ఇదో గమ్మత్తు కథ.. సీజ్‌ చేసిన గంజాయి ఎటు పోతుందో తెలుసా! | Sakshi
Sakshi News home page

ఇదో గమ్మత్తు కథ.. సీజ్‌ చేసిన గంజాయి ఎటు పోతుందో తెలుసా!

Published Thu, Nov 25 2021 7:45 AM

Hyd Police Negligence In Moving Ganja Sized From Peddlers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పెడ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయి ‘తరలింపు’లో పోలీసుల నిర్లక్ష్యం ఓ ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డుకు కలిసి వచ్చింది. ‘మిగిలిపోయిన’ గంజాయిని సొంతం చేసుకున్న అతగాడు స్థానికంగా విక్రయించాడు. ఇలా ఖరీదు చేసి వినియోగిస్తున్న వారిని పోలీసులు పట్టుకోవడంలో కథ మొత్తం బయటకు వచ్చింది. ఈ ‘గమ్మత్తు’ వ్యవహారంలో సెక్యూరిటీ గార్డుపై రెండు కేసులు నమోదు కాగా.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన హయత్‌నగర్‌ పోలీసులపై చర్యలకు రంగం సిద్ధమవుతోంది. 
చదవండి: HYD: ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యాన్ని అడ్డుకున్న ఆటోడ్రైవర్‌ 

ఠాణాకు మరమ్మతులు జరుగుతుండడంతో..  
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కొన్నాళ్లుగా పోలీసులు గంజాయిపై జంగ్‌ చేస్తున్నారు. ఫలితంగా వరుసగా విక్రేతలు, వినియోగదారులు పట్టుబడుతున్నారు. ఇటీవల హయత్‌నగర్‌ పోలీసులు ఇలాంటి ఓ ముఠాను పట్టుకున్నారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న 9 కేజీల గంజాయిని కోర్టు ఆదేశాలతోనే ధ్వంసం చేయాల్సి ఉంటుంది. అప్పటి వరకు కచ్చితంగా దర్యాప్తు అధికారులు ఆ సరుకును తమ అధీనంలో ఉంచుకోవాలి. సాధారణంగా పోలీసులు ఇలా స్వాధీనం చేసుకున్న గంజాయిని ఠాణాలోనే ఉంచుతారు. ఆ సమయంలో పోలీసుస్టేషన్‌కు మరమ్మతులు జరుగుతుండటంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ గోదాంలో భద్రపరిచారు. 
చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బోణీ.. కవిత సహా ముగ్గురు ఏకగ్రీవం..!

తరలింపులో నిర్లక్ష్యం..  
ఠాణాకు మరమ్మతులు పూర్తయిన తర్వాత పోలీసులు ఈ గంజాయిని తీసుకురావచ్చారు. ప్యాకెట్లలో ఉన్న గంజాయిని తీసుకువచ్చిన బృందం వాటి కింద పరిచిన కార్పెట్‌ కింద పడిపోయిన దాన్ని పట్టించుకోలేదు. ఈ నిర్లక్ష్యమే సదరు గోదాం సెక్యూరిటీ గార్డుకు కలిసి వచ్చింది. గోదాం శుభ్రం చేసే నెపంతో అక్కడ పడిన గంజాయిని అతడు సొంతం చేసుకున్నాడు. దాన్ని తన వద్దే భద్రపరిచి, స్థానికంగా కొందరికి విక్రయించాడు. విడతల వారీగా జరిగిన ఈ విక్రయంపై హయత్‌నగర్‌ పోలీసులకే సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఖరీదు చేసిన వారిని, వారి ద్వారా సదరు సెక్యూరిటీ గార్డును పట్టుకున్నారు. 

నిర్లక్ష్యం బయటకు... 
కొన్నేళ్లుగా నగరంతో పాటు శివారు జిల్లాలకు గంజాయి విశాఖ ఏజెన్సీ నుంచి సరఫరా అవుతోంది. ఈ సెక్యూరిటీ గార్డుకు గంజాయి అలానే చేరిందని పోలీసులు భావించారు. విచారణ నేపథ్యంలోనే తమ నిర్లక్ష్యం బయటపడింది. తాము భద్రపరిచిన గంజాయిలో కొంత భాగం చోరీ చేయడంపై దొంగతనం కేసు, ఆ సరుకును విక్రయించడంపై మాదకద్రవ్యాల చట్టం కింద మరో కేసు నమోదు చేశారు.

ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డును హయత్‌నగర్‌ పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా రిమాండ్‌కు తరలించారు. ఈ ‘గమ్మత్తు’ కథ మొత్తం తెలుసుకున్న ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. సీజ్‌ చేసిన గంజాయి నిల్వ, తరలింపులో నిర్లక్ష్యంగా ఉన్న హయత్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.సురేందర్‌తో పాటు మరో ఇద్దరు పోలీసులకు చార్జి మెమోలు జారీ చేసినట్లు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న అంతర్గత విచారణ ముగిసిన తర్వాత తదుపరి చర్యలు చేపట్టనున్నారని సమాచారం.   

Advertisement
 
Advertisement
 
Advertisement