50 రోజుల్లో 11.17 లక్షల టన్నుల సీఎంఆర్ తరలింపు
రూ.1,000.57 కోట్ల బకాయిల వసూలు
సాక్షి, హైదరాబాద్: రాబోయే ఖరీఫ్ 2026–27 సీజన్ ధాన్యం కొనుగోళ్లకు ముందే పౌర సరఫరాల శాఖను సన్నద్ధం చేసే లక్ష్యంతో చేపట్టిన ‘మిషన్ కే–100’లో గణనీయమైన పురోగతి నమోదైంది. వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 50 రోజులు పూర్తయ్యే నాటికి పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) తరలింపు, గోదాముల ఖాళీ, నిధుల సమీకరణలో శాఖ కీలక ముందడుగు పడింది. ఈ మిషన్ ప్రారంభమైన 50 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 11.17 లక్షల మెట్రిక్ టన్నుల కస్టమ్ మిల్లింగ్ రైస్‌ను మిల్లుల నుంచి గోదాములకు తరలించారు.
పౌరసరఫరాల భవన్‌లో కమిషనర్ ఎం.స్టీఫెన్ రవీంద్ర అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో అన్ని జిల్లాల్లో సీఎంఆర్ తరలింపు పురోగతి, వారపు లక్ష్యాలు, అధికారుల సన్నద్ధతపై సమీక్షించారు. ఈ సందర్భంగా 50 రోజుల్లో చేపట్టిన కార్యక్రమాలను విశ్లేషించారు. అధికారుల పర్యవేక్షణతో గతంలో పనిచేయని 340 మిల్లులు తిరిగి కార్యకలాపాలు ప్రారంభించాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సీఎంఆర్ డెలివరీ చేయని మిల్లుల సంఖ్య 1,351 నుంచి 1,011కి తగ్గింది.
ఖరీఫ్‌కు ముందే గోదాములు ఖాళీ
రాబోయే ధాన్యం కొనుగోళ్లకు నిధుల కొరత లేకుండా కార్పొరేషన్ అవసరమైన నిధుల సమీ కరణ చేపట్టాలని కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర నిర్ణ యించారు. ఇప్పటివరకు నిర్దేశించిన లక్ష్యంలో 75 శాతం నిధులను సమీకరించినట్టు సమావేశంలో వెల్లడించారు. గోదాముల్లో మిగిలి ఉన్న ధాన్యాన్ని దశలవారీగా బహిరంగ వేలం ద్వారా విక్రయించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. దీంతో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు ముందే నిల్వ సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కమిషనర్ తెలిపారు.
మిల్లర్లకు అక్టోబర్ 31 వరకు చివరి అవకాశం
రబీ 2022–23లో బహిరంగ వేలం వేసిన ధాన్యా నికి సంబంధించిన రూ. 3వేల కోట్లకు పైగా ఉన్న బకాయి లను చెల్లించేందుకు మిల్లర్లకు ప్రభుత్వం చివరి అవకా శం కల్పించింది. వచ్చే అక్టోబర్ 31 లోగా మిల్లర్లు ఈ బకాయిలను మూడు వాయిదాల్లో పూర్తి స్థాయిలో చెల్లించాల్సి ఉంటుంది. గడువు లోగా బకా యిలు చెల్లించని మిల్లర్లను డిఫాల్టర్లుగా ప్రకటించ డంతోపాటు 25 శాతం జరిమానా, 12శాతం వడ్డీ వసూలు చేయనుంది. ఈనెల 19 నాటికి బహిరంగ వేలం వేసిన ధాన్యానికి సంబంధించిన బకాయిల నుంచి మొత్తం రూ. 1,000.57 కోట్లు వసూలు చేసినట్లు శాఖ వెల్లడించింది.


