సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల వేళ స్థానికంగా విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉప ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థి మహమ్మద్ అన్వర్ గుండెపోటుతో మృతి చెందారు. దీంతో, విషాదఛాయలు అములుకున్నాయి.
వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి మహమ్మద్ అన్వర్ చేశారు. అయితే, ఈరోజు కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఆయన గుండెపోటుతో మృతి చెందారు. దీంతో, వారి కుటంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. మహమ్మద్ అన్వర్ ఎర్రగడ్డలో నివాసం ఉంటున్నారు.
ఇదిలా ఉండగా.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు యూసఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరగనుంది. 42 టేబుల్స్ ద్వారా 10 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. మొదటి రౌండ్ ఫలితం వెల్లడికి గంట సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఒక్కో రౌండు ఫలితానికి కనీసం 40 నిమిషాలు పట్టనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ లెక్కన మధ్యాహ్నం 2 గంటల కల్లా తుది ఫలితం వచ్చేస్తుందని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ వెల్లడించారు. స్టేడియంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడంతో 14 టేబుళ్లకు బదులు వరుసకు 21 టేబుళ్ల చొప్పున రెండు వరుసల్లో 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో రౌండుకు 42 పోలింగ్ కేంద్రాల ఈవీఎంల ఫలితం వెల్లడవుతుంది. మొత్తం 407 పోలింగ్ కేంద్రాల ఫలితం వెల్లడయ్యేందుకు 10 రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు.


