హైదరాబాద్: ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిందని కక్ష పెంచుకుని..ఓ యువతిని ఆమె తల్లిదండ్రుల ఎదుటే గొంతుకోసి అతిదారుణంగా హత్య చేశాడు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటన వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపూజీనగర్‌లో జరిగింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం శ్రీకాకుళంకు చెందిన కాంతారావు, లక్ష్మి దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి పార్శిగుట్టలోని బాపూజీనగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు పవిత్ర (19), రేవతి ఉన్నారు.
పవిత్ర ఇంటర్ పూర్తి చేసి కంప్యూటర్ కోర్సు చదువుతుంది. శ్రీకాకుళంకు చెందిన ఉమాశంకర్ (25 )వీరికి దూరపు బంధువు. ఉమాశంకర్‌కు తల్లిదండ్రులు లేరు, యూసఫ్‌గూడలోని సోదరి వద్ద నివాసం ఉంటూ టైల్స్ పనిచేస్తుంటాడు. చిలకలగూడలో ఉండే సోదరుడి దగ్గరకు వస్తూ.. ఇదే ప్రాంతంలోని కాంతారావు ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో పవిత్రపై కన్నేసిన ఉమాశంకర్ ఆమెను ప్రేమిస్తున్నాని, తనకు ఇచ్చి పెళ్లి చేయాలని ఒత్తిడి చేశాడు. సంక్రాంతి తర్వాత పెళ్లి చేస్తామని పవిత్ర తల్లిదండ్రులు చెప్పారు. అయితే మద్యానికి బానిసైన ఉమాశంకర్‌తో పెళ్లిని పవిత్ర తిరస్కరించింది. కాగా ఆదివారం కాంతారావు కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ వెళ్లి వచ్చారు. తనకు చెప్పకుండా ఎందుకు విజయవాడ వెళ్లారని ఉమాశంకర్ వారితో గొడవకు దిగాడు.
సోమవారం ఉదయం పవిత్ర ఇంటికి వచ్చిన ఉమాశంకర్ మళ్లీ పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చాడు. ఆ సమయంలో కాంతారావు దంపతులు, పవిత్ర ఆమె చెల్లి అందరూ ఇంట్లోనే ఉన్నారు. పెళ్లి గురించి వీరి మధ్య కొద్దిసేపు వాగ్వవాదం జరిగింది. వెంటనే తీవ్ర ఆగ్రహానికి గురైన ఉమాశంకర్ తనతో పాటు తెచ్చుకున్న కత్తితో పవిత్ర గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావంతో తల్లిదండ్రుల కళ్లెదుటే పవిత్ర కన్నుమూసింది. వెంటనే సమాచారం అందుకున్న చిలకలగూడ ఏసీపీ శశాంక్‌రెడ్డి, వారాసిగూడ ఇన్‌స్పెక్టర్ మధుసూదన్‌రెడ్డి, సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు.
తల్లడిల్లిన కుటుంబ సభ్యులు
పవిత్ర తనను ఇష్టపడడం లేదని తెలుసుకున్న ఉమాశంకర్ ముందే పథకం ప్రకారం ఆమెను హత్యచేసేందుకు వచ్చాడు. ఇందులో భాగంగానే తనతో పాటు కత్తిని కూడా తీసుకొచ్చిన ..ఎవరూ ఊహించని విధంగా అకస్మాత్తుగా పవిత్రపై దాడికి పాల్పడి చంపేశాడు. ఈ ఘటనతో పవిత్ర తల్లిదండ్రులు, చెల్లి రేవతి ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఏమి జరుగుతుందో తెలుసుకునేలోపే దారుణం జరిగిపోవడంతో వారు తల్లడిల్లిపోయారు. తమ కళ్లముందే బిడ్డను చంపేయడంతో ఆ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పవిత్ర కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.


