
రామడుగు: కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ కాలువ లొల్లి మరొకరిని బలితీసుకుంది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం శ్రీరాములపల్లికి చెందిన మిట్టపల్లి రాధమ్మ(55)కు చెందిన పొలంతోపాటు షెడ్లు కాళేశ్వరం అదనపు కాలువ నిర్మాణంలో పోతున్నాయి. దీంతో రాధమ్మ మనోవేదనకు గురవుతోంది. ఈక్రమంలో ఎప్పటిలాగే సోమవారం ఉదయం పొలం వద్దకు వెళ్లింది. గుండెపోటుకు గురై చనిపోయింది.
గ్రామస్తులు ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. రాధమ్మ భర్త శివయ్య గత ఫిబ్రవరిలోనే రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. వీరికి ముగ్గురు కుమారులు. వీరి భీవండిలో చేనేత పనులు చేస్తున్నారు. మృతదేహం వద్ద చొప్ప దండి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి మేడిపల్లి సత్యం నివాళులర్పించారు. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 10 రోజుల క్రితం ఇదే గ్రామానికి చెందిన ఒంటెల రాఘవరెడ్డి మనోవేదనతో మృతి చెందారు.