‘హైదరాబాద్‌లో అత్యధిక వర్షం, ఇది రెండోసారి’ | KTR Review Meeting On Hyderabad Heavy Rains And Floods | Sakshi
Sakshi News home page

‘హైదరాబాద్‌లో అత్యధిక వర్షం, ఇది రెండోసారి’

Oct 19 2020 2:07 PM | Updated on Oct 19 2020 5:49 PM

KTR Review Meeting On Hyderabad Heavy Rains And Floods - Sakshi

మూడు చెరువులు తెగడం వల్లే భారీ నష్టం జరిగింది. గడిచిన వారం రోజులుగా శిథిలావస్థకు చేరిన 59 నిర్మాణాలను తొలగించాం. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటివరకు 33 మంది మరణించారు.

సాక్షి, హైదరాబాద్‌: రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. శిథిలావస్థ భవనాలనుంచి ప్రజలను ఖాళీ చేయించామని వెల్లడించారు. ఆస్తి నష్టం జరిగినా.. ప్రాణ నష్టం జరగకూడదనే తమ ప్రయత్నమని చెప్పారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో సోమవారం జీహెచ్‌ఎంసీ అధికారులతో గ్రేటర్‌ పరిధిలో భారీ వర్షాలు, వరదలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్‌లో అసాధారణ వర్షం పడిందని కేటీఆర్ వివరించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో వర్షం కురిసిందని పేర్కొన్నారు. 
(చదవండి: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం)

ఆయన మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ చరిత్రలోనే అత్యధిక వర్షపాతం కురవడం రెండోసారి. మూసీకి 1908లో వరదలు వచ్చాయి. జీహెచ్‌ఎంసీలో ఇప్పటికే 80శాతం అధిక వర్షాలు నమోదయ్యాయి. ఇప్పటికే ప్రజలకు 18,700 కిట్లు పంపిణీ చేశాం. 11 రకాల వస్తువులతో కిట్లు అందిస్తున్నాం. మూడు చెరువులు తెగడం వల్లే భారీ నష్టం జరిగింది. గడిచిన వారం రోజులుగా శిథిలావస్థకు చేరిన 59 నిర్మాణాలను తొలగించాం. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటివరకు 33 మంది మరణించారు. 29 కుటుంబాలకు రూ.5లక్షల సాయం అందించాం. ముగ్గురు గల్లంతయ్యారు.. వారి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. చనిపోయిన వారి డేటా ప్రభుత్వం దగ్గర లేదనే విమర్శలు కరెక్ట్‌ కాదు.

హైదరాబాద్ వర్షంపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు 80మంది సీనియర్ అధికారులను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం 80 ప్రాంతాల్లో నీళ్లు నిలిచాయి. అపార్ట్‌మెంట్లలో విద్యుత్ పునరుద్ధరణ చేస్తున్నాం. దక్షిణ హైదరాబాద్‌లో వర్షం ప్రభావం ఎక్కువ ఉంది. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్స్‌ మొదలు పెడుతాం.60 కోట్ల రూపాయలు వివిధ రూపాల్లో ఖర్చు ఇప్పటికే పెట్టాం. మరో 670 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం. హైదరాబాద్‌, దాంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షంవల్ల సంభవించిన నష్టంపై కేంద్రానికి నివేదిక పంపాము. కేంద్ర సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాం’ కేటీఆర్‌ పేర్కొన్నారు.
(చదవండి: బాధితులకు ఆర్థిక సాయం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement