Hyderabad: పరిశ్రమల నిర్వాకం.. గుంతలు తీసి..  రసాయనాలు దాచి.. 

Hyd: Drug pharma Industries Storing Waste Without Purification - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ను ఆనుకొని ఉన్న పలు రెడ్, ఆరెంజ్‌ కేటగిరీ బల్క్‌ డ్రగ్, ఫార్మా పరిశ్రమలు వ్యర్థాలను శుద్ధి చేయకుండా నిల్వ చేస్తుండటంతో పర్యావరణ హననం జరుగుతోంది. ఇటీవల పీసీబీ టాస్క్‌ఫోర్స్‌ బృందం తనిఖీల్లో ఈ అక్రమాలు వెలుగుచూశాయి. పర్యావరణ నిబంధనలు పాటించనివి, పీసీబీ నుంచి సరైన అనుమతులు తీసుకోకుండానే ఉత్పత్తులు చేస్తున్న ఆరు కంపెనీలను మూసివేయాలంటూ కాలుష్య నియంత్రణ మండలి తాజాగా ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. 

నిబంధనలకు నీళ్లు... 
పలు ఫార్మా, బల్క్‌ డ్రగ్, కంపెనీల్లో ఉత్పత్తులు తయారు చేస్తున్న క్రమంలో ఉత్పన్నమయ్యే ఫార్మా వ్యర్థ జలాలను జీడిమెట్లలోని ఎఫ్లుయెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌కు తరలించకుండా రోజుల తరబడి కంపెనీల ఆవరణలోనే భారీ గుంతలు తీసి వాటిల్లో నిల్వ చేస్తున్నారు. భారీ వర్షాలు కురిసినపుడు వరద నీటితోపాటు ఈ వ్యర్థాలను బయటకు వదలిపెడుతుండడంతో సమీప చెరువులు, కుంటలు కాలుష్య కాసారమవుతున్నాయి. మరికొందరు అక్రమార్కులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు ట్యాంకర్లలో ఈ వ్యర్థాలను తరలించి ఔటర్‌ పరిసరాల్లో ఉన్న పలు చెరువులతో పాటు మూసీలోకి యథేచ్ఛగా డంపింగ్‌ చేస్తున్నారు. 

అంతుచిక్కని లోగుట్టు.. 
నగరంలో పదికిపైగానే పారిశ్రామిక వాడలున్నాయి. వీటిలో సుమారు మూడువేలకు పైగా  పరిశ్రమలు పనిచేస్తున్నాయి. ఇందులో బల్క్‌డ్రగ్స్, రసాయనాల తయారీ, ఇంజినీరింగ్‌ తదితర రంగాలకు చెందిన పరిశ్రమలున్నాయి. పాశమైలారం, జీడిమెట్ల, చర్లపల్లి, కాటేదాన్, జిన్నారం, బొల్లారం తదితర పారిశ్రామికవాడల్లోని అధిక శాతం పరిశ్రమల్లో ఎలాంటి ఉత్పత్తులు తయారవుతున్నాయో ఎవరికీ తెలియదు.

ఇదే తరుణంలో కొందరు అక్రమార్కులు పరిశ్రమ ముసుగులో నిషేధిత ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. పారిశ్రామిక వాడల్లో చాలా పరిశ్రమలకు కనీసం బోర్డు కూడా లేదు. గేట్ల దగ్గర సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. కొత్త వ్య క్తులు లోపలికి వెళ్లేందుకు అవకాశం లేదు. లోపల ఏమి జరుగుతోందో స్థానికులకు కూడా తెలియకుండా నిర్వాహకులు జాగ్రత్త పడటం గమనార్హం. 

కాగితాలకే పరిమితం..  
వాయు, జల కాలుష్యానికి కారణమయ్యే రెడ్, ఆరెంజ్‌ కేటగిరీల్లోకి వచ్చే అన్ని పరిశ్రమలు తప్పనిసరిగా కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతులు తీసుకోవాలి. ఇప్పటివరకు పీసీబీ నుంచి అనుమతులు తీసుకున్న పరిశ్రమల సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 వేల వరకు ఉంటే అందులో నగరం చుట్టు పక్కల 3 వేల వరకు ఉన్నాయి. ప్రాజెక్టు పనుల్ని ప్రారంభించే ముందు కన్సెంట్‌ ఫర్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (సీఎఫ్‌ఈ), పూర్తైన తర్వాత కన్సెంట్‌ ఫర్‌ ఆపరేషన్‌ (సీఎఫ్‌ఓ) తీసుకోవాల్సి ఉంటుంది.

ఇక పీసీబీ అనుమతి పొందిన ప్రతి పరిశ్రమ కచ్చితంగా 6 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పుతో ఉన్న బ్లాక్‌ బోర్డును ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేయాలి. దానిపై తెల్లటి రంగుతో ఏ సంస్థ పేరుతో.. ఏయే ఉత్పత్తుల్ని తయారు చేసేందుకు అనుమతి పొందారు.. ప్రతిరోజూ వెలువడుతున్న వ్యర్థ జలాలు, ఇతర వ్యర్థాల (హజార్డస్‌ వేస్టేజ్‌) పరిమాణం.. వాటిని ఎక్కడికి తరలిస్తున్నారనే తదితర వివరాలను పేర్కొనాలి. కానీ పారిశ్రామిక వాడల్లో ఈ నిబంధన అమలుకు నోచుకోకపోవడం గమనార్హం.  

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top