సాంకేతికతతో అవినీతికి చెక్ అటు పాలకమండలి..
ఇటు స్పెషలాఫీసర్ పాలనలో వివాదాల్లేకుండా పనులు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా గత సంవత్సరం ఏప్రిల్ 29న ఆర్‌వీ కర్ణన్ బాధ్యతలు చేపట్టారు. నేటికి ఏడాది పూర్తవుతోంది. జీహెచ్‌ఎంసీ వంటి పెద్ద కార్పొరేషన్‌లో ఏడాది కాలం అంటే స్వల్ప సమయమే. కొత్తగా బాధ్యతలు చేపట్టే ఎవరికైనా జీహెచ్‌ఎంసీ పాలనవ్యవస్థ, వివిధ విభాగాలు, అర్థం చేసుకునేందుకే ఎంతలేదన్నా ఆర్నెళ్లు పడుతుంది. అందుకే గతంలో కనీసం ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా ఉన్న సీనియర్లనే జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా నియమించేవారు కాగా, ఆ పరిస్థితి మారింది. ఓవైపు కమిషనర్‌గా రెగ్యులర్ బాధ్యతలతో పాటు కర్ణన్‌కు మిగతా వారికంటే అదనపు బాధ్యతలు వచ్చిపడ్డాయి.
వాటిల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది 150 వార్డుల నుంచి 27 స్థానిక సంస్థల విలీనంతో జీహెచ్‌ఎంసీ పరిధి 300 వార్డులకు, పరిధి సైతం మూడురెట్లు పెరిగింది. రాజకీయంగా బలమైన ప్రతిపక్షాలు ఉన్నప్పటికీ, ఎలాంటి రాద్ధాంతాలు, వివాదాలకు తావులేకుండా ఈ రెండు పనుల్ని అతి స్వల్ప సమయంలో విజయవంతంగా పూర్తిచేశారు. బహుశా దాన్ని దృష్టిలో ఉంచుకొనే జనగణన కార్యక్రమానికి సైతం క్యూర్ వరకు ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్‌గా నియమించారు. అన్ని పార్టీలకూ ఎంతో కీలకంగా మారిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికను జిల్లా ఎన్నికల అధికారిగా ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించారు.
‘నగదు’ లేకుండా పనులు
బల్దియా పరిపాలనలో ఎన్నో సంస్కరణలు చేపట్టినప్పటికీ, ప్రముఖంగా చెప్పుకోవాల్సింది నగదు రహిత సేవలు. ఆస్తిపన్ను చెల్లింపుల నుంచి మొదలు పెడితే జీహెచ్‌ఎంసీలో అన్ని సేవలకు ఫీజుల చెల్లింపులకు ఆన్‌లైన్‌లో సదుపాయం కల్పించారు. రెండు అంశాల్ని పరిగణనలోకి తీసుకొని ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. అవినీతికి తావులేకుండా పారదర్శక చెల్లింపులు. ఆయా అవసరాల కోసం ప్రజలు జీహెచ్‌ఎంసీ కార్యాలయాల దాకా రాకుండా సదుపాయం.
డిజిటల్ వినియోగంపై ఎక్కువ శ్రద్ధ చూపారు. ప్రజలు తమ సమస్యల్ని ఫిర్యాదు చేసేందుకు సైతం క్యూఆర్ కోడ్ వినియోగం వంటివాటితో సాంకేతికతతో సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. వివిధ సర్వేల ద్వారా పన్ను పెంచకుండానే జీహెచ్‌ఎంసీ ఆదాయం పెరిగేలా చేయడంతో పాటు వసూళ్లపైనా ప్రత్యేక దృష్టి సారించి గత రికార్డుల్ని బ్రేక్ చేశారు. క్యూర్ వరకు వరద సమస్యల పరిష్కారానికి మాస్టర్‌ప్లాన్, వీధిదీపాల సమస్యల పరిష్కారానికి సర్వే, తదితరమైన వాటిని చేపట్టారు. ఏఎంఓహెచ్‌ల విధులు మార్చారు.
వీటిపై దృష్టి పెట్టాలి..
నాలాలు, రోడ్లు, వీధిదీపాలు, రోడ్లపై చెత్త, అవినీతి వంటి సమస్యల్ని మాత్రం కర్ణన్ పూర్తిగా పరిష్కరించలేకపోయారు. దీర్ఘకాలంగా ఉన్నవాటి పరిష్కారానికి సమయం పట్టనుంది. ప్రజా ఫిర్యాదుల స్వీకరణలో చూపిన శ్రద్ధ ఏటీఆర్‌లపై చూపలేదనే ఆరోపణలున్నాయి.
‘సర్’పై సమీక్ష
ఓటరు జాబితాపై స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కార్యక్రమం పురోగతిపై జీహెచ్‌ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు పాల్గొన్న ఈ సమావేశంలో సర్ మ్యాపింగ్ పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. ఒక్కో బీఎల్‌ఓ రోజుకు వంద మంది ఓటర్లను, ఒక్కో సూపర్‌వైజర్ రోజుకు వెయ్యి మంది ఓటర్లను మ్యాప్ చేయాలనే లక్ష్యాన్ని నిర్ధారించారు. మే 5వ తేదీలోపు మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎన్నికల విభాగం అడిషనల్ కమిషనర్ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

హెల్ప్‌డెస్క్ ఏర్పాటు
ఓటర్లకు సర్ గురించి అవగాహన కోసం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో హెల్ప్‌డెస్క్ (Help Desk) ఏర్పాటు చేశారు. అధికారులు ఇళ్లకు వచ్చినప్పుడు ఏం చేయాలనేది ఇక్కడ వివరిస్తారు.
చదవండి: సీఎం వస్తున్నారని ట్రాఫిక్ నిలిపివేత.. హారన్ల మోత


