
రోడ్డుపై వెళుతున్న వ్యక్తిపై పడ్డ శిథిలాలు
తీవ్ర గాయాలతో మృతి
పలువురికి గాయాలు
మేడ్చల్ రూరల్: మేడ్చల్‌లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఓ భవనం కూలిపోయింది. ఈ ధాటికి మూడు దుకాణాలు ధ్వంసమయ్యాయి. ఎగిరిపడిన భవన శకలాలు తగిలి, రోడ్డుపై నడుచుకుంటున్న వెళ్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఇంట్లో ఉన్న వృద్ధురాలు, మొబైల్ దుకాణం నిర్వాహకుడికి గాయాలయ్యాయి. ఈ ఘటన మేడ్చల్ పట్టణంలో సోమవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో జరిగింది.
స్థానికులు తెలిపిన మేరకు.. మేడ్చల్ పట్టణంలో మార్కెట్ రోడ్డు పక్కన చెందిన శ్రీరాములు గౌడ్‌కు భవనం ఉంది. పాతకాలం నాటి భవనంలో రోడ్డు వైపునకు రెండు పూల దుకాణాలు, ఒక మొబైల్ దుకాణం ఉంది. ఆ వెనుకాల ఉన్న నివాస గృహంలో శ్రీరాములు గౌడ్ చెల్లెలు తిరుపతమ్మ (55) నివాసం ఉంటుంది. సోమవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ భారీ శబ్ధంతో పేలింది. ఆ శబ్దానికి ఆ భవనంలో ఉన్న మూడు దుకాణాలు ధ్వంసం కావడంతో భవన శిథిలాలు చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎగిరి పడ్డాయి.
అదే సమయంలో రోడ్డు మీద నడుచుకుంటున్న వెళ్తున్న గుర్తు తెలియని(40) వ్యక్తికి భవన శకలాలు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కాగా భవన శకలాల్లో కూరుకుపోయిన తిరుపతమ్మకు ఒళ్లు కాలిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆమెతో పాటు భవన పక్కన ఉన్న స్టేషనరీ దుకాణంలో పని చేసే రఫిక్ (23) కూలిపోయిన గోడ శకలాల కింద చేయిపడటంతో చేయి విరిగిపోయింది. అలాగే మొబైల్ దుకాణంలో పని చేసే దినే‹Ù(25)కు గాయాలయ్యాయి. పోలీసు సిబ్బంది ప్రమాద స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.