
సాక్షి, హైదరాబాద్: సృష్టి ఫెర్టిలిటీ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. కేసు వివరాలు ఇవ్వాలని హైదరాబాద్ పోలీసులకు ఈడీ లేఖ రాసింది. ఎనిమిది రాష్ట్రాల్లో డాక్టర్ నమ్రత కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. చైల్ట్ ట్రాఫికింగ్ ద్వారా రూ.కోట్లు సంపాదించి నమ్రత బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 30 మంది అరెస్ట్ తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఈ కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు పోలీసులు నిర్థారించారు. రూ.25 కోట్లు వరకు వసూలు చేసినట్లు గుర్తించారు. 80 మంది పిల్లలను ఈ ముఠా విక్రయించింది. విదేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లు కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మనీలాండరింగ్‌పై ఈడీ విచారణ చేయనుంది. సరోగసి పేరుతో శిశువుల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడిన యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత గతంలో వ్యవస్థల్ని మేనేజ్ చేసిందా..? ఔననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
2020లో విశాఖపట్నంలో ఈమెపై క్రిమినల్ కేసులు నమోదైన తర్వాత హైదరాబాద్‌లోనూ కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. వీటి విషయంలో ఆమె అప్పట్లో పోలీసులను మేనేజ్ చేయడంతో బయటపడ్డారని తెలుస్తోంది. ఆపై కరోన విజృంభణ, లాక్‌డౌన్ తదనంతర పరిణామాలతో మరికొందరు బాధితులు వెనక్కు తగ్గారు. ఇవన్నీ కలిసి రావడంతోనే నమ్రత యథేచ్ఛగా తన దందా కొనసాగించగలిగారని సమాచారం. సృష్టి సెంటర్‌కు అనుకూలంగా 2019, 2020ల్లో ఇంటర్‌నెట్‌లో జరిగిన ప్రచారం అనేక మంది దృష్టికి ఆకర్షించింది.
దీంతో వివాహమై కొన్నేళ్లు అయినా సంతాన లేమితో బాధపడుతున్న భార్య భర్తలు సికింద్రాబాద్‌లోని ఈ సెంటర్‌ను సంప్రదించారు. వీరికి పరీక్షలు చేసే నమ్రత వారిలో ఉన్న లోపాలను గుర్తించేది. ఆ విషయాలను మాత్రం వారికి చెప్పకుండా దాచి పెట్టేది. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) విధానంలో సంతానం కలిగే అవకాశం ఉందంటూ చెప్పి భారీ మొత్తం వసూలు చేసేది.
ఐవీఎఫ్ విధానంలో భార్య నుంచి అండం, భర్త నుంచి వీర్యం తీసుకుని ల్యాబ్‌లో పిండాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఆ పిండాన్ని తిరిగి భార్య గర్భంలో ఉంచి సంతానం కలిగేలా చేయడం ఈ విధానం ముఖ్య ఉద్దేశం. అయితే దీనికి విరుద్ధంగా వ్యవహరించిన నమ్రత వేరే వారికి చెందిన అండం, వీర్యాలను సేకరించి (ఏది అవసరమైతే అది) పిండాన్ని అభివృద్ధి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అప్పట్లో ఈ విషయం గుర్తించిన ఒకరిద్దరు బాధితులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. వీటిని స్వీకరించే సమయంలో అధికారులు సైతం బాధితుల తరఫునే నిలిచేవారు. ప్రాథమిక విచారణ పేరు నమ్రత లేదా ఆమె తరఫు వారిని పోలీసుస్టేషన్‌కు పిలిచే వారు. ఆ సమయాన్ని సది్వనియోగం చేసుకునే నమ్రత ఆయా అధికారులను మేనేజ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ కారణంగానే మరోసారి ఠాణాకు వచ్చే బాధితులతో ఆయా అధికారుల ప్రవర్తన పూర్తిగా మారిపోయేది. తాజాగా నమ్రతపై వరుస కేసులు నమోదు అవుతుండటంతో అప్రమత్తమైన అధికారులు గతాన్ని అధ్యయనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి కొన్ని అంశాలు వెలుగులోకి వచి్చనట్లు తెలిసింది. డాక్టర్ నమ్రత నెట్‌వర్క్‌లో ఆమెతో కలిసి విద్యనభ్యసించిన వైద్యులు కూడా ఉండి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ కోణంలో దర్యాప్తు చేస్తూ వివరాలు ఆరా తీస్తున్నారు. గాంధీ ఆస్పత్రి వైద్యుడు సదానందం మాదిరిగానే వైజాగ్‌కు చెందిన ప్రభుత్వ వైద్యులు నమ్రతకు సహకరించారని తెలుస్తోంది. నమ్రతపై నమోదైన కేసుల్లో గోపాలపురం పోలీసులు ఇప్పటి వరకు 25 మంది నిందితులను అరెస్టు చేశారు. దర్యాప్తుల్లో వెలుగులోకి వస్తున్న వివరాల ఆధారంగా మరికొందరు వైద్యులు, టెక్నషియన్లు, సహాయకులతో పాటు ఏజెంట్లు, శిశువుల్ని విక్రయించిన, ఖరీదు చేసిన వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.