
ఏపీ జలదోపిడీ వయా బనకచర్ల
బీఆర్‌ఎస్వీ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతుల్లో పీపీటీ ద్వారా వివరించిన హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్/ ఉప్పల్ /కాప్రా: నీళ్ల కోసం మరో తెలంగాణ ఉద్యమం చేస్తామని..బనకచర్ల విషయంలో ఢిల్లీ మెడలు వంచుతామని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం మల్లాపూర్‌లోని ఓ గార్టెన్‌లో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అధ్యక్షతన బీఆర్‌ఎస్వీ రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన హరీశ్‌రావు మాట్లాడుతూ..తన శిష్యుడు రేవంత్‌రెడ్డితోపాటు...ఢిల్లీ కూడా తన చేతిలో ఉందని చంద్రబాబు అనుకుంటున్నారని..రేవంత్, ఢిల్లీ ఒప్పుకున్నా తెలంగాణ సమాజం మాత్రం బనకచర్లకు ఒప్పుకోదని హెచ్చరించారు. తెలంగాణ సమాజం మరో ఉద్యమానికి సిద్ధమవుతుందన్నారు.
అవసరమైతే ఉస్మానియా, కాకతీయ, శాతవాహన యూనివర్సిటీలు మళ్లీ ఉద్యమానికి వేదికలై తెలంగాణ హక్కులు కాపాడుతాయని హెచ్చరించారు. బనకచర్ల విషయంలో రేవంత్‌రెడ్డి తలూపి సంతకం పెట్టినా కేసీఆర్ ఊరుకోడని, తెలంగాణ రైతులు ఊరుకునే ప్రసక్తే ఉండదన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గోదావరి జలాలపై విద్యార్థులకు హరీశ్‌రావు అవగాహన కల్పించారు. తెలంగాణ ద్రోహుల లిస్ట్ రాస్తే మొదటి పేరు చంద్రబాబు, రెండో పేరు రేవంత్ రెడ్డిదేనన్నారు.
కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని, ఉద్యమ జ్ఞాపకాలను తూడిచే ప్రయత్నం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. టీఎస్‌ను టీజీగా మార్చడమే అందుకు నిదర్శనమన్నారు. రేపటితరం నాయకులైన విద్యార్థులే తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణపై కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఇంటి దొంగలు తెలంగాణ నీళ్లు తెలంగాణకు దక్కకుండా చేస్తున్నారని చెప్పారు. దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ జై తెలంగాణ అనే నినాదంపై కాంగ్రెస్ ప్రభుత్వం అప్రకటిత నిషేధం కొనసాగిస్తుందని చెప్పారు.
పెద్ద కోవర్ట్ రేవంత్ రెడ్డే: కేటీఆర్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పెద్ద కోవర్ట్‌గా పనిచేస్తున్నాడని, ఏపీ సీఎం చంద్రబాబు, బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవని గ్రహించి గులాబీ పార్టీ లేకుండా కుట్రలు చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బనకచర్ల పేరిట గోదావరి జలాలను తెలంగాణకు శాశ్వతంగా దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు.
తెలంగాణ జల హక్కులకు పిండం పెట్టే కుట్రలను ఆపేందుకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కేటీఆర్ హెచ్చరించారు. బీఆర్‌ఎస్వీ ముగింపు కార్యక్రమంలో కేటీఆర్ ప్రసంగించారు. ‘కేసీఆర్‌తో పాటు నన్ను, పార్టీ నేతలను ఇబ్బంది పెట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ కలిసి కట్టుగా కుట్రలు, దాడి చేస్తున్నాయి.
అధికారంలోకి వచ్చి అన్ని లెక్కలు తేలుస్తాం
‘ఫోన్ ట్యాపింగ్ తాము కూడా చేస్తున్నామని సీఎం రేవంత్ చెప్పాడు. ఆరు గ్యారంటీలు 420 హామీల అమలు గురించి ప్రజలు అడగకుండా ఉండేందుకు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయ్యాయని కల్పిత కథలను సృష్టించారు. విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్ భార్య మీద హత్యాయత్నం కేసు పెట్టిన పోలీసులు గడ్డి తింటున్నారా. రేవంత్‌రెడ్డి కట్టు బానిసలు లాగా పనిచేస్తున్న కొందరు పోలీసులకు మెదడు ఉందా.
అక్రమ కేసులు పెడుతూ, అధికార పార్టీ నేతల అండతో చెలరేగిపోతున్న పోలీసు అధికారుల పేర్లు రాసిపెట్టుకోండి. మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే. మిత్తీతో సహా అన్ని లెక్కలు తే లుస్తాం. కేసులకు భయపడకుండా బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండాలి’అని కేటీఆర్ పిలుపునిచ్చారు.