అత్యవసరమైతే ‘ఊపిరి’ పోవాల్సిందేనా!

Doctors And Nurses Shortage in Warangal Isolation Centers - Sakshi

జిల్లా ఆస్పత్రిలో ఉత్సవ విగ్రహాలుగా వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ యంత్రాలు

అక్కరకురాని కోవిడ్‌ ప్రత్యేక వార్డులు

జనగామ: కరోనా మహమ్మారి ప్రజలను ఊపిరి పీల్చుకోకుండా చేస్తుంది. వైరస్‌ బారినపడి శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చాలామంది ఆర్థిక పరిస్థితులు అనుకూలించక, ప్రైవేట్‌ వెళ్లలేక, చివరి క్షణాల్లో గాలిపీల్చుకునే పరిస్థితిలేక ప్రాణాలు వదులుతున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్‌ చెబుతున్నా ఆచరణలో మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ప్రతీ జిల్లా కేంద్రంలో 100 పడకలతో ఏకాంత గదులను(వార్డులు) ఏర్పాటు చేసి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ జరిగిన తర్వాత ఎటువంటి వసతి సౌకర్యం లేని వారిని అందులో ఉంచాలని మంత్రి ఆదేశించిన సంగతి తెలిసిందే. అందులో వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ సైతం ఏర్పాటు చేసి కరోనాకు బలికాకుండా చూడాలని వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులకు సూచించారు. జిల్లా ఆస్పత్రిలోని మూడు వార్డుల్లో వెంటిలేటర్స్, ఆక్సిజన్‌ కనెక్షన్‌ అమర్చినా నేటికీ సేవలను ప్రారంభించడం లేదు.

వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ సేవలు ఎప్పుడు?
కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు జిల్లా ఆస్పత్రిలోని మూడు ప్రత్యేక వార్డుల్లో ఆరు వెంటిలేటర్స్, 40 ఆక్సిజన్‌ బెడ్లను సిద్ధం చేశారు. తెలంగాణ స్టేట్‌ మెడికల్‌ సర్వీస్‌ ఇన్‌ప్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంటు కార్పోరేషన్‌ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) పర్యవేక్షణలో వెంటిలేటర్స్, ఆక్సిజన్‌ యంత్రాలను అమర్చారు. కేంద్ర ప్రభుత్వం మూడు వెంటిలేటర్స్‌ అందించగా, రెండు కలెక్టర్‌ నిధుల నుంచి కొనుగోలు చేయగా మరొకటి చంపక్‌హిల్స్‌ ఎంసీహెచ్‌ నుంచి తెప్పించారు. ఇందుకోసం ముగ్గురు వైద్యులను కాంటాక్టు పద్ధతిలో రిక్రూట్‌ చేసుకోగా, మరో 20 మంది స్టాఫ్‌ నర్సులు, వెంటిలేటర్‌ టెక్నీషియన్‌ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. వెంటిలేటర్స్, ఆక్సిజన్‌ వార్డులను సిద్ధం చేసి నెలలు గడిచిపోతున్నా సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో నిర్లక్ష్యం కనిపిస్తుంది. పాజిటివ్, తీవ్రమైన లక్షణాలతో శ్వాస సంబంధిత సమస్యతో బాధపడే పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు అప్పులు చేసి ప్రైవేట్‌కు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా ఆస్పత్రిలో సేవలకు సిద్ధంగా ఉన్న వెంటిలేటర్స్, ఆక్సిజన్‌ సేవలను త్వరితగతిన అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

సేవలను త్వరితగతిన ప్రారంభిస్తాం
జిల్లా ఆస్పత్రిలో మూడు వార్డుల్లో ఆరు వెంటిలేటర్లు, 40 ఆక్సిజన్‌ పరికరాలను అమర్చారు. కరోనా పేషెంట్లకు అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయి. టీఎస్‌ఎం ఎస్‌ఐడీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల్లో ఇన్‌స్టాలేషన్‌ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం కరీంనగర్‌ జిల్లాలో జరుగుతున్న పనులు పూర్తి కాగానే ఇక్కడకు రానున్నారు. సేవలను త్వరతగతిన ప్రారంభించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం ముగ్గురు వైద్యులను రిక్రూట్‌ చేసుకోగా, స్టాఫ్‌నర్సు, వెంటిలేటర్‌ టెక్నీషియన్‌ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది.– డాక్టర్‌ పుజారి రఘు, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top