
యుద్ధభయం, జన సమ్మర్థానికి దూరంగా..
తమిళనాడు కొడైకెనాల్‌లో పచ్చని కొండల ఒడిలో లక్స్‌గ్లాంప్ రిసార్ట్స్
సేదదీరేందుకు స్విమ్మింగ్‌పూల్, ఆవిరిస్నానాల పెట్టె, ఆరుబయట షవర్
కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన ఆంటోనీ థామస్ అద్భుత ఐడియా
హైదరాబాద్ నుంచి మొదలైన విహారయాత్రలు
సాక్షి, హైదరాబాద్: దైనందిన జీవితంలోని వేగం, ఒత్తిడి, కాలుష్యం వగైరాలకు దూరంగా వెళ్లి ఓ నాలుగు రోజులు సేదితీరి రావాలని ఎవరికి ఉండదు? కానీ ఆ డెస్టినేషన్‌ను ఎలా ఎంచుకోవడం? మానసిక ప్రశాంతతే కాదు బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ముఖ్యమే కదా!
ఆ రెండింటికీ గమ్యం పూంబారై!
హిమాలయాల సరిహద్దుల్లోని హిల్స్‌స్టేషన్లలో యుద్ధభయం ఇంకా వీడకపోగా, దక్షిణాన ఉన్న నీలగిరితో పాటు ఇతర అన్ని హిల్ స్టేషన్స్ జనాలతో కిటకిటలాడుతూ పట్టణ, నగర వాతావరణాన్ని తలపిస్తున్నాయి. అందుకే సిమ్లా, కులూ, మనాలి నుంచి ఊటీ, కొడైకెనాల్ వరకు దేన్ని చూసినా అమ్మో.. వాటికన్నా ఇల్లే నయమనిపించేలా చేస్తున్నాయి. కానీ పూంబారై అలా కాదు. కొడైకెనాల్‌కి 25 కిలోమీటర్ల పైన పచ్చటి కొండల ఒడిలో.. జలజల పారే జలపాతాల మధ్య.. మూడు కాలాలకూ సూటయ్యే ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువుదీరి ఉందీ ఊరు!
మిగిలిన హిల్ స్టేషన్లలో ఉన్నట్లు కిక్కిరిసిన హోటళ్లు.. జనసందోహంతో నిండిన రిసార్ట్స్ లేవు. ప్రకృతి వీక్షణ, ఆస్వాదనకు వీలుగా కొండవాళ్లలో ప్రైవసీ ప్రాధాన్యంగా డోమ్స్ నిర్మాణాలుంటాయి. ఇంత దూరం వచ్చి మళ్లీ సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్స్‌లో మునిగిపోకుండా ఉండటానికి డిజిటల్ డిటాక్సిఫికేషన్‌ను దృష్టిలో పెట్టుకుని వైఫై కనెక్టివిటీ ఇవ్వలేదు ఈ డోమ్స్‌కి. శారీరక, మానసిక రిలాక్సేషన్ కోసం జకూజీ, స్విమ్మింగ్ పూల్, ఆవిరి స్నానాల పెట్టె, ఆరుబయట షవర్ వంటి సౌకర్యాలన్నింటితో క్యాంపింగ్ తరహా బసలివి.
అదే లక్స్‌గ్లాంప్ ఎకో రిసార్ట్స్! దీంతో ఇప్పుడు హైదరాబాద్ నుంచి పర్యాటకులు పూంబారై బాట పడుతున్నారు. ఈ రిసార్ట్స్ నిర్మాణానికి పూర్వం పూంబారైలో సరైన రోడ్డు, రవాణా సదుపాయాలు అంతగా ఉండేవి కావు. వీటి నిర్మాణంతో చక్కటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. అంతేకాదు స్థానిక యువత, మహిళలకు ఈ రిసార్ట్స్ ఉపాధినీ కల్పిస్తున్నాయి.
స్థానికంగా పండే పంటలు, కూరగాయలను ఇక్కడి రెస్టారెంట్స్ కొనుగోలు చేస్తున్నాయి. మూడుకాలాలు పూర్తి ఆక్యుపెన్సీతో ఉండే ఈ రిసార్ట్స్ వల్ల స్థానిక యువత నుంచి రైతుల వరకు అందరికీ ఏదోరకంగా ఉపాధి అందుతోంది. అంతేకాదు దీనివల్ల రవాణా సదుపాయాలు మెరుగుపడటంతో స్థానికుల చదువు, వ్యాపార వాణిజ్యాలూ ఏ ఆటంకం లేకుండా సాగుతున్నాయి. దీంతో పూంబారై ఆర్థిక చిత్రం మారిపోయింది.
లగ్జరీ, క్యాంపింగ్ కలిసేలా.. లక్స్‌గ్లాంప్
ఈ డోమ్ తరహా రిసార్ట్స్‌ను ఇదే లక్స్‌గ్లాంప్ సంస్థ మున్నార్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. మంచి ఫలితాలను ఇవ్వడంతో పూంబారైలోనూ నిర్మించింది. ఆ సంస్థ యజమాని కేరళ త్రిస్సూర్‌కు చెందిన ఆంటోనీ థామస్. బిజినెస్ డెవలపర్. వృత్తిరీత్యా దుబాయ్‌లో ఉంటున్నారు. ఈ రోజుల్లో కాలుష్యం లేని ప్రకృతిలో గడిపే అవకాశం రావడం నిజంగానే లగ్జరీనే. అలాంటి లగ్జరీ.. క్యాంపింగ్ రెండూ కలిసేలా ఈ రిసార్ట్స్‌కి లక్స్‌గ్లాంప్ అని పేరు పెట్టామని చెబుతారాయన.
అసలు ఈ ఐడియా ఎలా వచ్చిందని అడిగితే.. ‘నాకు చిన్నప్పటి నుంచీ కొత్త ప్రదేశాలకు వెళ్లడం, అక్కడి సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకోవడమంటే చాలా ఇష్టం. నాతో పాటే ఆ ఆసక్తీ పెరుగుతూ వచి్చంది. లక్కీగా మా ఆవిడ ఎలీనా థామస్‌కు పర్యటనలంటే ఇష్టం ఉండటంతో ఏ కాస్త టైమ్ దొరికినా ఇద్దరం ప్రపంచ దేశాలను సందర్శిస్తూంటాం. దీనివల్ల పని ఒత్తిడి నుంచి కాస్తంత ఉపశమనం దొరకడమే కాదు. మా బిజినెస్ డెవలప్‌మెంట్‌కి కొత్త ఐడియాలూ వస్తుంటాయి.
అలా ఒకసారి యూరప్ వెళ్లినప్పుడు అక్కడ చాలా చోట్ల గ్లాస్ క్యాబిన్ల నుంచి ఆలైప్ లాడ్జెస్, డోమ్స్, బబుల్ రిట్రీట్స్ చాలా కనిపించాయి. వాటిల్లో బస చేశాం. వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియెన్స్ అలాంటిది మన దగ్గర కనిపించలేదు. క్యాంపింగ్‌కి కనీస వసతులు కూడా లేని గుడారాలు మాత్రమే కనిపిస్తుంటాయి. కుటుంబంతో కలిసి క్యాంపింగ్ చేయాలంటే భద్రత, సౌకర్యాలు ప్రధానమవుతాయి కదా! వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుంటే మేము యూరప్‌లో ఎక్స్‌పీరియెన్స్ చేసిన గ్లాస్ క్యాబిన్, డోమ్స్ పర్‌ఫెక్ట్ అనిపించాయి.
వాటిని దక్షిణ భారతంలో ప్రవేశపెట్టాలనుకుని ముందు పైలట్ ప్రాజెక్ట్‌గా 2018లో మున్నార్‌లో స్టార్ట్ చేశాం. పూంబారైలో మా లక్స్‌గ్లాంప్ ఎకో రిసార్ట్స్ ప్రారంభంతోనే ఆ ఊరి ముఖచిత్రమే మారిపోయింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా చాలా వసతులు ఏర్పడి ఈ ఊరికి ఓ కొత్త కళ వచి్చంది. భవిష్యత్‌లో మరిన్ని పర్యాటక ప్రాంతాల్లోనూ ఈ తరహా కట్టడాలతో పర్యాటక ప్రియులకు సౌకర్యవంతమైన, పర్యావరణప్రియ బసను అందించాలనుకుంటున్నాం’అని ఆంటోనీ థామస్ తెలిపారు.