జేఎన్‌–1 అంత ప్రమాదకరం కాదు | Dr Nageshwar Reddy Chairman of AIG Hospitals in Sakshi interview: JN1 Corona | Sakshi
Sakshi News home page

జేఎన్‌–1 అంత ప్రమాదకరం కాదు

Dec 23 2023 4:08 AM | Updated on Dec 23 2023 4:09 AM

Dr Nageshwar Reddy Chairman of AIG Hospitals in Sakshi interview: JN1 Corona

డాక్టర్‌ డి.నాగేశ్వర్‌రెడ్డి , గోపీచంద్‌ ఖిల్నానీ

సాక్షి, హైదరాబాద్‌:  ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కరోనా కొత్త వేరియంట్‌ జేఎన్‌–1 అంత ప్రమాదకరమేమీ కాదని.. దాని గురించి అతిగా ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. వారం, పది రోజుల్లో ఈ ఇన్ఫెక్షన్‌ వ్యాప్తి ఎలా ఉంటుందనే దానిని బట్టి దీని తీవ్రత, చూపబోయే ప్రభావంపై మరింత స్పష్టత వస్తుందని చెప్పారు.

ఇది ఒమిక్రాన్‌ సబ్‌ వేరియెంటే కాబట్టి ఎక్కువ మందికి సోకవచ్చన్నారు. అంతేతప్ప తీవ్ర లక్షణాలు ఉండటంగానీ, ప్రమాదకరంగా మారే అవకాశంగానీ తక్కువని స్పష్టం చేశారు. కొన్నిరోజులుగా దేశంలో కరోనా కేసులు పెరుగు తున్న నేపథ్యంలో డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివిధ అంశాలపై స్పష్టతనిచ్చారు. అందులోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. 

‘‘నా అంచనా ప్రకారం.. ఇప్పటికే నమోదైన కేసుల పరిస్థితిని చూస్తే ఈ వైరస్‌ అంతగా ప్రమాద కారి కాదు. సాధారణ జలుబు, దగ్గు, సైనసైటిస్, ఒళ్లు నొప్పులు వంటి స్వల్ప లక్షణాలు ఉంటాయి. అందరూ అన్నిచోట్లా మాస్క్‌ వేసుకోవాల్సిన అవసరం లేదు. కేన్సర్, మధుమేహం, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. బయటికి వెళ్లినప్పుడు మాస్క్‌ ధరిస్తే చాలు. 

డబ్ల్యూహెచ్‌వో పరిశీలిస్తోంది 
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) జేఎన్‌–1ను వేరియెంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌గా ప్రకటించింది. అంటే వచ్చే 10– 15 రోజులు ఇది ఎంతగా విస్తరిస్తుంది, ఎంత వేగంగా వ్యాపిస్తుంది (ఇన్‌ఫెక్టి విటీ), సీరియస్‌ ఇన్ఫెక్షన్‌గా మారుతుందా (విరులెన్స్‌) అన్న అంశాలను పరిశీలిస్తారు. ఇప్పటివరకు ఉన్న డేటా మేరకు ఈ వైరస్‌కు విరులెన్స్‌ అంత ఎక్కువగా లేదు. వ్యాపించే సామర్థ్యం ఒమిక్రాన్‌ అంతలేదు.. కానీ డెల్టా కంటే ఎక్కువగా ఉంది. ఈ వేరియంట్‌కు సంబంధించి కేరళలో ఎక్కువగా, ఇతర రాష్ట్రాల్లో కొన్ని కేసులు నమోదవుతున్నాయి. సింగపూర్‌లో ఈ కేసులు అధికంగా వచ్చాయి. యూఎస్, యూరప్‌లోనూ నమో దవుతున్నాయి. 

రోగ నిరోధక శక్తి ముఖ్యం 
ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఇమ్యూనిటీముఖ్యం. ప్రస్తుతం మనలో ఎంత ఇమ్యూనిటీ ఉందనే దానిపై ఏఐజీ ఆధ్వర్యంలో అధ్యయనం చేస్తున్నాం. వారం, పదిరోజుల్లో ఇది పూర్తవుతుంది. బూస్టర్‌ డోస్‌ వేసుకోవాలా వద్దా అన్న దానిపై స్పష్టత వస్తుంది. ఇమ్యూనిటీ ఉన్నవారు బూస్టర్‌ డోస్‌ను వేసుకోవాల్సిన అవసరం లేదు. 

మన దేశ ప్రజల్లో హైబ్రిడ్‌ ఇమ్యూనిటీ ఉంది
‘‘మళ్లీ కరోనా వ్యాప్తి నేపథ్యంలో బూస్టర్‌ డోస్‌ తీసుకోవాలా వద్దా అని చాలా మంది డాక్టర్లను సంప్రదిస్తున్నారు. అమెరికాలో అయితే 65ఏళ్లు దాటినవారు బూస్టర్‌ డోస్‌ తీసుకోవాలని సూచిస్తున్నారు . అదే భారత్‌లో చాలా వరకు వ్యాక్సిన్‌ వేసుకోవడం, కరోనా సోకి ఉండటంతో ఏర్పడిన ‘హైబ్రిడ్‌ ఇమ్యూనిటీ’ ఉంది. ఒకవేళ వైరస్‌ సోకినా అది తీవ్ర వ్యాధిగా మారకుండా ఈ ఇమ్యూనిటీ ఉపయోగపడుతుంది.

ఒమిక్రాన్‌ స్పైక్‌ ప్రొటీన్లలో మార్పులతో జేఎన్‌–1 వేరియంట్‌ ఏర్పడినందున గతంలో తీసుకున్న వ్యాక్సినేషన్, కోవిడ్‌ సోకడం వల్ల వచ్చిన ఇమ్యూనిటీని ఇది తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనితో జ్వరం, గొంతునొప్పి, గొంతులో గరగర, దగ్గు, తలనొప్పి వంటి స్వల్ప అస్వస్థతే కలుగుతోంది. వృద్ధులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న వారికి ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయి. విదేశీ పర్యటనలు, దూరప్రాంతాలకు వెళ్లి వచ్చినవారికి లక్షణాలు ఉంటే టెస్ట్‌ చేయించుకోవాలి. ’’  – డాక్టర్‌ గోపీచంద్‌ ఖిల్నానీ, డబ్ల్యూహెచ్‌ఓ గ్లోబల్‌ ఎయిర్‌ పొల్యూషన్‌ అండ్‌ హెల్త్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ మెంబర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement