ప్రాణాలు తీస్తున్న విద్యుత్‌ తీగలు

Electrocution Accidents Increased Northern Telangana - Sakshi

ఉత్తర తెలంగాణలో గత ఆరేళ్లలో 3 వేల మందిపైగా మృతి

విద్యుత్‌ సిబ్బంది నిర్లక్క్ష్యమే ముఖ్య కారణం

ఏటేటా పెరుగుతున్న విద్యుత్‌ ప్రమాద మరణాలు

మృతుల కుటుంబాలకు పరిహారం ఆలస్యం 

హైదరాబాద్‌: తెలంగాణలో విద్యుత్‌ తీగలు ప్రజల పాలిట మృత్యుపాశాలవుతున్నాయి. ఆరేళ్ల వ్యవధిలో 3 వేల మందిపైగా విద్యుదాఘాతాలకు బలైపోయారు. ఉత్తర తెలంగాణలోని 16 జిల్లాల్లో 2014-2020 మధ్య కాలంలో విద్యుత్‌ సంబంధిత ప్రమాదాల బారిన పడి 3,008 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం 1,197 కుటుంబాలకు మాత్రమే ప్రభుత్వ పరిహారం అందడం గమనార్హం. తెలంగాణ ఉత్తర విభాగం విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌) సమాచార హక్కు చట్టం కింద ఈ వివరాలు వెల్లడించింది. (వచ్చే జాతరకు ఉంటామో, లేదో !?: ఏఎస్పీ)

విద్యుత్‌ ప్రమాదాల బారిన పడిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయం పరిహారం చెల్లించాలని డిస్కంలను రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ సంస్థ(టీఎస్‌ఈఆర్‌సీ) స్పష్టమైన ఆదేశాలిచ్చింది. విద్యుత్ పంపిణీ సంస్థ సిబ్బంది, అధికారుల నిర్లక్క్ష్యంతో తరుచుగా ప్రజలు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తీగలను సరిగా అతికించకపోవడం, లైవ్‌ వైర్లు, స్తంభాల నుంచి లీకేజీ, విద్యుత్ సరఫరాలోని లోపాల కారణంగా విద్యుత్‌దాఘాతాలు సంభవిస్తున్నాయి.  కరెంట్‌ షాక్‌తో మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం అందజేసే ముందు అవసరమైతే అంతర్గత విచారణ చేపట్టవచ్చని డిస్కంలకు టీఎస్‌ఈఆర్‌సీ సూచించింది. 2013 వరకు 2 లక్షలుగా ఉన్న పరిహారాన్ని 2015లో నాలుగు లక్షలకు ప్రభుత్వం పెంచింది. పలు సవరణల తర్వాత 2018లో  పరిహారాన్ని 5 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌ ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. మృతుల్లో చాలా మంది సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిన తరగతులకు చెందిన వారు కావడంతో పరిహారాన్ని పొందడంలో వారి కుటుంబ సభ్యులు అవాంతరాలను ఎదుర్కొవాల్సి వస్తోంది. పరిహారం కోసం చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలు లెక్కలేనన్ని కష్టాలు పడుతున్నాయని సామాజిక కార్యకర్త సుధీర్‌ జలగం తెలిపారు. ఆర్టీఐ కింద విద్యుత్‌ ప్రమాద వివరాలను ఆయన సే​కరించారు.  ‘బాధితుల కుటుంబాలు ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేయడానికి చట్టపరమైన వారసుల ధ్రువీకరణ పత్రాలు, ఇతర రుజువులను అందించాల్సిన అవసరం ఉంది, కాని అధికారులు వాటిని జారీ చేయడానికి నెలల సమయం తీసుకుంటూ, ప్రక్రియను ఆలస్యం చేస్తున్నార’ని ఆయన ఆరోపించారు. డిస్కంలు భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేస్తున్నాయని, తరచుగా తనిఖీలు నిర్వహించడం లేదని తెలిపారు. (మళ్లీ నగరం బాట పడుతున్న వలసజీవులు)

టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలో 2014-2020 మధ్య కాలంలో వరంగల్‌ రూరల్‌ జిల్లాలో అత్యధికంగా 178 విద్యుత్‌ ప్రమాద సంబంధిత మరణాలు సంభవించాయి. తర్వాత స్థానాల్లో కామారెడ్డి(175), నిర్మల్‌(164), మహబూబాబాద్‌(163), జగిత్యాల్‌(160), నిజామాబాద్‌(158), పెద్దపల్లి(139), కరీంనగర్‌(130), మంచిర్యాల(129), ఆదిలాబాద్‌(128), ఖమ్మం(128), భూపాలపల్లి(122), భదాద్రి-కొత్తగూడెం(119), జనగాం(113), వరంగల్‌ అర్బన్‌(60), ఆసిఫాబాద్‌(53) ఉన్నాయి. 

ప్రభుత్వ అధికారులు, విద్యుత్‌ సిబ్బంది తప్పనిసరిగా ఎప్పటికప్పుడు భద్రతా ప్రమాణాలు, జాగ్రత్తలు అమలు చేసి ఉంటే ఈ మరణాలు సంభవించేవి కాదని తెలంగాణ రైతు సంఘం కార్యదర్శి టి. సాగర్‌ అన్నారు. విద్యుత్‌ సిబ్బంది నిర్లక్క్ష్యం కారణంగానే రైతులు బలైపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాతే దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు తప్ప ముందుస్తు రక్షణ చర్యలు శూన్యమని విమర్శించారు. ఉత్తర తెలంగాణలోని 16 జిల్లాల్లో గత కొనేళ్లుగా విద్యుత్‌ ప్రమాద మరణాలు పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 2014-15లో 210 మరణాలు నమోదు కాగా, 2017-18లో 537 మంది మృతి చెందారు. 2019-20 నాటికి ఈ సంఖ్య 681కి పెరగడం ప్రమాదాల తీవ్రతను తెలియజేస్తోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top