నలుగురు వర్కింగ్‌ ప్రెసిడెంట్లు! | Four working presidents for Telangana Congress PCC | Sakshi
Sakshi News home page

నలుగురు వర్కింగ్‌ ప్రెసిడెంట్లు!

Apr 16 2026 4:21 AM | Updated on Apr 16 2026 4:21 AM

Four working presidents for Telangana Congress PCC

రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు ఆ పదవులు 

కుల సమాఖ్యలకు వెంటనే చైర్మన్ల నియామకం 

జూన్‌లో కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల నియామకాలు 

జిల్లా స్థాయిలోనూ రాజకీయ వ్యవహారాల కమిటీ  

పదవుల పందేరం కొలిక్కి.. రేవంత్, మీనాక్షి,మహేశ్‌గౌడ్‌ల భేటీలో కీలక నిర్ణయాలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కేడర్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నామినేటెడ్, పార్టీ పదవుల భర్తీపై ముఖ్య నేతల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌లు బుధవారం సమావేశమయ్యారు. ఉదయం 11 గంటల నుంచి నాలుగున్నర గంటలపాటు సుదీర్ఘంగా జరిగిన భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లాల వారీగా నేతల పేర్లను వడబోసిన ముగ్గురు నేతలు.. పలు కీలక పదవుల విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. ముఖ్యంగా కుల సమాఖ్యలకు చైర్మన్లు, పాలకవర్గం నియామకాల విషయంలో ఏకాభిప్రాయానికి రావడంతో రజక, నాయీ బ్రాహ్మణ, వడ్డెర, సగర, వాల్మీకిబోయ, కృష్ణ బలిజ (పూసల), భట్రాజ, కుమ్మరి శాలివాహన, విశ్వబ్రాహ్మణ, మేదరి, గీత, గొర్రెలు, మేకల తదితర పారిశ్రామిక ఫెడరేషన్లకు చైర్మన్లు, పాలకవర్గాలను నియమిస్తూ రెండు, మూడురోజుల్లో ఉత్తర్వులు విడుదల కానున్నాయి. 

మరోవైపు ఖాళీగా ఉన్న పలు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం, జిల్లా స్థాయి నేతలకు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పదవుల గురించి కూడా చర్చించిన నేతలు ఆయా పోస్టులను ఎవరికి కేటాయించాలి? ఏయే సామాజిక వర్గాలకు ఎలా ప్రాతినిధ్యం ఇవ్వాలి? ఏ జిల్లాకు ఎన్ని పదవులు ఇవ్వాలనే దానిపై కూడా ఓ అంగీకారానికి వచ్చారని, అయితే ఆ పోస్టులను జూన్‌ నెలలో ప్రకటించాలని నిర్ణయించినట్టు సమాచారం. కార్పొరేషన్లను ఎమ్మెల్యేలకు కేటాయించే విషయంలో కూడా ఏకాభిప్రాయం కుదిరిందని తెలిసింది. 

నాలుగు వర్కింగ్, ప్రచార కమిటీపై కూడా 
పార్టీ పదవులపై కూడా రేవంత్, మీనాక్షి, మహేశ్‌గౌడ్‌లు చర్చించారు. ముఖ్యంగా టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు ఎవరన్న దానిపై చర్చ ఓ కొలిక్కి వచ్చిందని, ఈసారి పీసీసీకి నలుగురు వర్కింగ్‌ ప్రెసిడెంట్లను నియమిస్తారని, రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ జాబితాలో వరంగల్‌ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, అదే ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ ఎంపీ, ఓ ఏఐసీసీ కార్యదర్శి, అదే జిల్లాకు చెందిన మహిళా నేత ఉన్నట్టు తెలుస్తోంది. ప్రచార కమిటీ చైర్మన్‌ పేరుపై కూడా ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. 

పార్టీ కోశాధికారిగా ఉమ్మడి హైదరాబాద్‌ పరిధిలోని సీఎం సన్నిహితుడిని నియమించే అంశంపైనా చర్చ జరిగినట్టు తెలిసింది. అలాగే పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కొత్త అధికార ప్రతినిధులు, కార్యదర్శులు, పెండింగ్‌లో ఉన్న సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లా«ల అధ్యక్షులు, పలు జిల్లా కమిటీలపై కూడా చర్చ జరిగిందని, అన్ని పదవుల విషయంలో ముగ్గురు నేతలూ ఒక అభిప్రాయానికి వచ్చారని గాం«దీభవన్‌ వర్గాల ద్వారా తెలిసింది. పదవుల జాబితాకు అధిష్టానం ఆమోదం పొందిన తర్వాత అధికారికంగా ప్రకటించాలని నిర్ణయించారు.  

మంత్రులపై ఆరోపణల గురించి చర్చ? 
రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై కూడా నేతలు చర్చించారని తెలుస్తోంది. ముఖ్యంగా జీవన్‌రెడ్డి ఎపిసోడ్‌తో పాటు ఇటీవలి కాలంలో రాష్ట్ర మంత్రివర్గ సభ్యులపై వస్తున్న ఆవినీతి ఆరోపణల గురించి చర్చించినట్టు సమాచారం. మరోవైపు డీలిమిటేషన్‌ బిల్లుపై తెలంగాణ పక్షాన ప్రత్యేక వాదన తెరపైకి తెచ్చిన నేపథ్యంలో ఈ బిల్లు గురించి అవసరమైతే క్షేత్రస్థాయి ఆందోళనకు పార్టీ కేడర్‌ను సిద్ధం చేయాలని కూడా నిర్ణయించారు. టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం వీలైనంత త్వరగా నిర్వహించాలని నిర్ణయించారు.  

డీసీసీ అధ్యక్షుల నేతృత్వంలో పీఏసీలు 
కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగత నిర్మాణంలో మరో కొత్త కమిటీ చేరనుంది. రాష్ట్ర స్థాయిలో ఉన్న రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) తరహాలోనే జిల్లా స్థాయిలోనూ ఏర్పాటు చేస్తున్నారు. డీసీసీ అధ్యక్షుల నేతృత్వంలో ఏర్పాటు కానున్న ఈ పీఏసీల్లో జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, మున్సిపల్‌ చైర్మన్లు, కార్పొరేషన్‌ మేయర్లు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అనుబంధ సంఘాల అధ్యక్షులను సభ్యులుగా నియమించనున్నారు. ఆయా జిల్లాల్లో జరిగే ముఖ్య రాజకీయ పరిణామాలు, ఎన్నికల సందర్భంగా తీసుకునే నిర్ణయాల్లో పీఏసీలు కీలకంగా వ్యవహరించనున్నాయి. అయితే,ఆయా జిల్లాల పీఏసీల్లో తమకు స్థానం కల్పించకపోవడంపై పలువురు రాష్ట్ర కమిటీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది.    

Advertisement
 
Advertisement
Advertisement