
మందలించిన ఉపాధ్యాయులు ఆపై తల్లిదండ్రులకు సమాచారం
భయంతో స్కూలు గోడ దూకి పారిపోయిన విద్యార్థి
రైలు పట్టాలపై మృతదేహం లభ్యం
బాలుడి ఆత్మహత్యకు బెల్టు దుకాణమే కారణమా?
చంద్రగిరి: కూటమి నాయకుల ‘బెల్టు’ దాహం ప్రజల ప్రాణాలను హరిస్తోంది. విచ్చలవిడిగా దుకాణాలు ఏర్పాటు చేయడంతో మద్యం మంచినీళ్లలా దొరుకుతోంది. అంతేకాదు... మైనర్లనూ బలి తీసుకుంటోంది. తాజాగా తిరుపతి జిల్లాలో ఓ విద్యార్థి మద్యం సేవించి పాఠశాలకు రావడంతో ఉపాధ్యాయులు మందలించారు. దీంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలంలోని ముంగళిపట్టు గ్రామానికి చెందిన బాలుడు జస్వంత్ (15) ఎం.కొంగరవారిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు.
బుధవారం పాఠశాలకు మద్యం తాగి రావడంతో తోటి విద్యార్థులు గుర్తించి ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు జశ్వంత్ బ్యాగ్‌ను తనిఖీ చేయగా, మద్యం బాటిల్ లభ్యమైంది. ఉపాధ్యాయులు వెంటనే హెచ్‌ఎం భాస్కర్ నాయుడుకు సమాచారం ఇవ్వగా, ఆయన జశ్వంత్‌ను మందలించారు. ఆపై తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. ఇంతలో జశ్వంత్ పాఠశాల గోడ దూకి పారిపోయాడు.
అనంతరం అతడి కోసం ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో ఉన్నాధికారులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో స్కూల్ వెనుక వైపు ఉన్న రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. పాకాల రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.
బెల్టు దుకాణమే కారణమా?
చంద్రగిరి మండలంలో బెల్టు దుకాణాల ద్వారా మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. జస్వంత్ బెల్టు దుకాణంలో మద్యం కొనుగోలు చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. అసలు జస్వంత్‌కు మద్యం ఎక్కడ నుంచి వచి్చంది? ఎవరి వద్ద కొనుగోలు చేశాడు? అనేది అధికారులు తేల్చాల్సి ఉంది.
వాస్తవంగా 21 ఏళ్లు నిండని వారికి మద్యం విక్రయించడం చట్టరీత్యా నేరం. జస్వంత్ వద్ద దొరికిన బాటిల్‌పై ఉన్న క్యూఆర్ కోడ్ ఆధారంగా మద్యం ఏ దుకాణంలో కొనుగోలు చేశాడో తెలుసుకోవచ్చు. మరి ఎక్సైజ్ అధికారులు ఆ దిశగా విచారణ చేపడతారా? లేక బెల్టు దుకాణాలకు అండగా కేసును నీరుగారుస్తారా? అనేది తేలాల్సి ఉంది.