
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవరోధాలు
గతంలో ఇల్లు మంజూరైతే కొత్త ఇల్లు రద్దు
విస్తీర్ణం పెరిగినా, తగ్గినా బిల్లుల నిలిపివేత
పాత ఇల్లు కూలగొట్టి, కొత్త ఇల్లు నిర్మించుకోలేక లబ్ధిదారుల ఆవేదన
కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలం గోవిందాపూర్‌కు చెందిన కురేట్కర్ శ్రీకాంత్ ఇంటికి 600 చదరపు అడుగులకు బదులు, మేస్త్రీ 682 చదరపు అడుగులతో పునాది వేశారు. నిబంధనల ప్రకారం 82 చదరపు అడుగులు ఎక్కువగా ఉండడంతో అధికారులు బిల్లు నిలిపివేశారు. దీంతో మళ్లీ నిబంధనల మేరకే ఇల్లు కడతానని బాండ్ పేపర్ రాసిస్తూ అధికంగా ఉన్న నిర్మాణాన్ని తొలగించి పనులు మొదలు పెట్టాల్సి ఉంది. గోవిందాపూర్ పైలట్ గ్రామం కాగా, ఇక్కడ 105 మందికి ఇళ్ల నిర్మాణానికి అనుమతి వస్తే, ఏడు ఇళ్లు విస్తీర్ణం మించి ఉన్నట్లు గుర్తించి అధికారులు నిలిపివేశారు.
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఇందిరమ్మ ఇళ్ల పథకం నిబంధనలు, ఇతరత్రా కారణాలతో ఇళ్లు మంజూరై నిర్మాణాలు మొదలయ్యాక కూడా వేలాది ఇళ్లు మధ్యలో నిలిపివేయాల్సి వస్తోంది. కొన్నిచోట్ల నిబంధనలకు విరుద్ధంగా ఉంటే అండర్ టేకింగ్ తీసుకుని నిబంధనలకు అనుగుణంగా మార్చుతున్నారు. పైలట్ గ్రామాల్లో చాలా చోట్ల ఇప్పటికీ పునాదుల దశలోనే ఇళ్లు నిలిచిపోయి ఉన్నాయి. ఈ పథకం కింద నిర్మించే ఇల్లు 400 నుంచి 600 చదరపు అడుగులలోపే ఉండాలి.
ఒక చదరపు అడుగు పెరిగినా, తగ్గినా బిల్లు ఆపేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్లు మంజూరు చేయగా, 1.48 లక్షల ఇళ్ల నిర్మాణం మొదలయింది. బేస్‌మెంటు వరకు పూర్తయితే రూ.లక్ష సాయం అందించాలి. అయితే నిబంధనల మేర కు లేవని వేలాది ఇళ్లను రద్దు చేయడం, నిర్మాణం ఆపివేయడం, బిల్లులు నిలిపి వేయడం జరుగుతోందని బాధిత లబ్ధిదారులు వాపోతున్నారు.
మంజూరయ్యాక నిలిపేస్తూ..
పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామాల్లో చాలామంది లబ్ధిదారులు తక్కువ విస్తీర్ణంలో నిర్మాణం నచ్చక, ఇల్లు కట్టేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో కొందరు తమకు ఇల్లు వద్దని అధికారులకు చెబితే ధ్రువీకరణ తీసుకుని రద్దు చేస్తున్నారు. ఇక ముగ్గు పోసి ఇళ్లు నిర్మించడంలో ఎవరైనా నెలల తరబడి జాప్యం చేస్తే కూడా రద్దు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. పునాదుల దశలో.. ఇచ్చే రూ.లక్షకు అదనంగా ఖర్చు కావడంతో చాలామంది వెనుకడుగు వేస్తున్నారు.
గతంలో ఇల్లు మంజూరైనట్లు గుర్తిస్తే ఆపేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 40,867 ఇళ్లకు 30,285 మందికి ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చారు. గత ఇందిరమ్మ ఇళ్ల కింద సర్కారు సాయం పొందారని సుమారు 1,200 మంది బిల్లులు నిలిపివేస్తూ రద్దు చేసేందుకు అధికారులు సిద్ధమైనట్లు సమచారం. గతంలో ఇల్లు తీసుకున్న వారి పూర్తి వివరాలు వెల్లడైతే చాలాచోట్ల ఇళ్లు రద్దయ్యే అవకాశం ఉంది.