
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్‌లో వర్షం బీభత్సం సృష్టించింది. సోమవారం కురిసిన భారీ నుంచి అతి భారీ వర్షం ధాటికి నగరం అతలాకుతలమైంది. కురిసిన కుండపోత వర్షానికి నగరంలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ అంతరాయం కలిగింది. ముఖ్యంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి విరంచి ఆస్పత్రి వరకు భారీ ట్రాఫ్రిక్ జామ్ ఏర్పడింది. వర్షంతో పాటు ఈదురు గాలులు నగర వాసుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలో నగర వాసులు ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
హయత్‌నగర్, వనస్థలీపురం, అబ్ధుల్లాపూర్ మెట్‌లలో వర్షం కురుస్తుండగా.. దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, కొత్తపేట్, మీర్‌పేట్, ఉప్పల్, రామాంతపూర్, నాచారం, తార్నాకలో భారీ వర్షం కురుస్తోంది. నాంపల్లి,అబిడ్స్,మలక్‌పేట్‌లో దంచికొడుతోంది. రాజ్ భవన్ రోడ్, తెలంగాణ సెక్రటరియేట్ ఎదుట వరద నీరు రోడ్డు మీదకు చేరింది.
తెలంగాణను భారీ నుంచి అతి భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే వర్షం దాటికి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. రానున్న మరో రెండు గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. భారీ వర్షంతో జీహెచ్‌ఎంసీ ,హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు.