Thunderbolt: ఇలా చేస్తే ఆరు బయట ఉన్నా.. పిడుగుల నుంచి రక్షణ పొందొచ్చు

Heavy Rain: Precautions To Safe  From Thunderstorm And Lightning Strikes - Sakshi

వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చి బైక్‌పై తిరిగి వెళ్తుండగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఫ్లైఓవర్‌పై తల్లికొడుకులు సోమవారం పిడుగుపాటుకు మృతి చెందగా.. తండ్రి పరిస్థితి విషమంగా మారింది. ఇదే నెలలో కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కౌటాల మండలంలో పొలానికి వెళ్లి తిరిగి వస్తున్న ఎడ్లబండి పిడుగు వేయడంతో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. జూలై 7న ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పిడుగుపాటుకు ఆరుగురు మృతి చెందగా.. పలుచోట్ల పశువులు బలయ్యాయి. ఇలా ఏటా వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులతో పిడుగులు పడి పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. వర్షాకాలంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే రైతులు, కూలీలు, పశువుల కాపరులు, రోడ్లపై వెళ్లే వాహనదారులు అధికంగా పిడుగుపాటుకు గురవుతున్నారు. అవగాహన కలిగి ఉంటే పిడుగుపాటు నుంచి రక్షించుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. 
– మంచిర్యాలటౌన్‌

ప్రధాన కారణం.. 
వర్షంపడే సమయంలో వాతావరణంలో పీడనం, ఉష్ణోగ్రతలో కలిగే మార్పులు ప్రధానంగా పిడుగులకు కారణమవుతాయి. పిడుగు అంటే ఆకాశంలో సహజసిద్ధంగా ఉత్పన్నమయ్యే విద్యుదుత్పాతం. పిడుగు పడే సమయంలో ఉత్పత్తయ్యే శబ్దం లక్షల డెసిబిల్స్‌లో ఉంటుంది. ఒక మిల్లీ సెకన్‌ కాలంలో మెరుపులతో కూడిన పిడుగు 20 ఆంపియర్ల విద్యుత్‌ ప్రవాహాన్ని విడుదల చేస్తుంది.

అప్పుడు ఏర్పడే శక్తి క్షేత్ర మీటర్‌కు 2 లక్షల వోల్టులతో సమానం.ఇది ఒక లక్ష కిలోమీటర్ల పొడవు ఉంటుంది. రెండు మేఘాల మధ్య అయితే తక్కువలో తక్కువ 7 నుంచి 140 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మేఘాలు ఢీకొన్నప్పుడు జనించే విద్యుత్, ధ్వని తరంగాలు సన్నటి మార్గం గుండా భూమిని చేరుతాయి. ఆ సమయంలో అవి ప్రవహించే మార్గంలో 50 వేల డిగ్రీల వేడి నమోదవుతుంది.

అలా ఉపరితలం మీద నుంచి ఎత్తయిన చెట్లు, ఇనుప స్తంభాలు, ఆలయ ధ్వజస్తంభాలు వంటి వాటి ద్వారా తరంగాలు భూమిలోకి చేరుతాయి. ఆ సమయంలో సమీపంలో ఉన్న మనుషులు, జంతువులు కూడా వాటికి సాధనంగా మారుతారు. కాపర్‌ ఎర్తింగ్‌.. 
పిడుగుపాటు నుంచి తప్పించుకునేందుకు కాపర్‌ ఎర్త్‌ (రాగి తీగ)ను ఏర్పాటు చేసుకోవాలి. దీనిని భవనం పైనుంచి భూమిలోపలి వరకు ఏర్పాటు చేయాలి. కిలోమీటరు దూరంలో పిడుగుపడినా భూమి ఆకర్షిస్తుంది. రాగితీగను ఏర్పాటు చేసుకునే సమయంలో ఉప్పుతోపాటు బొగ్గు కలిపి అందులో వేయాలి. శక్తివంతమైన విద్యుత్‌ ప్రవాహం పిడుగు రూపంలో కిందికి వచ్చినప్పుడు కాపర్‌(రాగి) తీగ ఆపే అవకాశం ఉంది. టవర్లు, సినిమా హాళ్ల వద్ద ఇలాంటివి ఏర్పాటు చేస్తారు. భవనాలు, పరిశ్రమలు అంతస్తులపై రాగి కడ్డీలను ఏర్పాటు చేసుకోవాలి.

జాగ్రత్తలు పాటించాలి
► ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతున్న సమయంలో చెట్ల కిందకు వెళ్లొద్దు. విద్యుత్‌ స్తంభాల సమీపంలో ఉండరాదు. చెట్లు, స్తంభాలకు దూరంగా ఉండాలి. 
 ఇంట్లో ఉన్న స్విచ్‌బోర్డుల నుంచి ప్లగ్గు లు తొలగించాలి. టీవీలకు ఉన్న కేబు ల్‌ తీగలు తొలగించాలి. అలాగే ఉంచితే ఎలక్ట్రికల్‌ వస్తు సామగ్రి దెబ్బతినే ప్రమాదం ఉంది. ► విద్యుత్‌ స్తంభాలు పిడుగులను ఆకర్షించే అవకాశం ఉంది.  
► ఉరుములతో కూడిన వర్షం పడుతుంటే కిటికీలు, తలుపుల వద్ద ఉండి బయటకు చూడవద్దు. కిటికీ తలుపులు మూసేయాలి. 
 ఎత్తైన ప్రదేశంలో నిల్చోని ఫోన్‌ మాట్లాడకూడదు. ఎడ్లబండ్లు, ద్విచక్ర వాహనాలు నడపొద్దు. 
 అధిక నీరు ఉన్నచోట ఉండడంగాని, నీళ్లలో ఈత కొట్టడం చేయకూడదు. 
 ఎర్తింగ్‌ కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమా దం. అలాంటి సమయంలో చెప్పులు లేకుండా బయటకు వెళ్లకూడదు. 

ఆరుబయట ఉంటే.. 
 వర్షం కురిసే సమయంలో పొలాల్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.   
 పిడుగు పడే సమయంలో బయట ఉంటే అరచేతులతో చెవులు మూసుకుని, నేలపై మోకాళ్ల మీద కూర్చోని తల కిందకు వంచి ఉండాలి. 
 వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలకు దూరంగా ఉండాలి. 
 ఈదురుగాలులు, వర్షం పడే సమయంలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ తీగల కింద ఉండొద్దు. 
  గుండే జబ్బులు ఉన్నవారు వర్షం, ఉరుములు, మెరుపుల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 

పిడుగుపాటుకు గురైతే.. 
► పిడుగుపాటుకు గురైన వారు ప్రాణాపాయం నుంచి బయటపడడం అరుదు. అస్వస్థతకు గురైన వారిని వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి. 
 బాధితుడికి వెంటనే ప్రథమ చికిత్స అందించాలి. 
 పిడుగు తాకిన ప్రదేశం తడిగా ఉంటే బాధితుడిని దుప్పటిపై పడుకొబెట్టాలి. 
 ఊపిరి ఆగిపోతే బాధితుడి కృత్రిమ శ్వాస అందించాలి. 
 గుండే కొట్టుకోవడంలో తేడాలు గమనిస్తే ఆస్పత్రికి తీసుకెళ్లే వరకు రెండు చేతులతో ఛాతి పైభాగాన్ని గట్టిగా ఒత్తుతూ ఉండాలి.  

చదవండి: బైక్‌పై వెళ్తుండగా పిడుగు పడి..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top