డ్రోన్లతో ఈహెచ్‌టీ టవర్ల తనిఖీ

Inspection Of EHT Towers With Drones In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ లైన్లు, టవర్ల తనిఖీలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్లు, కృత్రిమ మేథ (ఏఐ) సాయం తీసుకొని చేపట్టిన పైలట్‌ ప్రాజెక్టు విజయవంతమైంది. రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలోని ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ వింగ్, ట్రాన్స్‌కోలు సెంటిలియన్‌ నెట్‌వర్క్స్‌ అనే స్థానిక స్టార్టప్‌ కంపెనీతో కలసి ఈహెచ్‌టీ ట్రాన్స్‌మిషన్‌ టవర్లు, లైన్లు, సబ్‌స్టేషన్‌ల తనిఖీ, పర్యవేక్షణ చేపట్టాయి.

220 కేవీ చంద్రాయణగుట్ట–ఘనాపూర్‌ లైన్, 220 కేవీ శివరాంపల్లి–గచ్చిబౌలి లైన్, 132 కేవీ మిన్‌పూర్‌–జోగిపేట్‌ లైన్, 220 కేవీ బూడిదంపాడు–వడ్డెకొత్తపల్లి లైన్లతోపాటు మరో 10 ఈహెచ్‌టీ ట్రాన్స్‌మిషన్‌ లైన్‌ టవర్లను పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా తనిఖీ చేశారు. కేవలం 20 నిమిషాల వ్యవధిలో ఒక్కో టవర్‌ పరిశీలన పూర్తయింది. టవర్లు, లైన్లలో ఉన్న లోపాలకు సంబంధించిన కచ్చితమైన వివరాలను డ్రోన్లు ఫొటోలు, వీడియోల్లో రికార్డు చేశాయి.

డ్రోన్ల ద్వారా ఈహెచ్‌టీ లైన్లు, టవర్ల తనిఖీలు నిర్వహిస్తే 50 శాతం సమయం, వ్యయం ఆదా అవుతుందని అధికారులు అంచనా వేశారు. డ్రోన్‌ల ద్వారా టవర్ల తనిఖీలో కచ్చితమైన డేటా సేకరించి విశ్లేషించగలమని సెంటీలియన్‌ నెట్‌వర్క్స్‌ వ్యవస్థాపకుడు వెంకట్‌ చుండి తెలిపారు. 

ప్రమాదాలు, ప్రాణనష్టాన్ని నివారించొచ్చు
అత్యంత ప్రమాదకరమైన ఈహెచ్‌టీ లైన్లు, టవర్ల తనిఖీల్లో ప్రమాదాలు, ప్రాణ నష్టాన్ని సైతం నివారించవచ్చు. డ్రోన్ల ద్వారా గుర్తించిన వివరాలతో సత్వర మరమ్మతులు చేయడానికి సైతం వీలు కలగనుంది. ఈ పరిజ్ఞానాన్ని త్వరలో తెలంగాణ ట్రాన్స్‌కో వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశాలున్నాయి.

33 కేవీ, ఆపై విద్యుత్‌ సరఫరా సామర్థ్యం కలిగిన లైన్లను ఈహెచ్‌టీ లైన్లు అంటారు. సాధారణంగా వాటి ఎత్తు 15 నుంచి 55 మీటర్ల వరకు ఉంటుంది. హై వోల్టేజీ సరఫరా ఉన్న సమయంలో ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా ఈహెచ్‌టీ లైన్లు, టవర్ల తనిఖీకి డ్రోన్‌ పరిజ్ఞానం ఉపయోగపడనుంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top