పోలీసులందు ఈ పోలీస్‌ వేరయా.. దొంగలతో చేతులు కలిపి ‘ముఠా’ నేతగా ఎదిగి

Hyderabad: Taskforce Constable Eshwar Turn To Pickpocket Gang Leader  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రజలను రక్షించే బాధ్యత పోలీసులదే. ఎక్కడ ఏ అన్యాయం, నేరం జరిగినా ముందుండేది ఖాకీలే. సమాజంలో శాంతి భద్రతలను కాపాడటంలో వీరిదే కీలక పాత్ర. పోలీస్‌ వృత్తికి, యూనిఫామ్‌కు ఉన్న గౌరవం అలాంటిం. అయితే అభాగుల్యకు, బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులే దారితప్పుతున్నారు. తక్కువ కాలంలో కోట్లు సంపాదించాలనే దురుద్దేశంతో అక్రమ మార్గాలు తొక్కుతున్నారు. నేరస్తుల పంచన చేరి తోడు దొంగలుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి కోవకు చెందిన వ్యక్తే కానిస్టేబుల్‌ ఈశ్వర్‌..

వృత్తి పోలీస్‌ అయినా చేసేవన్నీ దొంగ పనులు. ప్రస్తుతం హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. హఫీజ్‌పేటలో నివాసముంటున్న ఈశ్వర్‌ స్వస్థలం ఏపీలోని బాపట్ల జిల్లా స్టూవర్ట్‌పురం. గౌరవనీయమైన పోలీస్‌ వృత్తిలో ఉంటూ దొంగలతో చేతులు కలిపి నెలసరీ మామూళ్లు వసూళ్లు చేయడం ప్రారంభించాడు. కొన్నేళ్లకు ఈశ్వర్‌ ప్రవర్తన మీద ఉన్నతాధికారులకు అనుమానం రావడంతో పోలీస్‌ ఆపరేషన్స్‌కు దూరంగా పెట్టారు. టాస్క్‌ఫోర్స్‌ విభాగానికి అటాచ్‌ చేశారు.

ముఠా నేతగా
అయినా ఈ కానిస్టేబుల్‌ తన వక్ర బుద్దిని మార్చుకోలేదు. అంతేనా రూటు మార్చి కొత్త పద్దతులో డబ్బు సంపాదనకు శ్రీకారం చుట్టాడు. ఇబ్బందుల్లో ఉన్న వారికి ఆర్థిక సాయం చేస్తూ ఆ కుటుంబంలో ఉన్న యువకులు, మైనర్లను తన ఇంటికి తీసుకొచ్చేవాడు. వీరందరితో ఓ ముఠా ఏర్పాటు చేసి చోరీలకు పథకాన్ని రచించేవాడు. ఆ గ్యాంగ్‌కు లీడర్‌గా వ్యవహరించేవాడు. వారితో దొంగతనాలు, చైన్‌ స్నానింగ్‌లు వంటివి చేయించేవాడు. దొంగతనం చేసిన సొమ్ము లక్షల్లో అతని చేతిలోకి రాగానే ఒక్కొక్కరికి రూ. 40 వేల నుంచి 50 వేల వరకు చెల్లించి చేతులు దులుపుకునేవాడు. 

మాయమాటలు చెప్పి బెయిల్‌
ఒకవేళ దొంగలు పోలీసులకు పట్టుబడితే తానే స్వయంగా రంగంలోకి దిగుతాడు. పట్టుబడిన నిందితులు తనకు కావాల్సిన వారని, దగ్గరి బంధువులంటూ ఏదో మాయమాటలు చెప్పి వారిని కేసు నుంచి తప్పించడం, బెయిల్‌పై బయటకు తీసుకురావడం చేసేవాడు. అంతేగాకుండా అంతరాష్ట్ర దొంగలను పట్టుకునేందుకు బయల్దేరగానే వారికి ముందుగానే సమాచారమిచ్చి తప్పించుకునేలా సహకరించేవాడని కూడా ఈశ్వర్‌పై ఆరోపణలున్నాయి.
చదవండి: Hyderabad: టీచర్ల నిర్వాకం.. విద్యార్థులతో పారిశుద్ధ్య పనులు..! 

అధికారుల పరిచయాలతో
చివరికి ఈశ్వర్‌ చోరీలు, దోపిడీలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇప్పటికే అతనిపై చీరాల, బేగంపేట, హుమాయిన్‌నగర్‌ తదితర పోలీస్‌ స్టేషన్‌లో గృహహింస, కిడ్నాప్‌ కింద కేసులు నమోదైనట్లు గుర్తించారు. దీంతో ఐదుసార్లు సస్పెన్షన్‌ వేటు వేశారు. అయితే తనకున్న ఉన్నతస్థాయి అధికారుల పరిచయాలతో నెలల వ్యవధిలోనే మళ్లీ కొలువులో చేరేవాడు. 

నల్గొండ పోలీసులు అరెస్ట్‌ చేసినప్పుడు కూడా సీఐ..ఏ సీపీ స్థాయిలో ఉన్న అధికారులను బదిలీ చేయించగల సత్తా తనకుందని.. తాను దొంగతనం చేయం ఏంటని బుకాయించి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఇతడు చేసే నేరాల్లో మరో కానిస్టేబుల్‌ కూడా సహకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతనిపై కూడా పోలీసులు అంతర్గత విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. వీరిద్దరిపై శాఖపరమైన చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సిద్ధమవుతునట్లు సమాచారం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top