భూభారతి చట్టం అమల్లోకి వచ్చి ఏడాది గడుస్తున్నా అందుబాటులోకి రాని అప్పీల్ వ్యవస్థ
రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతాంగం
ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తేనే వీలవుతుందని తిప్పి పంపుతున్న అధికారులు
సాదా బైనామాల దరఖాస్తులు ఇప్పటికే 30% వరకు తిరస్కరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థలో కీలకమైన భూభారతి చట్టం అమల్లోకి వచ్చి ఏడాది అవుతున్నా ముఖ్యమైన సమస్యలకు పరిష్కారం లభించడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఆ చట్టంలో పేర్కొన్న విధంగా అప్పీల్ వ్యవస్థ ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. దీంతో రెవెన్యూ అధికారులు తీసుకున్న నిర్ణయాలపై ఉన్నతాధికారుల వద్దకు వెళ్లే అవకాశమే లేకుండా పోతోందని రైతులు వాపోతున్నారు. మొదటి అప్పిలేట్ అథారిటీ అయిన ఆర్డీవో నుంచి జిల్లా కలెక్టర్, తర్వాత సీసీఎల్‌ఏ వరకు అప్పీల్ చేసుకునే మాడ్యూల్ భూభారతి పోర్టల్‌లో పనిచేయకపోవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
పొరపాటునో, గ్రహపాటునో కింది స్థాయి అధికారులు ఏదైనా తప్పు నిర్ణయం తీసుకున్నా, తగిన డాక్యుమెంట్లు లభించక తిరస్కరణకు గురైన దరఖాస్తులకు మళ్లీ డాక్యుమెంట్లు సమర్పించి పరిష్కరించుకోవాలనుకున్నా అవకాశం ఉండడం లేదు. అప్పీల్ కోసం సంబంధిత కార్యాలయాల వద్దకు వెళ్లినా ఫలితం లేకుండా పోతోంది. ఆన్‌లైన్‌లో అవకాశమివ్వలేదని, తామేమీ చేయలేమని అధికారులు చెçపుతుండడంతో చేసేదేమీ లేక రైతులు వెనుదిరగాల్సి వస్తోంది. అయితే, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు కనీసం ఆ మాడ్యూల్ వైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వస్తున్నాయి. భూభారతి పోర్టల్‌లో వచ్చే అన్ని సమస్యలకూ ఏకకాలంలో పరిష్కారం చూపే అవకాశం లేకపోయినా కనీసం అప్పీల్ చేసే అవకాశం ఇవ్వాలనే ఆలోచన కూడా చేయకపోవడంతో క్షేత్రస్థాయిలో రైతాంగం ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
సాదాబైనామాలదీ ఇదే పరిస్థితి..
భూముల విషయంలో సాధారణంగా వచ్చే సమస్యలకు ప్రత్యేకమైన పరిస్థితుల్లో కూడా అప్పీల్‌కు అవకాశం ఇవ్వకపోవడం గమనార్హం. ముఖ్యంగా సాదాబైనామాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే, అమ్మినవారు కూడా అఫిడవిట్ ఇవ్వాలనే నిబంధనను తొలుత విధించడంతో చాలా దరఖాస్తులు తిరస్కారానికి గురయ్యాయి. నోటీసుల గడువు ముగిసినా అఫిడవిట్ ఇచ్చేందుకు అమ్మినవారు ముందుకు రావడం లేదన్న కారణంతో చాలా దరఖాస్తులను తిరస్కరించారు. మొత్తం 9 లక్షలకు పైగా దరఖాస్తుల్లో దాదాపు 30 శాతం వరకు అనేక కారణాలతో తిరస్కరించగా, వాటిలో ఎక్కువగా అఫిడవిట్ విషయంలోనే తిరస్కారానికి గురయ్యాయి.
ఇప్పుడు అమ్మిన వారు అఫిడవిట్ ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వమే తేల్చింది. ఈ మేరకు ప్రత్యేక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో గతంలో అమ్మిన వారు అఫిడవిట్ ఇవ్వలేదనే నిబంధనతో తిరస్కరించిన దరఖాస్తులపై కలెక్టర్లకు అప్పీల్ చేసుకునే వెసులుబాటును భూభారతి చట్టం కల్పిస్తోంది. కానీ, పోర్టల్‌లో మాత్రం అప్పీల్ మాడ్యూల్ పనిచేయకపోవడంతో దాదాపు 2 లక్షలకు పైగా దరఖాస్తుదారులు ఈ అప్పీల్ వ్యవస్థ కోసం నిరీక్షించాల్సి వస్తోందని రెవెన్యూ వర్గాలే చెబుతున్నాయి. అప్పీల్ వ్యవస్థను ఆన్‌లైన్‌లో ఏర్పాటు చేస్తేనే సాధారణ దరఖాస్తులతో పాటు సాదాబైనామాలకు కూడా అప్పీల్ చేసుకునే అవకాశం లభిస్తుందని వారంటున్నారు.


