
విద్యార్థి సేన పరిషత్ విలీన కార్యక్రమంలో కేటీఆర్. చిత్రంలో ప్రశాంత్ రెడ్డి, జగదీశ్‌రెడ్డి, గ్యాదరి కిశోర్ తదితరులు
క్విడ్ ప్రో కో కింద బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు రూ. 1,600 కోట్ల కాంట్రాక్టు
బీజేపీ ఎంపీకి కమీషన్లు ఇస్తుంటే రాహుల్ మౌనం ఎందుకు?
రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ నడుమ రాజకీయ అక్రమ సంబంధం
సోనియా ఉత్తరాన్ని అర్థం చేసుకోలేని రేవంత్‌పై జాలి వేస్తోంది
బీఆర్‌ఎస్‌వీలో రాష్ర్టయ విద్యార్థి సేన పరిషత్ విలీన కార్యక్రమంలో కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకం, తాకట్టు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఏపీకి చెందిన బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ కమీషన్లు ఇప్పించాడని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ఆరోపించారు. అందుకు ప్రతిఫలంగా (క్విడ్ ప్రో కో) కింద రూ. 1,600 కోట్ల విలువ చేసే ఫోర్త్ సిటీ రోడ్డు కాంట్రాక్టును ఆయనకు సీఎం అప్పగించారన్నారు. బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ సీఎం రేవంత్‌రెడ్డి రూ. వందల కోట్ల విలువ చేసే కాంట్రాక్టులు ఇస్తుంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు.
బీజేపీ నేతలతో కాంగ్రెస్ సీఎం కుమ్మక్కు అవుతున్న సంగతి రాహుల్‌కు కనిపించడం లేదా అని కేటీఆర్ నిలదీశారు. తెలంగాణ భవన్ వేదికగా బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగంలో తెలంగాణ రా్రïÙ్టయ విద్యార్థి సేన పరిషత్ కేటీఆర్ సమక్షంలో విలీనమైంది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ నడుమ రాజకీయ అక్రమ సంబంధం కొనసాగుతోందని మండిపడ్డారు.
లేఖను చదవలేని రేవంత్‌కు దొంగ డిగ్రీ ఉందేమో?
‘సోనియాగాంధీ రాసిన ఉత్తరంలో ఏముందో చదవడం రాక మురిసిపోతున్న రేవంత్‌రెడ్డిని చూస్తే జాలేస్తోంది. సీఎం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాలేనని సోనియా గాంధీ చెప్పిన మాటను అర్థం చేసుకోలేక తనను ప్రశంసించిందని మురిసిపోతున్నాడు. సోనియా లేఖను కూడా చదివే తెలివి రేవంత్‌రెడ్డికి లేదు. లెటర్‌ను కూడా చదవలేని రేవంత్‌రెడ్డికి దొంగ డిగ్రీ ఉందేమోనని అనుమానం వస్తోంది’అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్న పోలీసు అధికారులు వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు. చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులకు తాము అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు.
ఆఫర్ లెటర్లతో గప్పాలు
‘ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వని రేవంత్‌రెడ్డి.. ఆఫ ర్ లెటర్లు ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నాడు. చరిత్ర ఉన్నంతకాలం తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థులు చేసిన పోరాటాలు, అమరవీరుల బలిదానాలను ప్రజలు చెప్పుకుంటారు. నల్లగొండ జిల్లా కేసీఆర్ పాలనలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. విద్యార్థులు సహా అన్ని వర్గాలకు మోసపూరిత హామీలు ఇచ్చి రేవంత్ అధికారంలోకి వచ్చాడు. హామీల అమలు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రోజుకో ఆరోపణ మాపై చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాడు’అని కేటీఆర్ మండిపడ్డారు. సమావేశంలో మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, పల్లా ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఓటు తూటాతో ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి
లింగంపేట ఆత్మగౌరవ గర్జన సభలో కేటీఆర్
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఓటు అనే తూటాతో బీఆర్‌ఎస్‌ను గెలిపించుకుంటే అహంకారంతో విర్రవీగుతున్న సీఎం రేవంత్‌రెడ్డికి, ఆయనకు తొత్తులుగా పనిచేస్తున్న అధికారులకు బుద్ధి వస్తుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు వ్యాఖ్యానించారు. ‘పాలన చేతగాక రాష్ట్రాన్ని తెర్లు జేసిండ్రు. గురుకులాల్లో నూరు మంది పోరగాండ్లు చనిపోయిండ్రు. అందాల భామలకు లక్ష రూపాయల భోజనం పెట్టిన ప్రభుత్వానికి.. పిల్లలకు వంద రూపాయల భోజనం పెట్టడానికి చేతులు రావడం లేదు.
మీదికెల్లి బలుపు మాటలు.. ఇలాంటి ప్రభుత్వానికి ఓటు తూటానే సరైన సమాధానం’అని కేటీఆర్ పేర్కొన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆత్మగౌరవ గర్జన సభలో లింగంపేటకు చెందిన దళిత నేత ముదాం సాయిలును సన్మానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ లింగంపేటలో అంబేడ్కర్ జయంతి రోజున అంబేడ్కర్ విగ్రహం సాక్షిగా ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు దళిత నేత ముదాం సాయిలు బట్టలూడదీశారన్నారు. కానీ తాము అదే అంబేడ్కర్ సాక్షిగా సాయిలును గౌరవించామన్నారు.
అంబేడ్కర్ స్ఫూర్తితోనే కేసీఆర్ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని.. తెలంగాణ ఏర్పడిన తర్వాత 125 అడుగులతో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని కేటీఆర్ గుర్తుచేశారు. రేవంత్ ప్రభుత్వ అరాచకాలు, దారుణాల నుంచి తెలంగాణ ప్రజలను రక్షించేది ఒక్క కేసీఆర్ నాయకత్వమేనన్నారు. కాగా, కేసీఆర్ దెబ్బతో తెలంగాణను వదిలివెళ్లిన చంద్రబాబు మళ్లీ తెలంగాణలో టీడీపీ జెండా ఎగరాలని కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఆరోపించారు. ‘బనకచర్ల’పై ఢిల్లీలో సమావేశానికి వెళ్లబోనన్న ముఖ్మమంత్రి రేవంత్‌రెడ్డి.. చంద్రబాబు పిలవగానే ఉరికి సంతకం పెట్టి గోదావరి నీళ్లను రాసిచ్చారని దుయ్యబట్టారు.