హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీల అధ్యక్షులు, ప్రధాన నేతలు, జాతీయ నేతలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో రెండు వారాల పాటు పర్యటించి తమ అభ్యర్థికి ఓటు వేయాలంటూ విజ్ఞప్తి చేశారు. రోడ్డు షోలు నిర్వహించారు. కార్నర్ మీటింగ్‌లు పెట్టారు. పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేశారు.
చివరకు చీరల పంపిణీ కూడా జరిగింది. అయితే పోలింగ్ శాతాన్ని పెంచుకోవడంలో మాత్రం దాదాపు అన్ని పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయి. ఓటర్లను పోలింగ్ కేంద్రానికి తీసుకురావడంలో అటు పార్టీలతో పాటు ఇటు ఎన్నికల అధికారులు కూడా చేతులెత్తేశారు. ఓట్లు వేయడానికి చాలామంది ఓటర్లు నిరాసక్తత కనబర్చినట్లు రాత్రి 9 గంటల వరకు నమోదైన 48.47 శాతం పోలింగ్ కళ్లకు కట్టింది.
మంత్రులు, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు, పార్టీల అధ్యక్షులు ప్రచారంలో పాల్గొన్నారే తప్ప ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎక్కడా చెప్పిన దాఖలా లేదు. ఈసారి కనీసం 60 శాతం పోలింగ్ నమోదవుతుందని అంతా భావించారు. చివరకు 50 శాతం లోపు పోలింగ్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచి్చంది.


