అన్నా.. దేవుడే పంపిండు! | Ex Minister Jeevan Reddy Met KCR at Erravelli Farm House | Sakshi
Sakshi News home page

అన్నా.. దేవుడే పంపిండు!

Apr 11 2026 12:43 AM | Updated on Apr 11 2026 4:16 AM

Ex Minister Jeevan Reddy Met KCR at Erravelli Farm House

జీవన్‌రెడ్డిని ఆలింగనం చేసుకుంటున్న కేసీఆర్‌

కేసీఆర్‌ వద్ద మాజీమంత్రి జీవన్‌రెడ్డి భావోద్వేగం

ఇన్నాళ్లకైనా మీతో కలిసి పనిచేసే అవకాశం రావడం సంతోషమన్న సీనియర్‌ నేత 

ఎర్రవల్లిలో బీఆర్‌ఎస్‌ అధినేతతో భేటీ..స్వాగతం పలికిన కేటీఆర్, పార్టీ నేతలు 

జీవన్‌రెడ్డిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న కేసీఆర్‌ 

పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్న నేతలు..రాజకీయ పరిస్థితులపై చర్చ 

పార్టీలో అత్యంత ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చిన మాజీ సీఎం 

20న జగిత్యాలలో కేసీఆర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్న జీవన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ‘తెలంగాణకు నష్టం జరుగుతున్న సమయంలో మీతో కలిసి పనిచేయాల్సిన అవసరమున్నదని, మీతో కలిసి పనిచేయమని దేవుడే నన్ను మీ దగ్గరికి పంపించిండు. అన్నా.. చాలా గ్యాప్‌ తర్వాత ఇన్నాళ్లకైనా మీతో కలిసి పనిచేసే అవకాశం రావడం సంతోషంగా వుంది..’ అని ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్‌ నేత, మాజీమంత్రి టి.జీవన్‌రెడ్డి.. బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావుతో అన్నారు. బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు గురువారం ప్రకటించిన జీవన్‌రెడ్డి శుక్రవారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్‌తో భేటీ అయ్యారు.

తొలుత బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పుష్పగుచ్ఛం ఇచ్చి జీవన్‌రెడ్డికి స్వాగతం పలికారు. మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, ఎమ్మెల్యే డా.కె.సంజయ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే కె.విద్యాసాగర్‌రావు, పార్టీ నేతలు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. జీవన్‌రెడ్డి వెంట ఆయన కుమారులు రామచంద్రారెడ్డి, బాలకృష్ణారెడ్డి, చంద్రకృష్ణారెడ్డితో పాటు జగిత్యాల మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌ దావా వసంత సురేశ్‌ కూడా ఎర్రవల్లికి వచ్చారు.

కాగా జీవన్‌రెడ్డిని ఆత్మియ ఆలింగనం చేసుకున్న కేసీఆర్‌.. శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి తన నివాసంలోకి ఆహ్వానించారు. ఈ సమయంలోనే జీవన్‌రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. పార్టీ నేతల సమక్షంలో ఇష్టాగోష్టి అనంతరం జీవన్‌రెడ్డి బృందానికి కేసీఆర్‌ ఆతిథ్యం ఇచ్చారు. అనంతరం కేసీఆర్, జీవన్‌రెడ్డి నడుమ సుదీర్ఘ చర్చ జరిగింది. బీఆర్‌ఎస్‌లో జీవన్‌రెడ్డి చేరికకు తేదీ ఖరారైంది. 

రాజకీయ పరిస్థితులపై చర్చ 
రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై కేసీఆర్, జీవన్‌రెడ్డి చర్చించుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సుమారు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకోవడంతో పాటు, పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నట్లు తెలిసింది. తెలంగాణ ఉద్యమం, పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలన వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి పాలనా తీరు తదితరాలపై చర్చ జరిగినట్లు తెలిసింది. బీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన అభివృద్ధి ప్రస్తుతం తిరోగమన దిశలో ఉందనే కోణంలో సుదీర్ఘ చర్చ జరిగినట్లు బీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనా వైఫల్యంతో తెలంగాణకు నష్టం జరుగుతోందని ఇరువురు నేతలు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది.  

జగిత్యాలలో 2 లక్షల మందితో సభ 
జీవన్‌రెడ్డి ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటలకు జగిత్యాలలో జరిగే బహిరంగ సభ వేదికగా కేసీఆర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. బహిరంగ సభ నిర్వహణకు అవసరమైన సన్నాహాలు ప్రారంభించాల్సిందిగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన నేతలకు ఆదేశాలు అందాయి. సభ నిర్వహణ బాధ్యతను మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, పార్టీ నేతలు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డితో పాటు స్థానిక నేతలకు అప్పగించినట్లు సమాచారం. సభ నిర్వహణకు అనువైన ప్రదేశాన్ని శనివారం బీఆర్‌ఎస్‌ నేతలు సందర్శించి ఖరారు చేయనున్నారు. సుమారు 2 లక్షల మందితో సభ నిర్వహించేలా మైదానం ఎంపిక చేయాలని కేసీఆర్‌ ఆదేశించినట్లు సమాచారం.  

జీవన్‌రెడ్డికి సెక్రటరీ జనరల్‌ హోదా 
జీవన్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ పదవి ఇవ్వాలని కేసీఆర్‌ నిర్ణయించినట్లు తెలిసింది. గతంలో రాజ్యసభ మాజీ సభ్యుడు కె.కేశవరావు ఈ పదవిలో కొనసాగారు. కాగా జీవన్‌రెడ్డికి ఉన్న రాజకీయ అనుభవం, సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని ఆయనకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలనే యోచనలో కేసీఆర్‌ ఉన్నట్లు సమాచారం. ముఖాముఖి సమావేశం సందర్భంగా పార్టీలో అత్యంత ప్రాధాన్యత ఉంటుందని జీవన్‌రెడ్డికి కేసీఆర్‌ హామీ ఇచ్చినట్లు తెలిసింది. 

కాంగ్రెస్‌ అధిష్టానం తెలంగాణపై పట్టు కోల్పోయింది 
కేసీఆర్‌ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు 
మీడియాతో జీవన్‌రెడ్డి 
సాక్షి, సిద్దిపేట:   తెలంగాణపై కాంగ్రెస్‌ అధిష్టానం పట్టు కోల్పోయిందని మాజీమంత్రి టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. అయితే తన విషయంలో పీసీసీ తప్పు చేసింది కానీ ఏఐసీసీని నిందించడం సరికాదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు తిరోగమనంలో పయనిస్తోందన్నారు. శుక్రవారం కేసీఆర్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఒకప్పుడు పీసీసీ ఏది చెబితే ముఖ్యమంత్రులు అది చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. సీఎం రేవంత్‌రెడ్డి ఒక్కడే ఏకపక్షంగా, రూలర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పీసీసీ అనేది కేవలం సీఎం అదేశాలను అమలు చేసే ఒక విభాగంగా మారిపోయింది.

మరోవైపు రేవంత్‌రెడ్డి పాలనతో ప్రజలు విసిగిపోయారు. మళ్లీ కేసీఆర్‌ సీఎం కావాలని బలంగా కోరుకుంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఇచ్చి న వాగ్దానాలను నెరవేర్చలేదు. ఈ విషయంలో ప్రజల పక్షాన పోరాడేందుకు బీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నా..’ అని జీవన్‌రెడ్డి తెలిపారు. తనకు 14 సార్లు బీ ఫామ్‌ ఇచ్చారంటే కంటెంట్‌ ఉన్న నాయకుడినే కాబట్టే కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిందని ఆయన అన్నారు. కాగా జీవన్‌రెడ్డి ఈ నెల 20న బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ రమణలు మీడియాకు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement