జిమ్ ట్రైనర్‌తో పాటు ప్రియురాలిపై కేసు
సనత్‌నగర్: ప్రియురాలితో పాటు జిమ్‌కు వచ్చే మహిళా పైలట్‌ను ఒకేసారి లైంగికంగా కలుసుకోవాలని జిమ్ ట్రైనర్ పథకం వేశాడు. అందుకు ప్రియురాలిని ఒప్పించడమే కాకుండా ఆ మహిళా పైలట్‌ను ఒప్పించే బాధ్యతను కూడా ఆమెపై పెట్టాడు. ఇందుకు మహిళా పైలట్ నిరాకరించడంతో ఫేక్ అకౌంట్లతో సోషల్ మీడియా వేదికగా ఆమె పట్ల అసభ్యకర సందేశాలు పంపిస్తూ మానసిక క్షోభకు గురిచేశాడు. దీంతో బాధితురాలు సనత్‌నగర్ పోలీసులను ఆశ్రయించగా జిమ్ ట్రైనర్‌తో పాటు అతని ప్రియురాలిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రగడ్డ చౌరస్తా సమీపంలోని కల్ట్ ఫిట్‌నెస్ జిమ్ మేనేజర్, ట్రైనర్‌గా సంతోష్‌గౌడ్ వ్యవహరిస్తున్నాడు. ఇదే జిమ్‌కు వచ్చే మహిళా పైలట్‌పై కన్నేశాడు. ఆమెను లొంగదీసుకునేందుకు తన ప్రియురాలు రజనితో కలిసి పథకం వేశాడు. ప్రియురాలి ద్వారా మహిళా పైలట్‌పై ఒత్తిడి తీసుకువచ్చాడు. ఇందుకు బాధితురాలు నిరాకరించింది. దీంతో కక్ష పెంచుకున్న సంతోష్‌గౌడ్ ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతాలను సృష్టించి అసభ్యకర సందేశాలు పంపించాడు. వేధింపులు భరించలేక మహిళా పైలట్ సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో సంతోష్‌గౌడ్, అతని ప్రియురాలిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.


