడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కూతురు నేహ మృతి చెందిన విషయం తల్లికి తెలియదు.
ఈ క్రమంలో ఆదివారం నేహకు గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. అశ్రునయనాల మధ్య నేహ అంత్యక్రియలు పూర్తయ్యాయి. నేహ కడసారిచూపునకు నోచుకోకుండా తల్లి సరిత అచేతనావస్థలో కొట్టుమిట్టాడుతుండడంపై గ్రామస్తులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. నేహ అంత్యక్రియలకు సహ విద్యార్థినులు తరలొచ్చారు.
కాంగ్రెస్ నాయకులు ఎర్ర నాగేశ్వరరావు, రాజేందర్‌కుమార్, మాజీ డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్. రెడ్యానాయక్, బీఆర్‌ఎస్ నాయకులు బజ్జూరి పిచ్చిరెడ్డి, నూతక్కి నర్సింహరావు, సంగెం భరత్, బాదె నాగయ్య, మేక నాగిరెడ్డి, గుగులోత్ రవి, నూతక్కి సాంబశివరావు, దుడ్డెల వినోద్.. నేహ మృతదేహం వద్ద నివాళులర్పించి కుటుంబసభ్యులను ఓదార్చారు. బిడ్డను చూసేందుకు వచ్చిన నాయకులను చూసిన తండ్రి వెంకన్న బోరున విలపించాడు. బిడ్డ నీకోసం సార్లు వచ్చారంటూ గుండెలవిసేలా రోదించాడు.