
విద్యార్థుల ఆత్మహత్యల నివారణపై నిపుణుల సూచన
ఏదో ఒక సందర్భంలో వాళ్లు బాధను వ్యక్తపరుస్తారు.. తేలిగ్గా తీసుకోవద్దు..
ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి.. పిల్లలు చెప్పేది వినాలని తల్లిదండ్రులకు హితవు
సాక్షి, స్పెషల్ డెస్క్: ఇటీవలి కాలంలో పరీక్షల ఒత్తిడి, ఫెయిలవుతామన్న భయం, మార్కులు తగ్గితే అందరూ తమను చిన్నచూపు చూస్తారన్న ఆందోళన వంటి కారణాలతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని కాపాడాలని, ఒత్తిడికి లోనై బలవన్మరణాలకు పాల్పడకుండా నివారించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం వ్యాఖ్యానించడం సమస్య తీవ్రతకు నిదర్శనం. అంతేకాకుండా వ్యవస్థల స్థాయిలో ఎలాంటి చర్యలు చేపట్టాలో కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. అసలు ఇంతకీ... విద్యార్థుల బలవన్మరణాలకు కారణాలేంటి? ఏయే స్థాయుల్లో, ఎలా వాటిని గుర్తించి నివారించవచ్చు? ఇందులో సమాజంలోని వివిధ వర్గాల పాత్ర ఏమిటి? నిపుణులు ఏమంటున్నారు?
విశాఖపట్నంలో ఓ కోచింగ్ సంస్థలో ‘నీట్’శిక్షణ పొందుతున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన యువతి అనుమానాస్పద మృతిపై దర్యాప్తునకు ఆదేశించాలంటూ నమోదైన కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ‘జాతీయ నేర గణాంక విభాగం లెక్కల ప్రకారం దేశంలో 2022లో 1.7 లక్షలకుపైగా ఆత్మహత్యల కేసులు నమోదైతే అందులో 7 శాతం విద్యార్థుల మరణాలే’అని అత్యున్నత న్యాయస్థానం గణాంకాలనూ ఉటంకించింది. 100 మంది విద్యార్థులు ఉన్న విద్య, శిక్షణ సంస్థలు, హాస్టళ్లలో సైకాలజిస్ట్, అర్హతగల కౌన్సిలర్, సామాజిక కార్యకర్తను నియమించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.
తేలిగ్గా తీసుకొనే మాటలు కావవి..
ఒత్తిడి, ఆందోళనలో ఉన్న విద్యార్థి తన కష్టాన్ని, బాధను ఏదో ఒక సందర్భంలో వ్యక్తపరుస్తారు. అది స్నేహితులు, బంధువులు, ఆఖరికి తల్లిదండ్రుల దగ్గర కూడా కావచ్చు. అలాంటప్పుడు వారి మాటలను తేలిగ్గా తీసుకోవడం మంచిది కాదు.
⇒ ‘పరిస్థితులు ఎప్పటికీ బాగుపడవు.. ఇక నేను ప్రయతి్నంచడంలో అర్థం లేదు’
⇒ ‘నా సమస్యలకు ఎవరూ సహాయం చేయలేరు.. నాకు మార్గం కనిపించడం లేదు’
⇒ ‘నేను పనికిరాను, నేను ఎవరికీ ముఖ్యం కాదు’
⇒ ‘ఇతరులకు భారంగా ఉన్నాను, నా మీద నాకు సిగ్గుగా ఉంది’
ఇలాంటి మాటలు విద్యార్థుల నోటి నుంచి వస్తే వెంటనే అప్రమత్తం కావాలి.
ఆ ప్రవర్తనలే హెచ్చరికలు
తల్లిదండ్రులు, బడులు లేదా విద్యాసంస్థల్లోని టీచర్లు పిల్లలను నిరంతరం గమనిస్తూ ఉండాలి. వారిలో ఈ కింది లక్షణాలు కనిపిస్తే ప్రమాదం పొంచి ఉందన్న హెచ్చరికగా భావించాలి.
⇒ ఇటీవలి కాలంలో చదువులో మీ పిల్లలు వరుసగా వెనుకబడుతుంటే
⇒ ప్రతి చిన్న విషయానికీ కోపం, అసహనం ఎక్కువవుతుంటే
⇒నలుగురితో కలవకుండా, ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడతుంటే
⇒ తన ఒళ్లు, ఆహారం, ఆరోగ్యం.. ఇలా దేనిమీదా శ్రద్ధ లేకుండా ఉంటే
⇒ తరగతిలో అజాగ్రత్తగా ఉండటం, మతిమరుపు
⇒ ఏదో తలచుకుని ఏడవడం
⇒ రాత్రుళ్లు నిద్రపట్టకపోవడం
ఇలా బయటపడొచ్చు
ఒత్తిడిని జయించడానికి, నైపుణ్యాలను అందిపుచ్చుకోవడానికి జనరేషన్–జడ్, జె¯న్–ఆల్ఫా ఏం చేస్తున్నారంటే..
గేమింగ్, ఈ–స్పోర్ట్స్: పోటీతత్వాన్ని నేర్పుతుంది. మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి.
మ్యూజిక్, పాడ్‌కాస్ట్: భావోద్వేగాల నియంత్రణ, ఒత్తిడి నుండి ఉపశమనం ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ: సృజనాత్మకత, తన టాలెంట్‌ను నలుగురికీ తెలియజేయడం
స్వచ్ఛంద సేవ, క్రియాశీలత: సంతృప్తి, సహానుభూతి, తన చుట్టుపక్కల వారితో అనుబంధం పెంచుకోవడానికి
ఫిట్‌నెస్, యోగా: ఒత్తిడి నుంచి బయటపడేందుకు, సానుకూల దృక్పథం
షాపింగ్ థెరపీ: ఒత్తిడి నుంచి ఉపశమనం
సమయపాలన..
ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయానికి ప్రధాన కారణం ఇదే. సమయాన్ని సది్వనియోగం చేసుకోలేక, ఏ పనికి ఎంత సమయం కేటాయంచాలో అంచనా వేయలేక విద్యార్థులు ఒత్తిడిని పెంచుకుంటున్నారు.
⇒ ప్రాధాన్యతను బట్టి ఏ పనికి ఎక్కువ సమయం, ఏ పనికి తక్కువ సమయం అన్న స్పష్టమైన విభజన చేసుకోవాలి. అది చదువు / సబ్జెక్ట్, ఆటపాటలు, షికార్లు /ఎంజాయ్‌మెంట్, వ్యాయామం.. అన్నింటికీ వర్తిస్తుంది.
⇒ ఏకబిగిన చదవకుండా మధ్యమధ్యలో విరామాలు తీసుకోవాలి
⇒ మరునాడు చేయబోయే పనులకు సంబంధించి ముందురోజు రాత్రే టైమ్ టేబుల్ వేసుకోవాలి. అందులో ఎంత శాతం పూర్తిచేస్తున్నారో డైరీలో రాసుకోవాలి. 60, 70, 80, 90 శాతం వరకు వచ్చారంటే.. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆ తరవాత అలా రాయాల్సిన అవసరమే ఉండదు.
తల్లిదండ్రులూ.. పిల్లలు చెప్పేది వినండి
పిల్లలు చెప్పేది వినడానికి చాలామంది తల్లిదండ్రులు సిద్ధంగా ఉండరు. తాము కష్టపడి, డబ్బు పెట్టి చదివిస్తుంటే... ఏ కష్టం చదవడానికి అనుకుంటారు. ఈ ధోరణి మారాలి. వాళ్లు జీవితంలో ఏ అనుభవమూ లేకనే సమస్యలు మీకు చెబుతున్నారన్న విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే సగం సమస్య పరిష్కారమైనట్టే.
పిల్లలూ.. స్క్రీన్ టైమ్ తగ్గించండి
ఇటీవలి కాలంలో విద్యార్థులు చదువు కోసం కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్లను ఆశ్రయిస్తున్నారు. వీటి వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
⇒ కొందరు విద్యార్థులు చదువుకు సంబంధించినవి కాకుండా ఇతరత్రా విషయాలపై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు.
⇒ షార్ట్స్, రీల్స్, వీడియోలను ఒకటి తరవాత ఒకటి.. చూడటానికి మెదడు అలవాటు పడితే.. చదవాలన్న తలంపే రాకుండా పోతుంది. దానివల్ల పరీక్షల వంటి కీలక సమయాల్లో ఒత్తిడి పెరుగుతోంది.
పిల్లలూ.. సిగ్గు, మొహమాటం వద్దు
⇒ స్నేహితులు, కుటుంబ సభ్యులు, టీచర్లు, బంధువులు.. వీరిలో మీ మనసుకు దగ్గరగా ఉండే వ్యక్తులు కచ్చితంగా ఉంటారు. మీకు ఏ సమస్య వచి్చనా నిర్మొహమాటంగా వారితో పంచుకోండి.
⇒ చాలా సందర్భాల్లో ఈ వ్యక్తులు మీ అమ్మ లేదా నాన్న కూడా కావచ్చు.
కఠిన గ్రేడింగ్ వ్యవస్థలు, మానసిక ఆరోగ్య సమస్యలు వస్తే ఓదార్చేవారు లేకపోవడం, నిరంతర పోటీతత్వం విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు. ముప్పును ముందే గుర్తించి పిల్లలకు కౌన్సెలింగ్ ఇచ్చే స్థాయిలో పాఠశాల, కళాశాల కౌన్సెలర్లకు శిక్షణ ఇవ్వాలి. భావోద్వేగాలను నియంత్రించుకునేలా, ఒత్తిడిని జయించి, ఆత్మహత్యలను నివారించేలా విద్యాసంస్థలు మేమున్నామనే భరోసా ఇవ్వాలి – నెల్సన్ వినోద్ మోసెస్, సూసైడ్ ప్రివెన్షన్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు