బోనమెత్తిన గోల్కొండ కోట.. భక్తులతో జనసంద్రం..

Hyderabad: Bonalu Festivities Commence At Golconda - Sakshi

ఆషాఢ మాసం బోనాల జాతరకు అంకురార్పణం

అంబరాన్నంటిన ఉత్సవాల సంబురం

అమ్మవారికి పట్టువ్రస్తాలు సమరి్పంచిన మంత్రులు

ఉజ్జయినీ మహంకాళి ఘటాల ఎదుర్కోలు ప్రారంభం

సాక్షి, గోల్కొండ/చార్మినార్‌/రాంగోపాల్‌పేట్‌: గోల్కొండ కోట బోనమెత్తింది. భక్తులతో జనసంద్రమైంది. ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలకు ఆదివారం అంగరంగ వైభవంగా అంకురార్పణ జరిగింది. శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవార్లకు బోనాలు సమరి్పంచేందుకు భక్తులు కోట దారిపట్టారు. లంగర్‌హౌస్‌ చౌరస్తా వద్ద మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్, ఇంద్రకరణ్‌ రెడ్డిలు అమ్మవారి తొట్టెలకు స్వాగతం పలికారు. కోటలోని జగదాంబిక అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువ్రస్తాలు సమరి్పంచారు. బోనాల జాతరకు వచ్చే భక్తులు కోవిడ్‌ నిబంధనలను పాటించాలని మంత్రి తలసాని సూచించారు.   


అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకువస్తున్న మంత్రులు తలసాని, ఇంద్రకరణ్‌రెడ్డి, బంగారు బోనంతో  జోగిని నిశాక్రాంతి 

ఆకట్టుకున్న ఊరేగింపు.. 
పోతరాజుల విన్యాసాలు, తెలంగాణ జానపద నృత్యాలతో లంగర్‌హౌస్‌ నుంచి ఫతే దర్వాజ మీదుగా కోట వరకు జరిగిన ఊరేగింపు అందరినీ ఆకట్టుకుంది. భారీ దేవతా విగ్రహాలు, డప్పు, డోలుపై యువకుల నృత్యాలతో ముందుకు సాగిన ఊరేగింపు ఫతే దర్వాజ వద్ద స్థానిక ముస్లింలు స్వాగతం పలికారు. ఊరేగింపు కోట చౌరస్తా వరకు సాగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగర కొత్వాల్‌ అంజనీ కుమార్‌ పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

బంగారు బోనం సమర్పణ.. 
భాగ్యనగర్‌ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో భక్తులు గోల్కొండకు తరలివెళ్లి జగదాంబ అమ్మవారికి బంగారు బోనంతో పాటు పట్టు వ్రస్తాలు సమరి్పంచారు. లంగర్‌హౌజ్‌ చౌరస్తా వద్ద బంగారు బోనానికి మంత్రులు దీపం వెలిగించి పూజలు నిర్వహించారు.  

ఘటాల ఎదుర్కోలు షురూ.. 
సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో తొలి ఘట్టమైన ఘటాల ఎదుర్కోలుకు అంకురార్పణ చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఘటాల ఎదుర్కోలు కోసం ఊరి పొలిమేరకు వెళ్తున్న అమ్మవారి ఆభరణాలు, ఘట సామగ్రి, పూలు, పసుపు, కుంకుమలకు పూజలు చేశారు. అనంతరం ఘటాన్ని ముస్తాబు చేసేందుకు కర్బలా మైదాన్‌కు తీసుకెళ్లారు.

కోట కళకళ
భక్తులతో గోల్కొండ కోట కళకళలాడింది. ఆషాఢమాసం బోనాల ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తుల కోలాహలం.. పోతురాజుల సందడితో జాతరలో సందడినెలకొంది. శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవార్లకు బోనం సమర్పించి ప్రత్యేకపూజలు చేశారు. మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. సీపీ అంజనీకుమార్‌ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top