
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills ByPoll) బరిలో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. అనంతరం, బుధవారం నామినేషన్ల స్క్రూటినీ(Nominations Scrutiny Completed) ప్రక్రియ ముగిసింది. 17 గంటల పాటు జరిగిన వడపోత అనంతరం పోటీలో 81 మంది అభ్యర్థులు మిగిలారు. 135 నామినేషన్లను ఎన్నికల అధికారి ఖరారు చేశారు. వివిధ కారణాలతో 130 మంది అభ్యర్థులు వేసిన 186 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
కాగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే. ఇక, రేపు నామినేషన్ల విత్ డ్రాకు అవకాశం ఉంది. వీరిలో ఎంత మంది విత్‌డ్రా చేసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. స్క్రూటినీ సందర్బంగా సరైన ఫార్మాట్‌లో పత్రాలు సమర్పించకపోవడం, వివరాలు అసంపూర్తిగా ఉండటంతో నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్ల పరిశీలన ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన సాధారణ పరిశీలకులు రంజిత్ కుమార్ సింగ్ దగ్గరుండి పర్యవేక్షించారు. కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్, బీఆర్‌ఎస్ తరఫున మాగంటి సునీత నామినేషన్లను రిటర్నింగ్ అధికారి ఆమోదించారు.
ఇదిలా ఉండగా.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు, రీజినల్ రింగ్ రోడ్డు బాధిత రైతులు, ఓయూ, నిరుద్యోగ సంఘాల నాయకులు నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఉప ఎన్నికకు నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా 14న ఫలితాలు విడుదల కానున్నాయి. ఉప ఎన్నికల కోసం ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి.
ఇది కూడా చదవండి: స్థానికంపై నేడు నిర్ణయం!