అది రైతులను చంపేసే డిస్కమ్‌! | KTR Fires on CM Revanth Reddy: Telangana | Sakshi
Sakshi News home page

అది రైతులను చంపేసే డిస్కమ్‌!

Jun 1 2026 12:49 AM | Updated on Jun 1 2026 12:49 AM

KTR Fires on CM Revanth Reddy: Telangana

సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్‌

24 గంటల కరెంటు సరఫరా ఎగ్గొట్టేందుకే రైతు డిస్కమ్‌ పాట 

రైతు బంధు పడకున్నా.. రాహుల్‌ బంధుకు నెలనెలా పడుతున్నాయ్‌.. 

సీఎం రేవంత్‌కు రైతులపై ప్రేమ నేతిబీరలో నెయ్యి చందమే: కేటీఆర్‌

రాంగోపాల్‌పేట్‌ (హైదరాబాద్‌): నేతి బీరకాయలో నెయ్యి ఎంతుంటుందో రైతుల మీద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అంతే ప్రేమ ఉంటుందని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. 24 గంటల కరెంటును ఎగ్గొట్టేందుకే ఇప్పుడు రైతు డిస్కమ్‌ అంటూ పాటపాడుతున్నాడని మండిపడ్డారు. సీఎం చెప్పే రైతు డిస్కమ్‌ రైతు మెడకు ఉరిపెట్టే డిస్కమ్‌ అని, అది రైతులను చంపేసే డిస్కమని ఘాటుగా విమర్శించారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని మిల్లీనియం గార్డెన్‌లో కంటోన్మెంట్‌ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులకు ఎస్‌ఐఆర్, సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై జరిగిన శిక్షణ కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడారు.

ముఖ్యమంత్రి కాక ముందు రేవంత్‌రెడ్డి బయటి దేశానికి వెళ్లినపుడు రైతులకు 3 గంటలు కరెంటు ఇస్తే సరిపోతుందన్నారని, దాన్ని అమలు చేసేందుకు ఇప్పుడు రైతు డిస్కమ్‌ పాట అందుకున్నారన్నారు. రైతులకు ఇచ్చే రైతు బంధు రైతుల ఖాతాలో పడటం లేదు కానీ.. రాహుల్‌ బంధుకు మాత్రం నెలనెలా పడుతున్నాయని దుయ్యబట్టారు. రైతులకు ధాన్యం సంచులు ఇవ్వడం పట్టించుకోకున్నా, ఢిల్లీకి పంపే ధనం సంచుల మీద ముఖ్యమంత్రికి బాగా మోజుందని ధ్వజమెత్తారు.   

ఎన్నికల్లో పోటీ చేయబోమని ప్రకటించే ధైర్యముందా? 
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 6 వేల ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారని, రెండేళ్లలో ఆరు ఇళ్లయినా కట్టించారా, కనీసం ఆరు ఇటుకలైనా పెట్టారా అని కేటీఆర్‌ ప్రశ్నించారు. దమ్ముంటే మీరిచ్చిన 420 హామీలు నెరవేరుస్తామని, లేకుంటే ఎన్నికల్లో పోటీ చేయమని ప్రకటించే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా అని నిలదీశారు. ముఖ్యమంత్రి చిన్న పిల్లల దగ్గరకు వెళ్లినా బూతు పురాణాలు మాట్లాడుతున్నారని, పేగులు మెడలో వేసుకుంటానని, గుడ్లు పీకుతానని, లాగు­లో తొండలు వేస్తానని అంటున్నారని మండిపడ్డారు.

అందుకే ఆయన తమ్ముడు కొండల్‌రెడ్డి లాగే ఈయనను తొండలరెడ్డి పేరుతో పిలవా­లని ఎద్దేవా చేశారు. హా­మీలు నెరవేర్చమంటే కేసీఆర్‌ తెలంగాణను అప్పుల పాలు చేశాడని అంటున్నారని.. అదే నిజమని కానీ అప్పులు చేసి లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌లు నిర్మించారని, రైతుల ఖాతాల్లో రూ.73 వేల కోట్లు వేశారని, రెండుమార్లు రూ.30 వేల కోట్లతో రైతు రుణమాఫీ చేశాడని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 60 ఏళ్లలో చేయలేనిది కేసీఆర్‌ 6 నెలల్లో లక్ష కోట్లు ఖర్చు పెట్టి విద్యుత్‌ వ్యవస్థను మార్చి 24 గంటలు కరెంటు ఇచ్చాడన్నారు.

కాంగ్రెస్‌ దరిద్రాన్ని దేశం మొత్తం వదిలించుకుందని కానీ తెలంగాణలో ప్రజలు నెత్తిన పెట్టుకున్నారని, దాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారని కేటీఆర్‌ పేర్కొన్నారు. జూన్‌ 25 నుంచి జూలై 24 వరకు జరగనున్న ఎస్‌ఐఆర్‌పై అప్రమత్తంగా ఉండాలని, బూత్‌స్థాయి నాయకులు బీఎల్‌వోలతో ఉంటూ అర్హులది ఒక్క ఓటు కూడా పోకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement