కేబీఆర్‌ పార్కు: చీకటి పడితే భద్రత దైవాధీనం

Hyderabad: How Safe is KBR Park For Women Walkers, CCTV Cameras Not Working - Sakshi

వాక్‌వేలో రక్షణ ప్రశ్నార్థకం

వరుస సంఘటనతో మహిళా వాకర్లలో ఆందోళన

ఘటన జరిగినప్పుడే హడావిడి

ఊసేలేని సీసీ కెమెరాల ఏర్పాటు 

బంజారాహిల్స్‌లోని ప్రతిష్టాత్మక కేబీఆర్‌ పార్కు జీహెచ్‌ఎంసీ వాక్‌వేలో భద్రత చర్యల వైఫల్యం వాకర్లను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. రెండు రోజుల క్రితం తెల్లవారుజామున వాకింగ్‌ చేస్తున్న ఓ మహిళా వాకర్‌ పట్ల గుర్తుతెలియని వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించడం.. గతంలోనూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడమే ఇందుకు ప్రధాన కారణమని వాకర్లు పేర్కొంటున్నారు. 

సాక్షి, హైదరాబాద్‌: కేబీఆర్‌ పార్కు జీహెచ్‌ఎంసీ వాక్‌వేలో మహిళా వారర్‌ పల్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఆగంతకుడి కోసం అటు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, ఇటు బంజారాహిల్స్‌ లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇందుకోసం పార్కు చుట్టూ ఉన్న రహదారులకు ఇరువైపులా వివిధ సంస్థలు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను జల్లెడపడుతున్నారు.  

► మాజీ మంత్రి జానారెడ్డి ఇంటి వైపు ఆగంతకుడు మహిళా వాకర్‌పట్ల అసభ్యంగా ప్రవర్తించి అక్కడి నుంచి పరారైన ఘటన పోలీసు వర్గాలను షాక్‌కు గురి చేసింది. నాలుగు నెలలు తిరగకుండానే వాక్‌వేలో మరో ఘటన చోటు చేసుకోవడం పట్ల పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  

► ఒక వైపు ఇంటర్‌సెప్టార్‌ పోలీసులు మరోవైపు ఫుట్‌ పెట్రోలింగ్‌ పోలీసులు దీనికి తోడు బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన 20 మంది కానిస్టేబుళ్లు నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో వాక్‌వేలో కాపలా కాస్తుండగానే ఈ ఘటన చోటు చేసుకోవడం పట్ల ఉన్నతాధికారులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. దీనికి తోడు వాక్‌వేలో ఉన్న ఒక్క సీసీ కెమెరా కూడా పనిచేయకపోవడం పోలీసులను మరింత అయోమయానికి గురిచేస్తోంది. 

సీసీ కెమెరాను వంచేశాడు.. 
మహిళా వాకర్‌ను వెనుక నుంచి వచ్చి ఇబ్బంది పెట్టిన ఘటనలో ఆగంతకుడు అక్కడ అంతకుముందు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన చోట సీసీ కెమెరాను నేలకు వంచినట్లు గుర్తించారు. ముందస్తు పథకంతోనే ఆగంతకుడు అక్కడ కాపుకాసి మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లుగా నిర్ధారణకు వచ్చారు. 

విరిగిన గేట్లకు మరమ్మతులేవి? 
జీహెచ్‌ఎంసీ వాక్‌వేలో నాలుగైదు చోట్ల గేట్లు విరిగాయి. వీటికి మరమ్మతులు చేయడంలో జీహెచ్‌ఎంసీ అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని కనబరుస్తున్నారు.గతేడాది నవంబర్‌ 11వ తేదీన సినీ నటి షాలూ చౌరాసియాపై దాడి జరిగిన అనంతరం జీహెచ్‌ఎంసీ, పోలీసులు, అటవీ శాఖాధికారులు సమీక్ష నిర్వహించి సీసీ కెమెరాలతో పాటు వీధి దీపాలు, గేట్లకు మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం అమలుకు నోచుకోలేదు. 

సీసీ కెమెరాలేవి? 
నటి షాలూచౌరాసియాపై ఘటన జరిగిన సమయంలో వాక్‌వేలో 64 సీసీ కెమెరాలు ఉన్నట్లు తేలింది. ఆ కెమెరాల్లో ఒక్కటి కూడా పని చేయడం లేదని అప్పుడే గుర్తించారు. అనంతరం డీసీపీ, ఇతర ఉన్నతాధికారులు ఇక్కడ పర్యటించి సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయడమే కాకుండా కొత్తవి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో ఉన్న సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయకపోగా ఒక్క సీసీ కెమెరా కూడా కొత్తది ఏర్పాటు చేయలేదు. హడావుడి తప్పితే సీసీ కెమెరాల ఏర్పాటుపై అధికారులు దృష్టి పెట్టలేదు. (క్లిక్‌: గూగుల్‌ మ్యాప్స్‌లోకి ‘ట్రాఫిక్‌ అడ్డంకుల’ అప్‌డేట్‌)

రూ. కోటి నిధులు అవసరం 
జీహెచ్‌ఎంసీ వాక్‌వేలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటే రూ. కోటి నిధులు అవసరమని ప్రతిపాదనలు రూపొందించారు. సంబంధిత సంస్థను కూడా పిలిపించి అంచనాలు రూపొందించారు. తీరా చూస్తే కోటి రూపాయలు ఎవరు ఇవ్వాలి అన్నదగ్గర నిర్ణయాలు ఆగిపోయాయి. ప్రభుత్వమే రూ. కోటి వెచ్చించి పార్కు చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే బాగుండేది. దాతలను గుర్తించి వారి నుంచి విరాళాలు సేకరించాల్సిందిగా ఉన్నతాధికారులు ఆర్డర్లు పాస్‌ చేశారు. ఇంత పెద్ద మొత్తాన్ని ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. (చదవండి: హైదరాబాద్‌.. ఫలించిన యాభై ఏళ్ల కల! )

వెలగని వీధి దీపాలు 
పార్కు చుట్టూ వాక్‌వేలో చీకటి రాజ్యమేలుతున్నది. నటిపై ఆగంతకుడి దాడికి అక్కడ చీకటి ఉండటమే కారణమని గుర్తించారు. అనంతరం ఇక్కడ వీధి దీపాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా తూతూ మంత్రంగా 30 చోట్ల తాత్కాలిక వీధి దీపాలు ఏర్పాటు చేసి నెల తిరగకుండానే వాటిని పట్టుకెళ్లారు. పోలీసు, జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారుల నిర్వాకంతోనే పార్కు చుట్టూ ఆగంతకుల దాడులు, అసాంఘిక కార్యకలాపాలు, వాకర్లకు భద్రత లేకపోవడం చోటు చేసుకుంటున్నాయని తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top