అక్బరుద్దీన్‌కు కేటీఆర్‌ కౌంటర్‌

GHMC Elections 2020 Minister Ktr reaction on mla akbaruddin owaisi  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్ఎంసీ ఎన్నికల పోరులో పార్టీలు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో ప్రచారానికి తెర పడనున్న తరుణంలో  టీఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటున్నారు. టీఆర్ఎస్‌పై ఎంఐఎం నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ‘‘మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ పీవీ నరసింహారావు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ గార్లపై ఈ రోజు మజ్లిస్ అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన అనుచితమైన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాను’’ అంటూ ట్వీట్‌ చేశారు. (మీ తోక ఎలా తొక్కాలో తెలుసు: అక్బరుద్దీన్‌)

ఈ ఇద్దరు నాయకులూ తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన మహనీయులనీ, ఒకరు ప్రధానిగా, మరొకరు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉన్నారని కేటీఆర్‌ తెలిపారు. అటువంటి మహానాయకులపై అనుచిత వ్యాఖ్యలు గర్హనీయమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యాఖ్యలకు చోటులేదని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. మరోవైపు గ్రేటర్‌ ఎన్నికల్లో తమ సత్తా చాటాలనీ బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ తరుణంలో సవాళ్లు, ప్రతి సవాళ్లతో ప్రచారపర్వం వాడివేడిగా కొనసాగుతోంది. అటు ఇప్పటివరకు మిత్ర పక్షాలుగా  ఉన్న టీఆర్‌ఎస్‌, మజ్లీస్ మధ్య తాజా దుమారం మరింత సెగలు రేపుతోంది.

కాగా తాము తలచుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రెండు నెలల్లో కూల్చేయగలమని ఎంఐఎంఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ వ్యాఖ్యలు ఇప్పటికే అగ్గి రాజేశాయి. దీనికితోడు తాజాగా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అంశంపై టీఆర్ఎస్‌పై ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి దమ్ముంటే హుస్సేన్ సాగర్ వద్దున్న ఎన్టీఆర్, పీవీ నరసింహారావు ఘాట్లను కూల్చేయాలని సవాల్ విసిరారు. ఎంఐఎంతో పొత్తు లేదని కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన తమకు ఎవరి కింద బతకాల్సిన దుస్థితి లేదంటూ ఆగ్రహించారు. అంతేకాదు అసెంబ్లీలో తోకను తొక్కి టీఆర్ఎస్‌ను ఎలా నిలబెట్టాలో, ఎలా కూర్చోబెట్టాలో తమకు తెలుసంటూ ఘాటుగా  వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top