
ఒక్క మార్కుతోనే కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికవలేదని కుంగిపోలేదా యువతి.. చదువు, ఉద్యోగ ప్రయత్నాలతో పాటు.. తండ్రికి సాయంగా మేకలు కాసేందుకు రోజూ అడవిబాట పడుతోంది. పెద్దపల్లి జిల్లా సబ్బితం గ్రామానికి చెందిన నూనె నర్సయ్యకు కొడుకు, కూతురు ఉన్నారు. చదువుల్లో రాణిస్తూనే కూతురు కల్యాణి తండ్రికి సాయంగా మేకలతో ఊరి పొలిమేరల్లోని గుట్టల్లోకి వెళ్తోంది. ఆర్మీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నానని, ఈసారి ఉద్యోగం తనదేనని ధీమాగా చెప్పింది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి
ట్రాక్టర్‌పై సీతక్క ప్రయాణం
ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లి గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేదు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ద్వారా ఎలిశెట్టిపల్లి గ్రామంలో రూ.15 లక్షలతో ప్రాథమిక పాఠశాల భవనం నిర్మించింది. కానీ ఎలిశెట్టిపల్లి గ్రామానికి రోడ్డు మార్గం లేదు. దీంతో పాఠశాల భవనం ప్రారంభోత్సవానికి.. మంత్రి సీతక్క ట్రాక్టర్‌పై కూర్చొని జంపన్నవాగు దాటి వెళ్లారు. ఈ వాగుపై వంతెన నిర్మించాలని అక్కడి ప్రజలు మంత్రిని వేడుకున్నారు. వంతెన నిర్మాణానికి తనవంతు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.