అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇరాన్‌కు భారీ హెచ్చరిక చేశారు. చర్చల పేరుతో అమెరికాతో ఆటలాడవద్దన్నారు. తమకు యుద్ధాన్ని ముగించే లక్ష్యం ఉందని దాన్నిసాకుగా చూపి అమెరికాను తక్కువ అంచనా వేయద్దన్నారు. ఇస్లామాబాద్ చర్చలకు బయిలుదేరే ముందు జేడీవాన్స్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధంలో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. 40 రోజుల పాటు మారణ హోమం సృష్టించిన యుద్ధానికి సంబంధించిన చర్చలు ఇస్లామాబాద్‌లో జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో చర్చల నిమిత్తం జేడీవాన్స్ పాకిస్థాన్ బయిలు దేరారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
జేడీవాన్స్ మాట్లాడుతూ "చర్చలు సానుకూలంగా జరుగుతాయని ఆశిస్తున్నాం, ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఇరాన్ చిత్తశుద్ధితో చర్చలకు వస్తే తాము యుద్ధాన్ని ముగించడానికి సహకరిస్తాం. కానీ తమను బురిడీ కొట్టించాలని చూస్తే మాత్రం కఠినంగా ఉంటాం" అని అన్నారు. అమెరికాను ఎట్టి పరిస్థితుల్లో తక్కువ అంచనా వేయెుద్దని హెచ్చరించారు.
కాగా వ్యక్తిగతంగా కూడా జేడీ వాన్స్‌కు ఈ చర్చలు ఒక అగ్నిపరీక్ష వంటివి 2028 అధ్యక్ష ఎన్నికల్లో వాన్స్ పోటీ చేసే అవకాశం ఉన్నందున, ఈ చర్చల ఫలితం ఆయన రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఒకవేళ చర్చలు సఫలమైతే అది ఆయనకు పెద్ద ప్లస్ అవుతుందని, విఫలమైతే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
కాగా ప్రస్తుతం అమల్లో ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ప్రమాదంలో పడింది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులను ఆపాలని ఇరాన్ కోరుతుండగా ఆ దాడులకు ఈ ఒప్పందానికి సంబంధం లేదని ట్రంప్ మరియు నెతన్యాహు వాదిస్తున్నారు. మరోవైపు, ఇరాన్ మూసివేసిన హర్ముాజ్ జలసంధిని వెంటనే తెరవాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. దీనిపై ట్రంప్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, ఆయిల్ ట్యాంకర్లను అనుమతించకపోవడం ఒప్పంద ఉల్లంఘనే అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చర్చలలో ఏం జరగనుందా అనే టెన్షన్ సర్వత్రా నెలకొంది.


