ఆరు గ్యారంటీలేవీ? | Harish Rao Shocking Comments on Congress Govt | Sakshi
Sakshi News home page

ఆరు గ్యారంటీలేవీ?

Apr 4 2026 4:33 AM | Updated on Apr 4 2026 4:33 AM

Harish Rao Shocking Comments on Congress Govt

పిల్లలు పుడితేగానీ కల్యాణలక్ష్మి రావడం లేదు 

రేవంత్‌... నీ నియోజకవర్గంలో వంద శాతం రుణమాఫీ అమలైందా?  

కొడంగల్‌లో చర్చించుకుందాం రా.. అంటూ హరీశ్‌రావు సవాల్‌  

నారాయణపేట: ‘ఆరు గ్యారంటీల అమలు ఎక్కడ జరుగుతున్నాయి. పిల్లలు పుడితే గానీ కల్యాణలక్ష్మి రావడం లేదు. ‘పాలమూరు బిడ్డలను మోసం చేసి గద్దెనెక్కావు. నీ సొంత నియోజకవర్గంలో ఏ గ్రామంలోనైనా వందశాతం రుణమాఫీ చేపట్టావా.. కొడంగల్‌కు రా చర్చించుకుందాం’అంటూ సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్‌ విసిరారు. నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండల పరిధిలోని తిమ్మారెడ్డిపల్లిలో గురులోకా మసంద్‌ బావాజీని శుక్రవారం ఆయన దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండలంలోని ఎక్కామెడ్‌ శివారులో మీడియాతో మాట్లాడారు.

రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని అసెంబ్లీలో నిలదీస్తే ఇచ్చింది 16 వేల ఉద్యోగాలేనని చెప్పారన్నారు. ఇప్పటికే రైతుబంధు మూడుసార్లు ఎగ్గొట్టావని, వడ్లకు బోనస్‌ రెండుసార్లు ఇవ్వలేదని.. కూట్లో రాయి తీయనోడు.. ఏట్లే రాళ్లు తీశాడంటా అన్నట్టుంది నీ పరిస్థితి అంటూ రేవంత్‌రెడ్డిపై సెటైర్లు వేశారు. ‘మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లారు.. అక్కడ కాంగ్రెస్‌ ఓడిపోయింది. మళ్లీ కేరళలో జరుగుతున్న ఎన్నికల ప్రచారానికి వెళుతున్నారు. రేవంత్‌.. నీది ఐరన్‌ లెగ్‌ అక్కడ సైతం కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోవడం ఖాయం’అంటూ హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 1.83 కోట్ల క్యూబిక్‌ మీటర్ల పనులు చేపడితే, మిగిలిన 30 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులు     చేయడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మూడేళ్లు కావొస్తున్నా పూర్తి చేయడం లేదన్నారు. మూడవ ఫేజ్‌లో ఉన్న పాలమూరు ఎత్తిపోతల పథకంలోని కాల్వలను తవి్వతే కొడంగల్‌కు 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.

90 శాతం పనులు పూర్తి చేసిన పాలమూరును పక్కనపెట్టి కమీషన్ల కోసం రూ.4,500 కోట్లతో నారాయణపేట–కొడంగల్‌ ఎత్తిపోతల పథకాన్ని చేపడుతున్నారని విమర్శించారు. ఫ్యూచర్‌ సిటీ అందాల పోటీలు, ఫుట్‌బాల్‌ షో అంటూ వేల కోట్లు ఖర్చు చేశావు గానీ.. లంబాడ సోదరులకు చేసింది ఏమీ లేదన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement