నాగ్‌పూర్‌లోని డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్
మొదటి అంతస్తులో జాతీయ రహదారి, ఆపై మెట్రో రైలు మార్గం
పనామా–హయత్‌నగర్ మధ్య 5.5 కి.మీ. మేర నిర్మాణం
ప్రాజెక్టు ప్రాథమిక వ్యయ అంచనా రూ. 940.75 కోట్లు
కేంద్రం, జాతీయ రహదారుల శాఖకు రాష్ట్రం ప్రతిపాదన
శాసనసభ ప్రశ్నోత్తరాల్లో వెల్లడించిన మంత్రి కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో భారీ రెండంతస్తుల వంతెన నిర్మాణం కానుంది. దిగువన సాధారణ రోడ్డు... ఆపై డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్.. అందులో తొలి అంతస్తులో ఆరు వరుసల జాతీయ రహదారి నిర్మితం కానుండగా రెండో అంతస్తులో మెట్రో కారిడార్ నిర్మాణం కానుంది. ఎల్బీనగర్‌లోని పనామా గోడౌన్ నుంచి హయత్‌నగర్ వరకు దాదాపు 5.5 కి.మీ. నిడివితో ఈ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ రూపొందనుంది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. వచ్చే నెలలో ఆ శాఖ వార్షిక ప్రణాళిక ఖరారు కోసం జరగనున్న సమావేశంలో దీనికి తుది అనుమతి విషయంలో స్పష్టత రానుంది.
కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సొంత నియోజకవర్గమైన నాగ్‌పూర్‌లో ఇప్పటికే ఇదే డిజైన్‌లో 5.62 కి.మీ. మేర ఫ్లైఓవర్ రూపొందింది. ఆ వంతెనను చూసే రాష్ట్ర ప్రభుత్వం దీనికి ప్రతిపాదించింది. ఇటీవల రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నితిన్ గడ్కరీతో సమావేశమై ఈ అంశంపై చర్చించారు. ఈ నేపథ్యంలో ఈ వంతెనకు కేంద్ర ప్రభుత్వం సమ్మతి తెలిపే అవకాశం ఉందని ఆయన మంగళవారం శాసనసభలో వెల్లడించారు. విజయవాడ జాతీయ రహదారి విస్తరణ అంశంపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే సందర్భంలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టత ఇచ్చారు.
పెరిగిన కాలనీలు, ట్రాఫిక్ వల్ల ఇబ్బందుల నేపథ్యంలో..
ప్రస్తుతం హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీ పెరిగి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఆ రోడ్డును ఆరు వరుసలకు విస్తరిస్తున్నారు. అందులో భాగంగా ఎల్బీనగర్ నుంచి నగర శివారు వరకు 8 వరుసలకు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. అయితే హయత్‌నగర్ నుంచి ఎల్బీనగర్ వరకు రోడ్డుకు ఇరువైపులా భారీగా కాలనీలు వెలిశాయి. అలాగే హయత్‌నగర్ నుంచి పెద్ద అంబర్‌పేట వరకు ఇటీవలి కాలంలో కాలనీలు వేగంగా పెరిగాయి.
దాదాపు 15 లక్షల మంది ఉండే ఈ ప్రాంతంలో రోడ్డు విస్తరణ స్థానిక వాహనదారులకు పెద్ద సమస్యగా మారింది. కాలనీల్లోకి వెళ్లాలంటే రెండున్నర కి.మీ. ముందుకు వెళ్లి యూటర్న్ తీసుకొని రావాల్సి వస్తోంది. ఇందుకోసం ఈ పరిధిలో 8 అండర్‌పాస్‌లను నిర్మించేందుకు డిజైన్ చేశారు. ఇందులో నాలుగు పూర్తవగా ఒకటి నిర్మాణంలో ఉంది. ఈ అండర్‌పాస్ డిజైన్‌ను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇక్కడ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలన్న సూచన వచ్చింది. ఇదే సమయంలో ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ తర్వాతి వరకు 7.1 కి.మీ. మేర మెట్రో రైలు కారిడార్ ఖరారైంది. ఆరు స్టేషన్లతో ఈ కారిడార్‌ను నిర్మించనున్నారు. అది కూడా ఇదే మార్గంలో రూపొందుతుంది. దీంతో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డు నిర్మిస్తే మెట్రో ప్రాజెక్టుకు ఇబ్బంది వస్తుంది. ఈ నేపథ్యంలో రెండూ ఒకే నిర్మాణంలో ఉండేలా తాజాగా డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్‌కు రూపకల్పన చేశారు.
నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ ఖర్చు రూ. 200 కోట్లు
ఈ ప్రాజెక్టుకు రూ. 940.75 కోట్లు ఖర్చవుతుందని ఎల్‌ఎన్ మాల్వియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాథమిక అంచనాతో నివేదికను సమర్పించింది. దీంతో ఈ వ్యయంలో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి రూ. 200 కోట్లను చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. మిగతా మొత్తాన్ని కేంద్రం భరించాలని కోరుతూ ఇటీవల రోడ్లు భవనాల శాఖ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. ఆ శాఖ వార్షిక ప్రణాళికలో దీన్ని చేరి్పంచేలా ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. అనుమతి రాగానే మరో ఆరు నెలల్లో దీనికి టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తామని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో రెండోది...
ఎల్బీనగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే రాష్ట్రంలో ఆ డిజైన్‌తో నిర్మితమయ్యే రెండో కట్టడం కానుంది. ఇప్పటికే పుణే–హెదరాబాద్ జాతీయ రహదారిపై మదీనాగూడ నుంచి బీహెచ్‌ఈఎల్ వరకు 1.20 కి.మీ. పొడవుతో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు మొదలయ్యాయి. దీనికి రాష్ట్ర పభుత్వం రూ. 53.55 కోట్ల వాటా చెల్లించేందుకు కూడా అంగీకారం తెలిపింది.


