
హైకోర్టు న్యాయమూర్తులుగా చలపతిరావు, మొహియుద్దీన్, రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్‌కుమార్‌తో ప్రమాణస్వీకారం చేయిస్తున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే సింగ్
నలుగురితో ప్రమాణం చేయించిన హైకోర్టు సీజే జస్టిస్ ఏకే సింగ్
తొలిరోజే విచారణ చేపట్టిన జస్టిస్ ప్రవీణ్ కుమార్,జస్టిస్ రామకృష్ణా రెడ్డి, జస్టిస్ చలపతిరావు, జస్టిస్ మొహియుద్దీన్
సాక్షి, హైదరాబాద్: హైకోర్టులో కొత్తగా నియమితులైన నలుగురు జడ్జీలు అదనపు న్యాయమూర్తులుగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. గాడి ప్రవీణ్ కుమార్, రామకృష్ణారెడ్డి, సుద్దాల చలపతిరావు, గౌస్ మీరా మొహియుద్దీన్‌తో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ ప్రమాణం చేయించారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాల్‌లో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరిగింది.
కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో పాటు కొత్త జడ్జీల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బాధ్యతలు చేపట్టిన కొత్త జడ్జీలు తొలిరోజు సీనియర్ న్యాయమూర్తులతో కలసి కేసుల విచారణలో పాల్గొన్నారు. వీరి నియామకంతో హైకోర్టులో జడ్జీల సంఖ్య 30కి పెరిగింది. ఇంకా 12 ఖాళీలున్నాయి. ఈ నలుగురిని న్యాయవాదుల కోటాలో జడ్జీలుగా నియమిస్తూ గత నెల 28న కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.