బ్యాంక్‌ అకౌంట్‌ తెలుసు?.. ఈ మ్యూల్ అకౌంట్‌ అంటే ఏంటి? | Exposing Mule Accounts: From Common Folk to Corporate Employees in Cyber Crime | Sakshi
Sakshi News home page

మ్యూల్ అకౌంట్ల గుట్టు రట్టు.. సైబర్ నేరాల్లో సామాన్యుల నుంచి ఉద్యోగుల వరకు!

Oct 7 2026 8:34 PM | Updated on Oct 7 2026 8:39 PM

Exposing Mule Accounts: From Common Folk to Corporate Employees in Cyber Crime

సాక్షి,హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేయడానికి ఎంతటి పక్కా వ్యూహాలు రచిస్తున్నారో చెప్పే మరో దిగ్భ్రాంతికర ఉదంతం వెలుగులోకి వచ్చింది. సులభంగా డబ్బు సంపాదించవచ్చనే దురాశతో సామాన్యులే కాదు.. కార్పొరేట్ ఉద్యోగులు, మాజీ సైనికులు, ఎంబీఏ గ్రాడ్యుయేట్లు సైతం సైబర్ నెట్‌వర్క్‌లో భాగమవుతున్నట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) దర్యాప్తులో తేలింది.

దక్షిణాదిలోని ఆరు రాష్ట్రాల్లో టీజీసీఎస్‌బీ అధికారులు చేపట్టిన రెండు వారాల ప్రత్యేక ఆపరేషన్‌లో భారీ సైబర్ రాకెట్ గుట్టు రట్టయింది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయెల్ ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన ఆరు ప్రత్యేక బృందాలు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఏకకాలంలో విస్తృత తనిఖీలు చేపట్టాయి.

చర్యల్లో భాగంగా మొత్తం 101 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో 18 మంది మహిళలు కూడా ఉన్నారు.  ఈ నెట్‌వర్క్‌ ద్వారా ఇప్పటివరకు సుమారు రూ. 17 కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. దేశవ్యాప్తంగా ఈ ముఠాకు సంబంధించిన 1,172 సైబర్ నేరాల లింకులను పోలీసులు ట్రేస్ చేశారు. సైబర్ నేరగాళ్లు బాధితుల నుంచి కాజేసిన డబ్బును నేరుగా తమ ఖాతాల్లోకి వేయకుండా, మధ్యవర్తులు ద్వారా వేరే వ్యక్తుల బ్యాంక్ ఖాతాలను సేకరిస్తారు. వీటినే ‘మ్యూల్ అకౌంట్స్’ అంటారు. ఇలాంటి ఖాతాల ద్వారా డబ్బును స్వీకరించడం, వేరే ఖాతాలకు బదిలీ చేయడం లేదా ఏటీఎంల ద్వారా డ్రా చేస్తుంటారు.

ఈ మోసపూరిత లావాదేవీల్లో సహకరించిన ఖాతాదారులకు, మధ్యవర్తులకు మోసపోయిన మొత్తం నుంచి 5 శాతం వరకు కమిషన్ ముడుతున్నట్లు విచారణలో తేలింది. ఆ తర్వాత ఆ డబ్బును బల్క్ ట్రాన్స్‌ఫర్లు, విదేశీ లింక్ ఉన్న లావాదేవీల ద్వారా దారి మళ్లించి పోలీసులకు చిక్కకుండా మాయం చేస్తున్నారు. అరెస్టయిన 101 మందిలో 19 మందిని ఏజెంట్లుగా, 81 మందిని మ్యూల్ అకౌంట్ హోదార్లుగా గుర్తించారు.

నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, పాస్‌బుక్‌లు, చెక్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు.  విస్మయం గొలుపుతున్న నిందితుల ప్రొఫైల్స్ఈ దర్యాప్తులో అత్యంత విచిత్రమైన, దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే.. ఈ సైబర్ నేరాల నెట్‌వర్క్‌లో పట్టుబడిన వారిలో చదువుకున్న నిపుణులు, ఉన్నత ఉద్యోగులు ఉండటమే

టాటా క్యాపిటల్ సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఏజెంట్‌గా మారి, కమిషన్ కోసం సైబర్ నేరగాళ్లకు మ్యూల్ ఖాతాలను సమకూరుస్తున్నాడు. ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగి తన బ్యాంక్ ఖాతాను నేరాలకు వాడటానికి అనుమతించాడు. ఈ ఒక్కడి ఖాతా దేశవ్యాప్తంగా ఏకంగా 50 సైబర్ క్రైమ్ కేసులతో ముడిపడి ఉంది. మాజీ సైనికుడు  సైబర్ నేరాలకు పాల్పడుతూ 6 కేసుల్లో నిందితుడిగా తేలాడు.  ఫిల్మ్ టెక్నాలజీ డిప్లొమా చేసిన మరో వ్యక్తి 26 కేసుల్లో, ఎంకామ్ పూర్తి చేసిన వ్యాపారి 34 కేసుల్లో లింకులు కలిగి ఉన్నారు. మంజు గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో మార్కెటింగ్ హెడ్‌గా పనిచేస్తున్న ఎంబీఏ గ్రాడ్యుయేట్ కూడా ఈ నెట్‌వర్క్‌లో ఉండి 15 కేసులతో సంబంధం కలిగి ఉన్నాడు.

అత్యంత షాకింగ్ విషయమేమిటంటే.. స్వచ్ఛంద సంస్థల పేరుతో నడిచే ట్రస్ట్ ఖాతాలను కూడా సైబర్ నిధుల బదిలీకి దుర్వినియోగం చేశారు. కేవలం ఈ ఎన్జీవో ఖాతాలే దేశవ్యాప్తంగా 60 కేసులతో కనెక్ట్ అయి ఉన్నాయి. టీజీసీఎస్‌బీ  పరిధిలోని ఏడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో నమోదైన 51 కేసులకు ఈ అరెస్ట్‌లకు సంబంధం ఉంది. అరెస్టయిన వారిలో 50 మందికి పైగా వ్యక్తులు ఐదేసికి పైగా నేరాలతో సంబంధం కలిగి ఉండటం గమనార్హం. ఇది కేవలం రాష్ట్ర సరిహద్దులకే పరిమితం కాకుండా అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ మూలాలు కలిగి ఉందని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement